న్యూఢిల్లీ : వాహనాల్లో ఈ20 ఇంధన వినియోగాన్ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ(Nitin Gadkari) సమర్థించుకున్నారు. ఇథనాల్ కలిసిన పెట్రోల్ వాహనాల గురించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇథనాల్ వల్లే వాహనాల్లో సమస్యలు వస్తున్నట్లు నిందారోపణలు చేయరాదు అన్నారు. ఈ20 పెట్రోల్ వల్ల తన మెర్సిడీజ్ బెంజ్ ఎస్‌యూవీలో మైలేజీ తగ్గిందని, ఆ పెట్రోల్ వల్ల ఇంజిన్ సమస్య వచ్చినట్లు యూట్యూబర్, వ్లోగర్ సౌరవ్ జోషి తన వీడియోలో పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో మెర్సిడీజ్-బెంజ్ ఇండియా కంపెనీ ఓ ప్రకటన చేసింది. ఈ20 ఫ్యూయల్‌కు తగినట్లు బీఎస్6 పెట్రోల్ వాహనాలు ఉన్నాయని ఆ కంపెనీ చెప్పింది. బెంజ్ కంపెనీ వివరణ ఇవ్వడంతో ఈ20 వివాదంపై చర్చ మరింత ముదిరింది.
ఈ20 ఆందోళనల నేపథ్యంలో కేంద్ర మంత్రి గడ్కరీ మాట్లాడుతూ.. ప్రత్యామ్నాయ ఇంధనం వైపు ప్రజలను మళ్లించే అంశంలో ప్రభుత్వం పారదర్శకంగా ఉన్నట్లు తెలిపారు. ప్రజలకు వాస్తవాలు తెలుసు అని, తమ విధానం, రోడ్‌మ్యాప్.. ప్రజలను బయోఫ్యూయల్స్ వైపు మళ్లించడమే అని ఆయన అన్నారు. ఇంధనం అంశంలో స్వయం సమృద్ధి సాధించాలని, ఆత్మనిర్భర్ భారత్ విజన్ ఇదే అని ఆయన అన్నారు. ప్రతి వాహనంలో మెకానికల్ సమస్యలు వస్తాయని, వాటిని ఆటోమెటిక్‌గా ఇథనాల్ బ్లెండింగ్‌తో లింక్ చేయవద్దు అని గడ్కరీ అన్నారు. వాహనాల్లో సమస్య వస్తే, వాటి ఓనర్లు ముందుగా తనిఖీ చేసుకోవాలని, కానీ ఇంధనం వల్లే ఆ సమస్య వచ్చిందని ఇథనాల్‌కు లింకు చేయరాదు అని అన్నారు.
ఈ20 ఫ్యూయల్.. కొత్త, పాత వాహనాలకు సురక్షితమైందని మంత్రి గడ్కరీ అన్నారు. తప్పుడు సమాచారంతో గందరగోళం సృష్టిస్తున్నారని, వాస్తవాల కన్నా ఎక్కువగా రాజకీయాలు క్రియేట్ చేస్తున్నట్లు ఆయన ఆరోపించారు.