ఖమ్మం, మే 31 : భూభారతి చట్టం కింద ప్రజల నుంచి భూ సమస్యలపై వచ్చే దరఖాస్తులను పారదర్శకంగా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెవెన్యూ సదస్సుల నిర్వహణపై తహసీల్దార్లు, నాయబ్ తహసీల్దార్లతో అదనపు కలెక్టర్ శనివారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేలకొండపల్లి, బోనకల్లు మండలాలను పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసుకొని భూ సమస్యలపై దరఖాస్తులు స్వీకరించామని, భూభారతి చట్టం ప్రకారం వాటి పరిషారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
జూన్ 3 నుంచి 20వ తేదీ వరకు జిల్లాలోని మిగిలిన మండలాల వారీగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు. ప్రతి మండలానికి తహసీల్దార్ అధ్యక్షతన ఒక బృందం, నాయబ్ తహసీల్దార్ అధ్యక్షతన మరో బృందం ఏర్పాటు చేసి రెవెన్యూ సదస్సులు నిర్వహించాలన్నారు. ప్రతి గ్రామంలో పూర్తిస్థాయిలో రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని, అవసరమైన మేర హెల్ప్ డెస్, దరఖాస్తులు స్వీకరించేందుకు కౌంటర్లు ఏర్పాటు చేయాలన్నారు.
సదస్సుల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలన్నారు. భూ సమస్యల పరిషారంపై అధికారులు పూర్తి పారదర్శకంగా నిబంధనల మేరకు పనిచేయాలని అదనపు కలెక్టర్ స్పష్టం చేశారు. సమావేశంలో ఎస్డీసీ ఎం.రాజేశ్వరి, రెవెన్యూ డివిజన్ అధికారులు జి.నర్సింహారావు, ఎల్.రాజేందర్‌గౌడ్, సర్వే ల్యాండ్ రికార్డ్స్ సహాయ సంచాలకులు శ్రీనివాసులు, తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు పాల్గొన్నారు.
ఖమ్మం, మే 31 : రేషన్‌బియ్యం రికార్డులను సక్రమంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి అన్నారు. శనివారం ఖమ్మం అర్బన్, ఖమ్మంరూరల్ మండలాల ఎంఎల్ఎస్ పాయింట్లను తనిఖీ చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి రేషన్‌షాపులు, విద్యాసంస్థలు, అంగన్వాడీ కేంద్రాలు, గురుకులాలకు సకాలంలో బియ్యం సరఫరా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్ వెంట జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్ శ్రీలత, అధికారులు పాల్గొన్నారు.