అంబర్‌పేట, నవంబర్ 23: ప్రముఖ రచయిత్రి డాక్టర్ తెన్నేటి సుధాదేవి రామరాజు(73)ఆదివారం సాయంత్రం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె నల్లకుంటలోని స్వగృహంలో మృతిచెందారు. ఆమెకు ఇద్దరు కుమారులు. వంశీ సంస్థల అధినేత వంశీ రామరాజు సతీమణి. తెలుగు అకాడమీలో ఉప సంచాలకులుగా 32 ఏండ్లు పనిచేసి పదవీ విరమణ పొందారు. ఆ తరువాత కూడా రచనా వ్యాసంగం వదలకుండా తెలుగు సామెతలు, నాటికలు, ఉదయకాంతి, అమ్మ, కవితా సంపుటి వ్యాసకదంబ.. ఇలా పలు సాహిత్య ప్రక్రియల్లో ఇరవైకి పైగా రచనలు చేసి అవార్డులు అందుకున్నారు.
సీ నారాయణరెడ్డి, శ్రీమతి సుశీలానారాయణరెడ్డి అవార్డులు కూడా పొందారు. పది రోజుల క్రితం సుధాదేవి కథల సంపుటిని ప్రచురణకు ఇచ్చారు. రచయిత్రిగానే కాకుండా వంశీ సంస్థల అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహిస్తూ సాహిత్యలోకానికి, సమాజానికి ఎనలేని సేవలు అందించారు. ఆమె కలం నుంచి జాలువారిన ఎన్నో కథలు, కవితలు వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. సుధాదేవి మృతి విషయం తెలిసిన వెంటనే పలువురు సాహితీవేత్తలు పెద్దఎత్తున ఆమె పార్థివదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.
సినీ దర్శకుడు రేలంగి నరసింహారావు, నిర్మాత రామసత్యనారాయణ, ప్రభుత్వ పూర్వ సలహాదారు కేవీ రమణాచారి, సాంస్కృతికశాఖ పూర్వ సంచాలకుడు మామిడి హరికృష్ణ, ప్రస్తుత సంచాలకుడు ఏనుగు నర్సింహారెడ్డి, సినారె కుమార్తె గంగ, గానసభ అధ్యక్షుడు కళా జనార్దనమూర్తి, ఎంకే రాము తదితరులు సంతాపం తెలిపారు. ఆమె మరణం సాహితీరంగానికి తీరని లోటని అభిప్రాయపడ్డారు. సోమవారం అంబర్‌పేటలోని శ్మశానవాటికలో ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.