Congress Govt | హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ): త్వరలో కొత్త మద్యం బ్రాండ్లను తీసుకొచ్చే ఆలోచనే లేదని, తమకు లేని ఆలోచన పుట్టిస్తున్నారని గత మంగళవారం రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మీడియాతో చెప్పారు. కొత్త ప్రభుత్వంలో ఇప్పటివరకు ఎవరూ కొత్త మద్యం బ్రాండ్ ప్రవేశపెడతామని దరఖాస్తు కూడా చేసుకోలేదని, మద్యం కొత్త పాలసీపై తాము ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కూడా స్పష్టంచేశారు. తమ ప్రభుత్వంపై తప్పుడు వార్తలు ప్రచురించిన నమస్తే తెలంగాణపై రూ.100 కోట్లకు పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. కానీ సరిగ్గా వారం కూడా తిరగకముందే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కొత్త మద్యం కంపెనీలు తమ ఉత్పత్తులను రాష్ట్రంలో అమ్ముకోవడానికి అనుమతులు ఇచ్చే ప్రక్రియను మొదలుపెట్టింది. నమస్తే తెలంగాణ కథనాన్ని నిజం చేస్తూ.. సోం డిస్టిలరీస్ అండ్ బ్రూవరీస్ లిమిటెడ్ అనే కంపెనీ తన బ్రాండ్ బీర్లను అమ్ముకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతులు ఇచ్చినట్టు సోమవారం ప్రకటించింది. ఈమేరకు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్కు కూడా సమాచారం ఇచ్చినట్టు వెల్లడించింది. సోం డిస్టిలరీస్ సంస్థ త్వరలోనే తన బీరు ఉత్పత్తులను రాష్ట్రంలో సరఫరా చేయనున్నది. ఈ మేరకు ఆ సంస్థ ఇప్పటికే మద్యం దుకాణాలు, రిటైల్ ఔట్లెట్లను కూడా సంప్రదిస్తున్నది. రాష్ట్ర మద్యం విధానం ప్రకారం కేవలం రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే కంపెనీల నుంచి బీరు కొని రాష్ట్రంలోని రిటైల్ ఔట్లెట్లకు మద్యం సరఫరా చేస్తుంది. బయటి వ్యక్తులు నేరుగా కంపెనీల నుంచి మద్యం కొనే అవకాశం లేదు. మద్యం రిటైలర్ల నుంచి ఆర్డర్లు తీసుకొని వారి డిమాండ్ మేరకు రాష్ట్ర ప్రభుత్వమే తయారీ కంపెనీలకు ఆర్డర్లను పెడుతుంది.
అనుమతులే ఇవ్వలేదన్నారు..
రాష్ట్రంలో గత రెండు నెలలుగా బీర్ల కొరత తీవ్రంగా ఏర్పడింది. కొన్ని బ్రాండ్ల మద్యం దొరకకుండా చేశారని, కృత్రిమ కొరత సృష్టించారని ఆరోపణలు వచ్చాయి. మద్యం ప్రియులు కొన్ని చోట్ల బహిరంగంగా కూడా నిరసన వ్యక్తం చేశారు. దీనిపై ‘నమస్తే తెలంగాణ’ పత్రిక లోతుగా విశ్లేషించి గత ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది. కొన్ని కొత్త బ్రాండ్లను తెలంగాణ మార్కెట్లోకి తెచ్చే ప్రయత్నంలో భాగంగానే బీర్లతోపాటు, కొన్ని మద్యం బ్రాండ్లను తొక్కిపెడుతున్నారన్న అనుమానాలు మద్యం ప్రియుల్లో వ్యక్తమవుతున్నట్టు పేర్కొంది. దీనిపై స్వయంగా మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందిస్తూ ‘రాష్ట్రంలో కొత్త బ్రాండ్ల కోసం ఎవ్వరూ దరఖాస్తే పెట్టలేదు. మద్యం కొత్త పాలసీపై తాము ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రజాస్వామ్యంలో కొత్త మద్యం బ్రాండ్లను కోరుకునే హక్కు ప్రజలకు ఉన్నది’ అని గత మంగళవారం గాంధీభవన్‌లో ప్రెస్మీట్లో చెప్పారు. కానీ, సరిగ్గా వారం రోజులు తిరిగేసరికి రాష్ట్రంలో కొత్త మద్యం కంపెనీలకు అనుమతులు వచ్చేశాయి. ఇప్పుడు సోం డిస్టిలరీస్ కంపెనీకి చెందిన బ్రాండ్లే కాదు.. మరికొన్ని కొత్త బ్రాండ్ల మద్యం కూడా రానున్నట్టు ఎైక్సెజ్ శాఖ వర్గాలు చెప్తున్నాయి.
సోం డిస్టిలరీస్ ఎవరిది..?
