పెదాలపై విరబూసే నవ్వు ఎదలోతుల్లోని ఆవేదనను దూరం చేస్తుంది. కళ్లలో కనిపించే నవ్వు.. మనసైన వారికి తెగ నచ్చేస్తుంది. ఎరుపెక్కిన బుగ్గలపై తుళ్లిపడే నవ్వు.. కోటి ఆశలను రేకెత్తిస్తుంది. నవ్వు నాలుగు విధాల చేటు అని అన్నవాళ్లు.. నవ్వడం రాని దురదృష్టవంతులు అంటారు పెద్దలు! కానీ, నిఖార్సైన నవ్వు నలభై రకాలుగా మేలు చేస్తుందని ఎన్నో అధ్యయనాలు కుండబద్దలు కొట్టాయి.
ఏదైనా మాట్లాడే ముందు శ్రీరామచంద్రుడి మోములో చిరుదరహాసం వికసించేదట. నవ్వును మించిన భావ ప్రకటన లేదని అవతార పురుషుడు యుగాల కిందటే తేల్చిచెప్పాడు. ఆ విషయాన్నే నేటికీ ఎందరో పరిశోధకులు పరిపరి విధాలుగా అధ్యయనాలు చేసి నిరూపిస్తున్నారు కూడా! మందహాసమైనా.. వికటాట్టహాసమైనా.. నవ్వులు రువ్విన ప్రతిసారీ మానసిక ఒత్తిళ్లన్నీ దూరమైపోతాయి. మనం నవ్వినప్పుడే కాదు, ఎదుటివారి నిష్కల్మషమైన నవ్వును చూసినప్పుడూ.. మనసు తేలికపడుతుంది. మనసారా నవ్వినా, మనసైన వారి నగుమోము చూసినా..
శరీరంలో ఒత్తిడి కలిగించే హార్మోన్లు బలహీనమవుతాయని కొన్ని పరిశోధనల్లో తేలింది. అదే సమయంలో రోగ నిరోధక శక్తిని పెంచే కణాల సంఖ్య కూడా పెరుగుతుందని వెల్లడైంది. అంతేకాదండోయ్. కిలకిల నవ్వులు చిలికినపుడు.. శరీరంలో ఎండార్ఫిన్లు విడుదలై నాడీ వ్యవస్థను చైతన్య పరుస్తాయట. రక్త ప్రసరణను కూడా ప్రభావితం చేసే శక్తి నవ్వుకు ఉంది. రక్తపోటు, గుండెకు సంబంధించిన సమస్యలు ఉన్నవారు.. నవ్వుతూ బతికితే ఆరోగ్యం మెరుగవుతుంది. అందుకే మనోవ్యాధులకే కాదు శారీరక రోగాలకూ ‘లాఫ్టర్ థెరపీ’ మంచి ఔషధం అంటారు వైద్యులు.
నవ్వు మంచిదని.. అసందర్భంగా నవ్వొద్దు. మయసభలో ద్రౌపది నవ్వు కురుక్షేత్ర సంగ్రామానికి నాంది పలికింది. నవ్వులపాలు కాకుండా ఎన్ని నవ్వులు రువ్వినా వచ్చే ముప్పేం లేదు. ఒక్కో నవ్వుకు ఒక్కో అర్థం కూడా ఉందని శాస్త్రకారుల అభిప్రాయం. మోనాలిసా చిత్తరువులో మందహాసం వెనుక మతలబు కనుక్కోవడానికి గతంలో ఎన్నో పరిశోధనలు జరిగాయంటే ఆశ్చర్యం కలగకమానదు. ఏదేమైనా.. నవ్వుతూ బతకడంలో ఉన్న ఆనందం మరెందులోనూ లేదన్నది సత్యం. అందుకే మనసారా నవ్వండి.