ఖైరతాబాద్, నవంబర్ 4: వయసులో పెద్దవాడని కూడా చూడకుండా ముగ్గురు యువకులు దురుసుగా ప్రవర్తించి, నిలదీసినందుకు మెట్రో ట్రాక్‌పై తోసివేశారు. ఈ ఘటన సైఫాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన ప్రకారం… బేగంపేటకు చెందిన న్యాయవాది జి.కృష్ణ కిశోర్(62) గత నెల అమీర్‌పేట నుంచి లక్డీకాపూల్‌కు మెట్రోలో బయలుదేరాడు. ఆ సమయంలో వయోవృద్ధుల సీటులో కూర్చుకున్న నిజాంపేట బాలాజీనగర్‌కు చెందిన సివ్వల సునీల్‌కుమార్(32), కలిశెట్టి అశోక్(34), మన్యం జిల్లా బామిని మండలం గురండా గ్రామానికి చెందిన సివ్వల రాజేశ్(34)లను తనకు సీటు ఇవ్వాల్సిందిగా కోరాడు.
దీంతో పరుశ పదజాలంతో దూషించారు. అంతటితో ఆగకుండా లక్డీకాపూల్ స్టేషన్లో దిగిన బాధితుడిని మెట్రో ట్రాక్‌పై తోసేశారు. ఈ ఘటనలో ఆయనకు గాయాలయ్యాయి. దీంతో ఆ వృద్ధుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా, నాటి నుంచి నిందితుల కోసం గాలించిన పోలీసులు సోమవారం నిందితులను అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు.