వర్షాకాలం మొదలు కాబోతున్నది. ఈ కాలంలో వాహనాలను మరింత జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. లేకుంటే.. వానలతో వాటికి నష్టం కలిగే అవకాశం ఉంది. కాబట్టి, భారీ వర్షాలు మొదలుకాకముందే.. వాహనాల విషయంలో కొన్ని ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలి. అందుకోసం.. కింది చిట్కాలు పాటించాలి.
వర్షాకాలం ప్రారంభంలోనే చేయాల్సిన ముఖ్యమైన పని.. వాహనాలకు సర్వీసింగ్ చేయించుకోవడం. అప్పుడే.. వర్షాకాలాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటాయి. వాహనాల టైర్లను ఒకటికి రెండుసార్లు తప్పకుండా చెక్ చేసుకోవాలి. గ్రిప్పింగ్ అరిగిపోయి ఉంటే.. వెంటనే టైర్లను మార్చేయాలి. లేకుంటే, టైర్లకు తగినంత పట్టుదొరక్క.. వాహనాలు రోడ్లపై జారిపోయే ప్రమాదం ఉంటుంది. అందులోనూ ద్విచక్ర వాహనదారులకు మరింత ప్రమాదకరంగా పరిణమిస్తుంది. కార్లు, ఇతర వాహనాల్లో వైపర్ బ్లేడ్లు సరిగ్గా పనిచేస్తున్నయో లేదో చూసుకోవాలి. అవసరమైతే.. కొత్తవాటిని ఏర్పాటుచేసుకోవాలి. బ్రేక్ల పనితీరు మెరుగ్గా ఉందో లేదో నిర్ధారించుకోవాలి. లేకుంటే.. అవసరమైన మరమ్మతులు చేయించాలి.
వానలతో వాహనాల్లోని ఎలక్ట్రికల్ భాగాలు ఎక్కువగా దెబ్బతింటాయి. కాబట్టి, బ్యాటరీ, హెడ్ల్యాంప్, ఇండికేటర్లు సక్రమంగా పనిచేసేలా చూసుకోవాలి. పాడైపోయినవి ఉంటే.. వెంటనే మార్చుకోవాలి. వర్షం వల్ల బైక్ చైన్లోని లూబ్రికేషన్ పోతుంది. దాంతో తుప్పు పట్టి, దాని పనితీరు తగ్గిపోతుంది. కాబట్టి, యాంటి వాటర్ చైన్ లూబ్రికెంట్ను ఉపయోగించాలి. వాహనాల బాడీపై ఎక్కడైనా గీతలు, డ్యామేజ్ అయితే.. వెంటనే బాగు చేయించుకోవాలి. లేకుంటే.. వానలో తడిస్తే అక్కడ తుప్పుపడుతుంది. దాంతో, ఎక్కువగా పాడయ్యే అవకాశం ఉంటుంది. మరింత రక్షణ కోసం యాంటి రస్ట్ పెయింటింగ్ వేయించుకోవాలి.
నగరాలు, పట్టణాల్లో ముంపు ప్రాంతాలపై అవగాహన కలిగి ఉండాలి. రెగ్యులర్గా వెళ్లే రూట్లలోనూ ఎక్కడెక్కడ వర్షపు నీరు నిలుస్తుందో ముందే తెలుసుకోవాలి. భారీ వర్షాలు కురిసిన రోజుల్లో ఆయా ప్రాంతాలకు వెళ్లకపోవడమే మంచిది. వర్షంలో బయటికి వెళ్లాల్సి వచ్చినప్పుడు తక్కువ వేగంతో ప్రయాణించాలి. ముఖ్యంగా నీళ్లు నిలిచి ఉండే ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలి. వాహనాలను ఎత్తయిన ప్రదేశాల్లోనే పార్కింగ్ చేయాలి. లేకుంటే, వర్షపు నీటిలో మునిగిపోయి.. ఇంజిన్, ఇతర ఎలక్ట్రికల్ ఉపకరణాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది.