న్యూఢిల్లీ: ఇరాన్‌లోని భూగర్భ ఫోర్డోఅణు కేంద్రంపై అమెరికాకు చెందిన 13,607 కిలోల బరువైన భారీ బంకర్ బస్టర్ బాంబులతో బీ-2 స్పిరిట్ స్టెల్త్ బాంబర్లు దాడి చేయడానికి రెండు రోజుల ముందు కూడా అణు కేంద్రాన్ని పటిష్టం చేసేందుకు ఇరాన్ తీవ్రంగా శ్రమించినట్లు తెలుస్తున్నది. అమెరికా దాడులు జరగడానికి రెండు రోజుల ముందు ఫోర్డోకు చెందిన రెండు ప్రవేశాల ఎదుట మట్టి దిబ్బలు పోసినట్లు జూన్ 19న తీసిన ఉపగ్రహ చిత్రాలు వెల్లడిస్తున్నాయి. ప్రవేశాల సమీపంలో 16 మట్టిని తరలించిన ట్రక్కులు కనిపించగా, మట్టిని తవ్విపోసే యంత్రాలు కూడా ఆ చిత్రాలలో కనిపించినట్లు సీఎన్ఎన్ తెలిపింది. ఫోర్డో అణు కేంద్రానికి వెళ్లే మార్గం మట్టితో కప్పుకుపోయినట్లు జూన్ 20న తీసిన ఉపగ్రహ చిత్రంలో కనిపించింది.
మట్టి లోడుతో ఉన్న ట్రక్కులు ఫోర్డో ప్రవేశాల వరకు వెళ్లగా సమీపంలోనే మట్టిని తవ్వుతున్న యంత్రాలు ఉపగ్రహ చిత్రాలలో కనిపించాయి. పర్వతం పక్కన 80 నుంచి 90 మీటర్ల లోతున భూగర్భంలో నిర్మించిన ఫోర్డో అణు కేంద్రాన్ని బాంబర్ల దాడి నుంచి తట్టుకునేందుకు వీలుగా మరింత బలోపేతం చేయడానికి ఇరాన్ ప్రయత్నించినట్లు ఈ ఉపగ్రహ చిత్రాలు బయటపెడుతున్నాయి. బాంబర్ల దాడి తర్వాత తీసిన ఉపగ్రహ చిత్రాలు అణు కేంద్రం పైభాగంలో మంటలు ఏర్పడినట్లు సూచిస్తున్న రెండు చిత్రాలు బయటకు వచ్చాయి.
ముందే యురేనియం తరలింపు!
అమెరికా సైనిక దాడులకు ఇరాన్ అణు కేంద్రాల కట్టడాలను దెబ్బతీసి ఉండవచ్చునని, కాని దాడులలో చాలా జాప్యం జరిగిందని సైనిక విశ్లేషకుడు టామ్ కూపర్ ఇండియా టుడేకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు. పర్వతం అడుగున భూగర్భంలో నిర్మించిన ఫోర్డో అణు కేంద్రం నుంచి అమెరికా దాడికి ముందే వేరే ప్రదేశానికి యురేనియం తరలింపు జరిగిపోయిందని ఆయన చెప్పారు. ఫోర్డోపై వేసిన బాంబులు 960 మీటర్ల ఎత్తయిన పర్వతం పక్కన పడి కొంత విధ్వంసం సృష్టించి ఉండవచ్చని, కాని భూగర్భంలో చాలా లోతున ఉన్న అణు కేంద్రాన్ని ధ్వంసం చేసే అవకాశాలు చాలా తక్కువని ఆయన తెలిపారు. ఏదేమైనా దాడి జరగడానికి రెండు రోజుల ముందే అణు కేంద్రంలోని విలువైన సామగ్రి ముఖ్యంగా యురేనియం తరలింపు జరిగిపోయిందని, వేలాది టన్నుల మట్టిని ఫోర్డో ప్రవేశాల వద్ద పోయడం వల్ల భూగర్భంలోని అణు కేంద్రానికి నష్టం జరిగే అవకాశాలు తక్కువని కూపర్ చెప్పారు. నతాంజ్, ఇస్ఫాహన్ అణు కేంద్రాలపైనా అమెరికా బాంబుల వర్షం కురిపించింది.
గుంతలు కనపడుతున్నాయి
ఫోర్డో అణు కేంద్రంపై గుంతలు కనపడుతున్నాయని, అయితే ప్రస్తుతం ఆ ప్రదేశం వద్దకు వెళ్లే పరిస్థితి లేదని ఐరాసకు చెందిన అంతర్జాతీయ అణు ఇంధన ఏజెన్సీ(ఐఏఈఏ) డైరెక్టర్ జనరల్ రఫేల్ మరియానో గ్రోసీ తెలిపారు.