మధ్యప్రదేశ్‌కు చెందిన సోం డిస్టిలరీస్ దేశంలో అత్యంత వివాదాస్పద మద్యం తయారీ కంపెనీల్లో ఒకటి. కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల ఫండింగ్‌లో ఈ సంస్థ కీలకంగా వ్యవహరించినట్టు బ్యాంకు ఆధారాలున్నాయి. కాంగ్రెస్ పార్టీ కీలక నేత దిగ్విజయ్‌సింగ్ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు (1999-2000లో) సోం డిస్టిలరీస్ అండ్ బ్రూవరీస్ సంస్థకు అనేక రాయితీలు, మినహాయింపులు ఇచ్చినట్టు విమర్శలున్నాయి. సోం డిస్టిలరీస్ నిర్వహించే కార్యక్రమాలకు, ఆ కంపెనీ యజమానుల ఇండ్లలో జరిగే కార్యక్రమాలకు దిగ్విజయ్‌సింగ్ రెగ్యులర్ అతిథి అన్న ఆరోపణలున్నాయి. దిగ్విజయ్‌సింగ్ ఆ సంస్థ నుంచి అప్పట్లోనే రూ.12 కోట్లు స్వీకరించినట్టు కంపెనీపై ఐటీ దాడులు జరిగినపుడు బయటపడింది. కాంగ్రెస్ పార్టీ కోసం ఈ సంస్థ ఎలక్టోరల్ బాండ్లు కొన్నట్టు మధ్యప్రదేశ్‌లోని పలు మీడియా సంస్థలు బ్యాంకు ఆధారాలను కూడా బయటపెట్టాయి. ‘కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)2021లో సోం డిస్టిలరీస్ అండ్ బ్రూవరీస్‌పై దాడులు జరిపింది. ధరల నిర్ధారణ, సిండికేట్ తదితర వ్యవహారాలపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో సీసీఐ అధికారులు సోం డిస్టిలరీస్ సంస్థపై దాడులు చేశారు. పలు ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ సంస్థ తన కార్యకలాపాలను నిర్వహిస్తున్నది. బీర్లతోపాటు విస్కీ, రమ్ వంటి వాటిని కూడా ఈ సంస్థ ఉత్పత్తి చేస్తున్నది.
కృత్రిమ కొరత సృష్టించి.. కొత్తవాటికి అనుమతులు?
రాష్ట్రంలో మద్యానికి కృత్రిమ కొరత సృష్టించి తమకు నచ్చిన బ్రాండ్లను, కంపెనీలను ప్రవేశపెడుతున్నారన్న ఆరోపణలు మరోసారి వెల్లువెత్తుతున్నాయి. పేరున్న, డిమాండ్ ఉన్న కంపెనీల బీర్లను మార్కెట్లోకి రాకుండా చేసి కొరతను సృష్టించారు. అనంతరం కొరత పేరు చెప్పి కొత్త బ్రాండ్లను, కొత్త కంపెనీలను మార్కెట్లోకి తీసుకొచ్చారని మద్యం వ్యాపార వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతున్నది. ఇదో రకమైన వ్యూహం అని, గతంలో కూడా కొన్ని రాష్ట్రాల్లో ఇలాగే తమకు నచ్చిన బ్రాండ్లకు, కంపెనీలకు అనుమతులు ఇచ్చారని వ్యాపార వర్గాలు ఆరోపించాయి. ఈ వ్యవహారంలో చాటుమాటుగా భారీ ఎత్తున డబ్బులు చేతులు మారాయని పేర్కొన్నాయి. మన రాష్ట్రంలో కూడా అదే తరహాలో జరిగి ఉంటుందని ఆరోపిస్తున్నాయి. దీనిపై ఎైక్సెజ్ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం ఏం వివరణ ఇస్తుందో వేచి చూడాలి.
దరఖాస్తులేవీ రాలేదు!
ప్రజాస్వామ్యంలో కొత్త మద్యం బ్రాండ్లను కోరుకునే హక్కు ప్రజలకు ఉన్నది. ప్రజలు ఏది కోరుకుంటే.. దానికి ఇండెంట్ పెడతారు. వాటిని అడ్డుకునే హక్కు ప్రభుత్వానికి, నాయకులకు ఉండదు. త్వరలో కొత్త మద్యం బ్రాండ్లను తీసుకొస్తున్నారనే వార్త అబద్ధం. ప్రభుత్వానికి లేని ఆలోచనను పుట్టిస్తున్నారు. ఇప్పటివరకు కొత్త మద్యం బ్రాండ్ కోసం మాకెవరూ దరఖాస్తు చేసుకోలేదు.
-ఈ నెల 21న గాంధీభవన్‌లో మీడియాతో మంత్రి జూపల్లి