శేరిలింగంపల్లి, నవంబర్ 4(నమస్తే తెలంగాణ): నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేపింది. గచ్చిబౌలిలోని ఓ కోలివింగ్ గెస్ట్ రూమ్‌లో జరుగుతున్న డ్రగ్స్ పార్టీపై ఎస్ఓటీ దాడి చేసి బహిర్గతం చేసింది. రాత్రి వేళలో యువతీయువకులు డ్రగ్స్ మత్తులో మునిగిపోయి పార్టీ చేసుకుంటుండగా పోలీసులు దాడి చేశారు. ఈ ఆపరేషన్‌లో మొత్తం 13 మందిని అరెస్ట్ చేశారు. దర్యాప్తులో కీలక వివరాలు బయటపడ్డాయి. కర్ణాటక రాష్ట్రం నుంచి డ్రగ్స్‌ను స్మగ్లింగ్ చేసి హైదరాబాద్‌లోని యువతీయువకులకు సరఫరా చేస్తున్న గుత్తా తేజకృష్ణ అనే ప్రధాన స్మగ్లర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడితో పాటు డ్రగ్స్ సరఫరాలో పాలుపంచుకున్న నైజీరియన్ పౌరుడు కూడా అరెస్టయ్యాడు.
పీజీ హాస్టల్ కేంద్రంగా డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం గచ్చిబౌలిలోని మాదాపూర్ డీసీపీ కార్యాలయంలో అడిషనల్ డీసీపీ ఎన్.ఉదయ్‌రెడ్డి మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈనెల 3వ తేదీన గచ్చిబౌలి టీఎన్జీవోకాలనీలో ఎంఎస్ లగ్జరీ కోలివింగ్ పీజీ హాస్టల్లో డ్రగ్ ఫెడ్లర్ ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం అందింది. ఈ మేరకు అక్కడికి చేరుకున్న మాదాపూర్ ఎస్వోటీ, గచ్చిబౌలి పోలీసులు దాడి చేయగా.. కడపకు చెందిన తేజకృష్ణ, ఐటీ ఉద్యోగి లోకేష్రెడ్డిలను అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరి నుంచి కొంత ఎండీఎంఏ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిచ్చిన సమాచారం మేరకు మాదాపూర్‌లోని నైట్ ఐ హోటల్లో డ్రగ్ ఫెడ్లర్ వెన్నెల రవికిరణ్ అలియాస్ భాను, పెద్దమంతూర్ హర్షవర్ధన్ రెడ్డి, మన్నె ప్రశాంత్, సాజీర్ మతుంగార్లను అదుపులోకి తీసుకున్నారు.
ఈ రెండు ప్రాంతాల్లో రూ.2లక్షల విలువైన 32.14 గ్రాముల ఎండీఎంఏ, 4.67 గ్రాముల గంజాయి, 6 సెల్ఫోన్లు, రూ.10 నగదు, రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు ఏడీసీపీ ఉదయ్‌రెడ్డి పేర్కొన్నారు. ఆరుగురు నిందితులతోపాటు డ్రగ్స్ వినియోగదారులు పృథ్వీ, విష్ణువర్ధన్, కార్లపుడి ప్రెస్లీ సుజీత్, మేకల గౌతమ్, గుండెబోయిన నాగార్జున, గుంటక సతీష్‌రెడ్డిలను అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితుల్లో ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు కుడా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.
వీరికి డ్రగ్స్ సఫ్లయ్ చేసే ఇద్దరు ప్రదాన నైజీరియన్ నిందితులు, కన్జుమర్స్ వినయ్, లక్ష్మణ్, రిజ్వాన్, కార్తీక్, వంశీ, హర్ష తదితరులు పరారీలో ఉన్నట్లు తెలిపారు. పీజీ హాస్టల్స్, గెస్ట్‌హౌజ్ యజమానులకు అవగాహన కల్పిస్తున్నామని, డ్రగ్స్ విషయమై వెంటనే సమాచారం ఇవ్వాలని, హాస్టళ్లలో బసచేసేవారి కదలికలపై నిఘా వేయాలని సూచించామన్నారు. ఈకార్యక్రమంలో మాదాపూర్ ఏసీపీ శ్రీధర్, గచ్చిబౌలి సీఐ హబీబ్బుల్లాఖాన్, ఎస్వోటీ ఇన్స్పెక్టర్ అంజిరెడ్డి, డీఐ నరేశ్ తదితరులు పాల్గొన్నారు.