సిటీబ్యూరో, నవంబర్ 4(నమస్తే తెలంగాణ): నగరంలోని ఓ డాక్టర్ ఇంట్లో పోలీసులు డ్రగ్స్ పట్టుకోవడం కలకలం రేపింది. ఈజీగా డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో డాక్టర్ తన స్నేహితులతో కలిసి ఇంట్లో నుంచే డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారు. పక్కా సమాచారంతో మంగళవారం ముషీరాబాద్‌లోని డాక్టర్ ఇంటిపై దాడి చేసిన ఎక్సైజ్ ఎస్టీఎఫ్ పోలీసులు రూ.3 లక్షల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. 15 గ్రాముల ఎల్ఎస్డీ బోల్ట్, 1.32గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ముషీరాబాద్‌లో అద్దెకు ఉంటున్న డాక్టర్ జాన్‌పాల్ ఇంట్లో ఆరు రకాల డ్రగ్స్ పట్టుకున్నారు.
ఈజీగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ప్రమోద్, సందీప్, శరత్ అనే ముగ్గురు స్నేహితులతో కలిసి జాన్‌పాల్ డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారు. ఢిల్లీ, బెంగళూరు, గోవా ప్రాంతాల నుంచి డ్రగ్స్ తెచ్చి డాక్టర్ ఇంట్లో ఉంచి అమ్మకాలు జరుపుతున్నారు. డ్రగ్స్ విక్రయించినందుకు గాను వైద్యుడికి, అతడి స్నేహితులు ఉచితంగా ఇస్తున్నారని ఎస్టీఎఫ్ టీమ్ లీడర్ ప్రదీప్‌రావు తెలిపారు.
దీంతో ఆ పీజీ వైద్యుడు డ్రగ్స్‌కు బానిసయ్యాడని, డ్రగ్స్ దందాపై సమాచారం అందిన వెంటనే ఎస్టీఎఫ్ ఎస్సై బాలరాజు, కానిస్టేబుల్ విజయ్‌కృష్ణ, సిబ్బంది కలిసి డాక్టర్ జాన్‌పాల్ ఇంట్లో సోదాలు చేయగా.. డ్రగ్స్ లభించినట్లు ప్రదీప్‌రావు పేర్కొన్నారు. జాన్‌పాల్ ఇంట్లో 26.95గ్రాముల ఓజికుష్, 6.21 గ్రాముల ఎండీఎంఏ, 15 ఎల్ఎస్డీ బాస్ట్స్, 1.32గ్రాముల కొకైన్, 5.80గ్రాముల గుమ్మస్, 0.008గ్రాముల హాషిస్ ఆయిల్‌ను స్వాధీనం చేశారు. ప్రస్తుతం పోలీసులు జాన్‌పాల్‌ను అరెస్ట్ చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారని, వీరిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. ఒక డాక్టర్ వద్ద డ్రగ్స్‌ను పట్టుకున్న ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సిబ్బందిని అభినందించిన డైరెక్టర్ షానవాజ్‌ఖాసీం ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.