Cancer | సియోల్, డిసెంబర్ 27: ప్రాణాంతక క్యాన్సర్ వ్యాధి చికిత్సకు సౌత్ కొరియాకు చెందిన శాస్త్రవేత్తలు కొత్త విధానాన్ని అభివృద్ధి చేశారు. క్యాన్సర్ కణాలనే సాధారణ కణాలుగా మార్చి వ్యాధిని అంతం చేయవచ్చని వీరు జరిపిన పరిశోధనలో తేలింది. కొరియా అడ్వాన్స్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ(కేఏఐఎస్‌టీ)కు చెందిన శాస్త్రవేత్తలు కొలన్ క్యాన్సర్‌పై పరిశోధన జరిపారు. ఇందుకోసం సాధారణ కణాల అభివృద్ధి కోసం పని చేసే జన్యు వ్యవస్థ డిజిటల్ మాడల్‌ను వినియోగించారు. కొలన్ క్యాన్సర్ కణాల్లో ఉండే ఎంవైబీ, హెచ్‌డీఏసీ2, ఎఫ్ఓఎక్స్ఏ2 అనే అణువులను అణిచివేస్తే ఈ కణాలను సాధారణ కణాలుగా మార్చవచ్చని వీరు గుర్తించారు.
సాధారణంగా ఇప్పుడున్న క్యాన్సర్ చికిత్స విధానాల్లో క్యాన్సర్ కణాలను అంతం చేయడం ద్వారా వ్యాధిని నియంత్రిస్తారు. ఈ చికిత్సలు చేస్తున్నప్పుడు శరీరంలోని ఇతర ఆరోగ్యకరమైన క్యాన్సర్ కణాలు సైతం దెబ్బ తింటాయి. తాము ప్రతిపాదిస్తున్న కొత్త చికిత్స విధానం ద్వారా మాత్రం ఈ దుష్ప్రభావాలు ఉండవని కేఏఐఎస్‌టీ ప్రొఫెసర్ క్వాంగ్ హ్యూన్ చో తెలిపారు. కొలన్ క్యాన్సర్‌లోనే కాకుండా ఇతర క్యాన్సర్లలోనూ ఈ విధానం సఫలమయ్యే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.
జుట్టు రంగుతో క్యాన్సర్ ముప్పు!
హెయిర్ డై, స్ట్రెయిటనర్స్ను తరచూ వాడితే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎండోక్రిన్కు అంతరాయం కలిగించే రసాయనాలు వీటిలో ఉంటాయి. అవి శరీరంలోని హార్మోన్ల కార్యకలాపాలను ప్రభావితం చేస్తాయి. పర్మనెంట్ హెయిర్ డైస్లో ఆరోమాటిక్ అమైన్స్, పారాబెన్స్ వంటివాటిని వాడతారు. కెమికల్ స్ట్రెయిటనర్స్లో ఫార్మాల్డిహైడ్ వంటివి ఉంటాయి. ఈ రసాయనాలు డీఎన్ఏను దెబ్బతీయగలవు, తద్వారా క్యాన్సర్ ముప్పు పెరుగుతుంది. తలపై ఉండే చర్మం గుండా లోపలికి ఫార్మాల్డిహైడ్ చొచ్చుకుపోగలదు.
హెయిర్ ైస్టెలింగ్ కోసం వేడి చేసినపుడు ఇది మరింత బాగా చొచ్చుకుపోతుంది. ప్రముఖ గైనకాలజిస్ట్, అబ్‌స్టెట్రీషియన్ డాక్టర్ మోనిక మాట్లాడుతూ, ఈ రసాయనాలు చర్మం గుండా శరీరంలోకి ప్రవేశించి, శరీరంలోనే వృద్ధి చెందుతాయన్నారు. ఫలితంగా హార్మోన్ అసమతుల్యతలు ఏర్పడతాయని, వక్షోజాల టిష్యూ వృద్ధి ప్రభావితమవుతుందని చెప్పారు. ఈస్ట్రోజన్ లెవెల్స్‌పై కూడా ప్రభావం పడుతుందన్నారు. ఈ ఉత్పత్తులను అప్పుడప్పుడు వాడటం వల్ల ముప్పు ఉండకపోవచ్చునని తెలిపారు.