సిటీ బ్యూరో, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని సరోజిని నాయుడు స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కమ్యూనికేషన్ సమస్యల వలయంలో చిక్కుకుని కొట్టుమిట్టాడుతున్నది. దేశంలోనే ప్రతిష్ఠాత్మకమైన హెచ్సీయూకు చెందిన ఆర్ట్స్ అండ్ కమ్యూనికేషన్లో చేరి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకుందామని భావిస్తున్న విద్యార్థుల ఆశలపై చీకట్లు కమ్ముకుంటున్నాయి. యూనివర్సిటీకి చెందిన సరోజినినాయుడు స్కూల్లో చేరిన విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో కూరుకునే పరిస్థితులు దాపురిస్తున్నాయి. ఆర్ట్స్ అండ్ కమ్యూనికేషన్లోని ఐదు విభాగాలు సమస్యలతో సతమతమవుతున్నాయి. బోధన సిబ్బందితో పాటు కనీస మౌలిక వసతులు లేకపోవడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. తమ సమస్యలను రెండేళ్లుగా వైస్ ఛాన్స్లర్, రిజిస్ట్రార్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్ని విభాగాల్లో పర్మినెంట్ ఫ్యాకల్టీ లేకపోవడంతో నాణ్యమైన శిక్షణ పొందలేకపోతున్నామని వాపోతున్నారు. గత ఐదేండ్లుగా యూనివర్సిటీలోని ప్రతి విభాగంలో సమస్యలు పేరుకుపోవడం వల్ల ర్యాంకు కూడా పాతాళానికి పడిపోతున్నది. ఇప్పటికైనా వీసీ, రిజిస్ట్రార్ దిద్దుబాటు చర్యలు చేపట్టాలని విద్యార్థులు కోరుతున్నారు. ఎస్ఎన్ స్కూల్లోని సమస్యలను పరిష్కరించాలనిహెచ్సీయూ జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం నిరసన కార్యక్రమం చేపట్టారు.
ఎస్ఎన్ స్కూల్ ఆర్ట్స్ అండ్ కమ్యూనికేషన్లోని మ్యూజిక్ విభాగం శిథిల భవనంలో కొనసాగుతున్నది. భవనం పూర్తిగా శిథిలమవడంతో పెచ్చులూడి సంగీత పరికరాల మీద పడుతున్నాయని విద్యార్థులు చెప్తున్నారు. ఇప్పటికే ఉన్న వేరొక భవనంలో తరగతులు నిర్వహిస్తున్నా పరికరాలను ఉంచేందుకు స్థలం సరిపోవడంలేదని చెప్తున్నారు. మ్యూజిక్ విభాగానికి నూతన భవనాన్ని నిర్మించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా ఫైన్ ఆర్ట్స్, థియేటర్ ఆర్ట్స్, డ్యాన్స్, కమ్యూనికేషన్ విభాగాలకు చెందిన భవనాల్లో మౌలిక వసతులు లేక సతమతమవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరుగుదొడ్లు మరమ్మతులకు గురయ్యాయని, వాటి నిర్వహణ అధ్వాన్నంగా ఉందని వాపోతున్నారు. ఇక నార్త్ క్యాంపస్‌లో ఉన్న ఎస్ఎన్ స్కూల్ నుంచి ఈస్ట్ క్యాంపస్‌లోని మెయిన్ గేట్ దగ్గర ఉన్న క్యాంటీన్‌కు వచ్చి భోజనం చేయాల్సి వస్తున్నది. క్యాంటీన్ దాదాపు రెండు కిలో మీటర్ల దూరంలో ఉండటం వల్ల తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దూరభారం పెరగటంతో సమయం వృథా అవుతుందని అంటున్నారు. క్యాంటీన్‌ను తమకు దగ్గరగా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. మిగతా డిపార్ట్మెంట్లకు సంబంధించిన భవనాల్లోనూ సరైన వసతులు లేవని చెప్తున్నారు. అన్ని వసతులు కల్పించిన నాణ్యమైన శిక్షణ ఇవ్వాలని కోరుతున్నారు.
ఎస్ఎన్ స్కూల్లోని ప్రతి విభాగంలో ఫ్యాకల్టీ విద్యార్థులతో పోలిస్తే చాలా తక్కువగా ఉందని చెప్తున్నారు. అన్ని విభాగాల్లో గెస్ట్ ఫ్యాకల్టీతో తరగతులు నిర్వహిస్తున్నారని వాపోతున్నారు. శాశ్వత ప్రాతిపదికన ప్రొఫెసర్ల నియామకం చేపట్టడం లేదని ఆరోపిస్తున్నారు. నోటిఫికేషన్లు విడుదల చేసి నామమాత్రంగా ఎంపిక ప్రక్రియ చేపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్వ్యూలకు వచ్చిన వారిని ఎంపిక చేయకుండా ‘నన్ ఫౌండ్ సూటబుల్’ పేరిట తప్పించుకుంటున్నారని విద్యార్థులు మండిపడుతున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న అర్హత కలిగిన ఎంతో మంది ఇంటర్వ్యూలకు హాజరుతున్నా రిజక్ట్ చేస్తున్నారు. దేశంలో ఆర్ట్స్ అండ్ కమ్యూనికేషన్ విభాగాల్లో పనిచేయాడానికి అర్హత కలిగిన వారే లేరా? అని ప్రశ్నిస్తున్నారు. ఏండ్ల తరబడిగా ఖాళీలను భర్తీ చేయకుండా తమ జీవితాలతో ఆడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్ని విభాగాల్లో పర్మినెంట్ ఫ్యాకల్టీని భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో జేఏసీ ఆధ్వర్యంలో నిరసనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.