హైదరాబాద్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని విద్యుత్తు సంస్థలకు సోలార్ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు (పీపీఏలు) పెద్ద గుదిబండగా మారాయి. 20 ఏండ్ల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో (2005లో) కుదుర్చుకున్న ఈ దీర్ఘకాలిక ఒప్పందాలు డిస్కంల నడ్డివిరుస్తున్నాయి. అప్పట్లో ఒక్కో యూనిట్ విద్యుత్తుకు రూ.17 చొప్పున చెల్లించేలా పీపీఏలు చేసుకున్నారు. ఆ తర్వాత 2013-14 మధ్య కాలంలో యూనిట్‌కు రూ.6 ధరతో పీపీఏలు చేశారు. ఇప్పుడు ఆ పీపీఏలు డిస్కంల పాలిట శాపంగా మారాయి. నేడు విద్యుత్ ఎక్సేంజీలో యూనిట్ రూ.2.50 నుంచి రూ.2.70కే దొరుకుతున్నది. ఈ ఏడాది మన అధికారులు నాన్-పీక్ అవర్స్‌లో ఇంధన ఎక్సేంజీ నుంచి యూనిట్ 2 పైసలకే కొనుగోలు చేశారు. మార్కెట్లో ఇంత చౌకగా విద్యుత్తు దొరుకుతున్నప్పుడు పాత పీపీఏ ధరలు అధికంగా ఉండటంతో డిస్కంలకు ఇబ్బందులు తప్పడంలేదు.
మన దేశంలో సౌర విద్యుత్తు స్థాపిత సామర్థ్యం గణనీయంగా పెరగడంతో అగ్రరాజ్యం అమెరికాను దాటేసింది. ఈ ఏడాది జూలై నాటికి మన దేశంలో సౌర విద్యుత్తు స్థాపిత సామర్థ్యం 242 గిగావాట్లుగా ఉండగా.. అమెరికాలో 215 -220 గిగావాట్లు మాత్రమే ఉన్నది. మున్ముందు సౌర విద్యుత్తును మరింత ప్రోత్సహించాలని భావిస్తున్న భారత ప్రభుత్వం వచ్చే ఐదేండ్లల్లో ఉత్పత్తిని 500 గిగావాట్లకు పెంచుకోవాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నది. అందులో భాగంగా సోలార్ ప్లాంట్లతోపాటు బ్యాటరీ స్టోరేజీ ప్లాంట్లను విస్తృతంగా ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్లాంట్లల్లో ఏర్పాటుచేసే బ్యాటరీల ధరలు గత ఏడాదిన్నర కాలంలో 20% తగ్గాయి.
వచ్చే ఐదేండ్లల్లో 50% మేరకు తగ్గుతాయన్న అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం బ్యాటరీ స్టోరేజీ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రోత్సాహకాలు అందజేస్తున్నది. నాన్-పీక్ అవర్స్‌లో తక్కువ ధరకు కొనుగోలు చేసిన విద్యుత్తును బ్యాటరీల్లో నిల్వ ఉంచుకుని, పీక్ అవర్స్‌లో వాడుకోవడమే బ్యాటరీ స్టోరేజీ ప్లాంట్ల ప్రత్యేకత. ఈ ప్లాంట్లతో యూనిట్ విద్యుత్తు రూ.3 నుంచి రూ.4కే దొరుకు తుందని అంచనా. ప్రస్తుతం మన దగ్గర పీక్ అవర్స్‌లో యూనిట్ విద్యుత్తును రూ.10కి కొనుగోలు చేస్తున్నారు. బ్యాటరీ స్టోరేజీ ప్లాంట్లు పెద్ద సంఖ్యలో అందుబాటులోకి వస్తే పీక్ అవర్స్‌లో ఒక్కో యూనిట్ విద్యుత్తు రూ.4 లోపే దొరికే అవకాశాలు ఉన్నాయి.