పుస్తక సమీక్ష
కథల పొదరిల్లు

ఊహలకు రెక్కలు తొడిగి కథల సాగు చేస్తారు కొందరు. అనుభవాలను అక్షరీకరించి కథలుగా ఆవిష్కరిస్తారు ఇంకొందరు. రచయితలు ఏ మార్గాన్ని ఎంచుకున్నా.. వాస్తవికతకు దగ్గరగా ఉన్న కథలే పాఠకులను అలరిస్తాయి. ‘మబ్బులు వీడిన ఆకాశం’ సంకలనంలోని కథలు అలాంటివే. ఊహల ఊయలలో ఊరిన కథలే అయినా అనుభవాల దొంతరల్లో నుంచి జాలువారినట్టుగా వాటిని తీర్చిదిద్దారు రచయిత్రి. కరోనా కాలంలో మనిషికి మనిషి తోడు ఎంత అవసరమో తెలియజెప్పిన ‘మారిన మనసు’ కథ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. ‘మనసున్న మారాజు’ ఓ తండ్రి కాని తండ్రి గొప్పదనాన్ని చెబుతుంది. ‘బహుమతి’ విధి చేసిన వింతగా తోచినా, చివరికి మెరుపులాంటి మలుపునివ్వడంలో రచయిత్రి తన వైచిత్రిని చాటుకోగలిగారు. అమ్మానాన్నల ఆవశ్యకతను చెప్పే ‘పాత సామాన్లు’, అత్తమామల ప్రాధాన్యాన్ని గుర్తుచేసే ‘పండగ సందడి’ ఇలా ఇందులో పొందుపరిచిన ఇరవై కథలు ఇరవై మేలి ముత్యాలే! ప్రతి కథా సరళంగా సాగిపోతూనే సరైన సందేశాన్నిస్తుంది.
మబ్బులు వీడిన ఆకాశం
రచన: త్రిగుళ్ల లక్ష్మీశర్మ
పేజీలు: 197, వెల: రూ.150
ప్రతులకు: 99512 00324
స్త్రీ హృదయం!

మహిళ సహజ భావుకురాలు. జన్మతః సృజనశీలి. రోజూ చూసే ఆకాశంలోనే, రోజూ చూసే నక్షత్రాలను చూస్తూ రోజూ పొందని అనుభూతిని పొందగలదు. పురుషుడితో పోలిస్తేత స్త్రీ పదకోశం విస్తృతమైందని అధ్యయనాలు కూడా చెబుతున్నాయి. అమ్మ కొంగు పట్టుకుని తిరుగుతున్న వయసులోనే.. అక్షరాలతో అనుబంధమూ, పుస్తకం పట్ల మమకారమూ ప్రారంభం అవుతాయి. ఒక మంచి కవయిత్రి అనిపించుకోవడానికి ఈమాత్రం నేపథ్యం చాలు. కాబట్టే, రెండువందల యాభైమంది కవయిత్రుల కవితా సంకలనం ‘కవితా మేఘమాల’.. మూడొందల పేజీల కవన వర్షం కురిపించింది. ‘కొత్త పెళ్లికూతురిలా ముస్తాబై.. చిలుకలతో పలుకుతూ.. కోయిలతో గొంతు కలుపుతూ..’ శారదా అశోకవర్ధన్ ప్లవనామ సంవత్సరానికి స్వాగతం పలికారు. ‘ఒక నిరంతర పోరాటాన్ని కాల సముద్రంలో ముంచి ఎగరేసే సూర్యోదయం కదా!‘ అంటూ జాతీయ జెండాకు కొత్త నిర్వచనం ఇచ్చారు సి.భవానీ దేవి. ‘బిడ్డ పుట్టినదని-బేలగా మారకు, చదివినంత చదువు- చదువనివ్వు, ఇంటికీర్తి పంచు- ఇంటికి దీపమై’ అంటూ ఆడపిల్లను సిరులతల్లిగా అభివర్ణించారు అనసూయ శంకర. ‘ధర్మగ్లాని దాపురిస్తేనే.. అవతరిస్తానన్నాడు అపర విష్ణువు. కుటుంబ ధర్మాన్ని నిలపడం కోసం అమ్మగా అవతరించడానికి అనునిత్యం నువ్వు సిద్ధం’ అంటూ అమ్మను పరమాత్మకంటే ఓ మెట్టుపైన నిలబెట్టారు సర్వమంగళ గౌరి. అంతేనా, గౌరీపార్వతి బొమ్మన వసంత కోకిల వలసగానం వినిపిస్తే.. లలితా ప్రవల్లిక అందాల ఆమని కోసం స్వాగత గీతం పాడుతారు. ‘మనిషి మనిషిగా జీవించాలంటే ఆటుపోట్లు ఉండి తీరాలి, రాపిడితోనే కదా వెలుతురు, సంఘర్షణతోనే రాటుదేలడమూ సత్యమే’ జయాపజయాలకు అతీమైన జీవనయానాన్ని ప్రబోధిస్తారు తిరునగరి దేవకీదేవి. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఈ సంకలనం జీవితంలోని రెండువందల యాభై కోణాలను తడుముతున్నది. ప్రతి కవితా అమ్మ నేర్పే పద్యం లాంటిదే. పుస్తకం మూసేసిన తర్వాత కూడా నెమరేసుకుంటాం.
కవితా మేఘమాల
250 మంది కవయిత్రుల కవితా సంకలనం, సంకలన కర్త: తెన్నేటి సుధాదేవి
పేజీలు: 312 ; వెల: రూ. 400, ప్రతులకు: ప్రముఖ పుస్తక కేంద్రాలు.
లండన్ అనుభవాలు – చిత్రకళ విశేషాలు

