
హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): అన్ని వర్గాలకు అడిగిన దానికంటే ఎక్కువే చేస్తున్న సీఎం కేసీఆర్.. తమను కూడా ఆదుకోవాలని గ్రామీణ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు విజ్ఞప్తి చేశారు. ఏదైనా తప్పు చేస్తే క్షమించి తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవాలని వేడుకున్నారు. శనివారం కాచిగూడలో ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ల రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. 7,651 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు ఉద్యోగాలు కోల్పోయారని, వారిని తిరిగి విధుల్లోకి తీసుకొంటే వారి కుటుంబాలు కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటాయని తెలిపారు. సమావేశంలో తెలంగాణ ఫీల్డ్ అసిస్టెంట్ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ ముదిగొండ శ్యామలయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సాయేందర్, ఆంజనేయులు, భాగ్య, సుమలత, సరస్వతి, ైస్కెలాబ్, వసీమ, బోర్కర్ రాజు పాల్గొన్నారు.