Soybean | సోయాబీన్ పంటను కొనుగోలు చేయలేమని రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేయడంపై రైతులు ఆందోళన చేపట్టారు. వానాకాలం సీజన్లో పండించిన సోయా, మక్క పంటలను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండల కేంద్రంలో నిరసన తెలిపారు. మండల కేంద్రంలో బంద్ పాటించారు.
మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను మూసివేస్తే తాము పంటను ఎలా అమ్ముకోవాలని రైతులు ప్రశ్నించారు. ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో ప్రైవేటు వ్యాపారులు తక్కువ ధరకే అడుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సోయా, మక్క పంటలను వెంటనే కొనుగోలు చేసి, నష్టపోకుండా చూడాలని రైతులు డిమాండ్ చేశారు.