సిటీబ్యూరో, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, అతని అనుచరులు రౌడీయిజాన్ని ప్రదర్శిస్తూ చిరు వ్యాపారులు, సామాన్య ప్రజలపై దౌర్జన్యం చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఎన్నికలో తమకు మద్దతు తెలపాలని లేకుంటీ మీ పనిపడుతామంటూ బెదిరింపులకు దిగుతున్నట్లు నియోజవర్గంలో పలువురు మాట్లాడుకుంటున్నారు. కృష్ణకాంత్ పార్కు వద్ద ఒక చిన్న కూరగాయల మార్కెట్లో చిరు వ్యాపారులు తమ వ్యాపారాలను సాగిస్తున్నారు. అక్కడున్న వ్యాపారులకు పెద్దమనిషిగా వ్యవహరించే ఒక వ్యక్తిని బెదిరించి, తమకు మద్దతు తెలపాలని లేదంటే ఇక్కడ మార్కెట్ లేకుండా చేస్తామంటూ బెదిరింపులకు దిగడంతో చిరు వ్యాపారులు షాక్‌కు గురయ్యారు. ఇదెక్కడి అన్యాయం అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. మరోచోట ఒక భవన యజమాని నిబంధనలకు విరుద్ధంగా భవనం నిర్మించాడని బెదిరించి అతనిని తమ పార్టీలో చేరాలంటూ బెదిరింపులకు దిగారు. ఇలా.. బస్తీలు, కాలనీల్లో ఇతర పార్టీలకు చెందిన చిన్నచిన్న లీడర్లను టార్గెట్ చేస్తూ బెదిరింపులకు దిగుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
ఇప్పుడే ఇట్లుంటే…!
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్‌యాదవ్ కుటుంబానికి నేర చరిత్ర ఉండటంతో పాటు రౌడీషీటర్‌గా ముద్ర పడింది. ఎన్నిక సమయంలోనే నవీన్‌యాదవ్ మద్దతుదారులు స్థానికంగా ఉండే చిరువ్యాపారులను బెదిరించి తమ పనులు చేసుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఉప ఎన్నికలో ప్రజలు బీఆర్ఎస్ వైపే ఉండటంతో కాంగ్రెస్ పార్టీకి మింగుడుపడటం లేదు. ఎలాగైనా ఓడిపోవడం ఖాయమని తేలిపోవడంతో కనీసం విలువైనా కాపాడుకోవాలని తాపత్రయ పడుతున్నారని ఆ పార్టీ ప్రధాన నాయకుల్లో చర్చ జరుగుతున్నట్లు సమాచారం. స్థానికంగా ఉండే కాంగ్రెస్ నాయకులు కూడా పూర్తిస్థాయిలో ఆ పార్టీ అభ్యర్థికి మద్దతు తెలుపకపోవడం, హైదరాబాద్ జిల్లాకు చెందిన కీలక నాయకులు ఎవరూ కూడా ప్రచారంలో పాల్గొనకపోవడంతో కాంగ్రెస్‌లోని అంతర్గత కలహాలు బయటపడుతున్నాయని జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు మాట్లాడుకుంటున్నారు.
ప్రచారానికి వస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు ఏదో ప్రచారం చేశామని చెప్పుకోవడం కోసం కరపత్రాలు పంచి పోతున్నారు. అలా కొందరు మంత్రులు వచ్చినప్పుడు పార్టీలో చేరికలు ఉండేలా చూసుకోవాలంటూ కాంగ్రెస్ అభ్యర్థ్ధికి సూచనలు చేయడంతో ఇక అభ్యర్థి అనుచరులు చిరు వ్యాపారులపై విరుచుకుపడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, అతని అనుచరుల ఆగడాలు ఇప్పుడే ఇట్లుంటే.. రేపు ఎన్నికలు పూర్తయిన తర్వాత ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చంటూ సామాన్యులు చర్చించుకుంటున్నారు. రౌడీయిజంతో సామాన్యులను బెదిరించేందుకు ప్రయత్నిస్తున్నారని ఇలాంటి వాటికి బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికీ భయపడదంటూ బీఆర్ఎస్ శ్రేణులు హెచ్చరిస్తున్నారు.
కాంగ్రెస్‌లో పార్టీలో చేరాలని బెదిరింపులు
కాంగ్రెస్ అభ్యర్థ్ధి అనుచరుల బెదిరింపులతో జూబ్లీహిల్స్ ప్రజలు బెంబేలెత్తుతున్నారు. రౌడీ షీటర్ ముద్ర ఉన్న కుటుంబంలోని సభ్యుడికి కాంగ్రెస్ పార్టీ ఉప ఎన్నికలో అసెంబ్లీ టికెట్ ఇవ్వడంతోనే జూబ్లీహిల్స్‌లో రౌడీరాజకీయం ప్రారంభమయ్యింది. ఇప్పుడు ఉప ఎన్నిక ప్రచారంలో ఆ విషయం స్పష్టంగా కనిపిస్తున్నదంటూ కాలనీలు, బస్తీల ప్రజలు మాట్లాడుకుంటున్నారు. చిరు వ్యాపారులను బెదిరించడం, బస్తీల్లోని చోటామోటా లీడర్లను బెదిరించి తమ పార్టీ కండువా కప్పుకోవాలని కాంగ్రెస్ నేతలు ఒత్తిళ్లు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయాలతో సంబంధం లేకుండా తమ పనులు తాము చేసుకునే సామాన్యులపై సైతం కాంగ్రెస్ అభ్యర్థి అనుచరుల బెదిరింపులు పెరిగిపోతున్నాయంటూ ఆరోపణలు వస్తున్నాయి.
అధికార పార్టీకే వంత పాడుతున్న పోలీసులు!
కాంగ్రెస్ పార్టీ నాయకులకు స్థానిక పోలీసులు కూడా మద్దతు తెలుపుతున్నారని ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో బెదిరింపులకు పాల్పడుతున్నవారిపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడానికి కూడా భయపడే పరిస్థితులున్నాయని స్థానికంగా టాక్. ఉప ఎన్నిక ప్రచారంలోనే ఇలాంటి రౌడీయిజాన్ని ప్రదర్శిస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి భవిష్యత్‌లో మరెన్ని దాడులు చేసి ప్రజలను వేధిస్తాడో అంటూ ప్రజలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. అభివృద్ధ్ది, సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లే మాగంటి సునీతాగోపీనాథ్కు మద్దతుగా నిలవాలని ఇప్పటికే ప్రతి ఒక్కరూ అభిప్రాయానికి వచ్చినట్లు జోరుగా చర్చ జరుగుతున్నది. ప్రతి ఒక్కరూ అభిప్రాయానికి వచ్చినట్లు జోరుగా చర్చ జరుగుతున్నది.