మంచి మార్కులు సాధించాలి, క్యాంపస్ ఇంటర్వ్యూలో ఉద్యోగం కొట్టాలి అని అందరూ చెబుతుంటారు. కానీ, ఆర్థిక విషయాల గురించి పిల్లలకు అవగాహన కల్పించరు. దీంతో మంచి కొలువు సాధించి.. రెండు చేతులా సంపాదిస్తున్నా… మనీ మేనేజ్మెంట్లో చాలామంది విఫలం అవుతుంటారు. అలా కావొద్దంటే.. ఆర్థిక అక్షరాస్యత తప్పనిసరి. ఈ టిప్స్ ఫాలో అయితే.. మీ కష్టార్జితం వృథాపోకుండా ఉంటుంది.
డబ్బు మాత్రమే లక్ష్యం కాకూడదు. కానీ, అనుకున్న లక్ష్యాలను చేరుకునేందుకు డబ్బు సాధనంగా పనిచేస్తుంది. అందువల్ల ఆఫీసుల్లో ఏవైనా బెనిఫిట్ ప్లాన్స్ ఆఫర్ చేస్తే, అందులో చేరి డబ్బును ఆదా చేసుకోవాలి. కచ్చితంగా ఆ పొదుపు మొత్తం పెద్ద అవసరానికి ఉపయోగపడుతుంది.
ఉద్యోగంలో చేరిన తొలినాళ్లలోనే షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ గోల్స్ పెట్టుకోవాలి. కుటుంబంతో విహారం, కారు, బైకు కొనడం గట్రా స్వల్పకాలిక లక్ష్యాలుగా భావించి అందుకు తగ్గ సేవింగ్స్ చేసుకోవాలి. ఇంటి నిర్మాణం, రిటైర్మెంట్ ప్లాన్ లాంటివి దీర్ఘకాలిక లక్ష్యాలుగా నిర్దేశించుకొని.. ప్రణాళిక మేరకు డబ్బులు కూడబెట్టాలి.
మార్కెట్లో చాలామంది ఫైనాన్షియల్ అడ్వైజర్లు అందుబాటులో ఉన్నారు. వారిని సంప్రదించి వచ్చే జీతాన్ని ఎలా ఖర్చు చేయాలో ఒకసారి తెలుసుకోవడం మంచిది. దానివల్ల సంపాదన ప్రారంభమైన మొదట్లోనే ఫైనాన్షియల్ ప్లానింగ్ అలవాటవుతుంది. పెట్టుబడి, రాబడిపై చిన్నవయసులోనే అవగాహన వస్తుంది.
ఎప్పటికప్పుడు మార్కెట్లో వస్తున్న స్కామర్లపై ఒక కన్నేసి ఉంచాలి. ఎలాంటి బెట్టింగ్, ఈజీ మనీ అవకాశాల వైపు మళ్లకుండా జాగ్రత్తగా ఉండాలి. డబ్బు విషయంలో ఎంత బాధ్యతగా ఉంటే, భవిష్యత్తులో అంత ఆర్థిక క్రమశిక్షణ అలవడుతుంది. మీ జీవితం నల్లేరు మీద బండి నడకలా సాఫీగా సాగిపోతుంది.