దాదాపు రెండువేల ఏండ్ల చరిత్ర కలిగిన నగరం లండన్. ఇంగ్లండ్ రాజధాని అయిన ఈ నగరం ప్రాచీన, మధ్య, ఆధునిక యుగాల మేలు కలయిక. ఇక్కడ సెయింట్ పాల్స్ కెథడ్రల్, వెస్ట్ మినిస్టర్స్ ఎబ్బీ, బిగ్ బెన్ గడియారం, లండన్ టవర్ మొదలుకొని ఘెర్కిన్, షార్డ్ లాంటి అత్యాధునిక కట్టడాలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తాయి. వీటిని ప్రత్యక్షంగా వీక్షించిన అనుభవంతో క్లుప్తంగా, సరళంగా ‘లండన్ వింతలు విశేషాలు’ శీర్షికన పుస్తక రూపంలో అందించే ప్రయత్నం చేశారు టి.వి.ప్రసాద్. కట్టడాల గురించి మాత్రమే కాకుండా ఎన్నో వింతలు, వినోదాలు, సాంస్కృతిక విశేషాలను పొందుపరచారు రచయిత. మరో పుస్తకం ‘ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారులు’లో చిమాబ్యుయే, వాన్ఘో, పాల్ గుగేన్, రూబెన్స్, పికాసో తదితర మేటి చిత్రకారుల జీవితాలను పరిచయం చేశారు. ‘మిసిమి’ మాసపత్రికలో అచ్చయిన తన వ్యాసాలను పుస్తక రూపంలో వెలుగులోకి తెచ్చారు. కేవలం ఐరోపా దేశాలను సందర్శించిన యాత్రికుడిలా మాత్రమే మిగిలిపోకుండా, తాను తెలుసుకున్న దానిని పదిమందికీ తెలియ జేయాలన్న రచయిత తపన ఈ పుస్తకాల్లో కనిపిస్తుంది. లండన్ సందర్శకులకు ఇదో యాద్రా దర్శినిలా పనిచేస్తుంది.
లండన్ వింతలు విశేషాలు
పేజీలు : 176; వెల: రూ. 150
ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారులు
పేజీలు: 116; వెల: రూ. 150
రచన: టి.వి.ప్రసాద్
ప్రతులకు: రచయిత,
ఫోన్: 07981398250
బుక్ షెల్ఫ్

రవి (కవన తరంగాలు)
రచన: ఎస్.పి. రవిశంకర్
పేజీలు: 148, వెల: రూ. 150
ప్రచురణ:
అచ్చంగా తెలుగు ప్రచురణలు
ప్రతులకు: acchamgatelugu@
gmail.com.
ఫోన్: 85588 99478
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

