న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: రుణ గ్రహితలకు షాకిచ్చింది ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ). మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్(ఎంసీఎల్ఆర్)ని 5 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు సోమవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది. ఈ సవరించిన వడ్డీరేట్లు మంగళవారం నుంచి అమలులోకి రానున్నాయి. బ్యాంక్ తీసుకున్న తాజా నిర్ణయంతో అత్యధిక మంది తీసుకున్న ఏడాది కాలపరిమితి కలిగిన ఎంసీఎల్ఆర్ రేటు 7.35 శాతానికి చేరుకోనున్నది. వీటితోపాటు ఒక్కరోజు, నెల, మూడు, ఆరు నెలల కాలపరిమితి కలిగిన రుణాలపై ఎంసీఎల్ఆర్ రేటుని కూడా 0.05 శాతం చొప్పున పెంచింది. దీంతో వీటి రుణ రేటు వరుసగా 6.50 శాతం, 6.95 శాతం, 7.10 శాతం, 7.20 శాతానికి చేరుకోనున్నాయి. దీంతో గృహ, వాహన, ఇతర రుణాలపై వడ్డీరేట్లు మరింత పెరగనున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికిగాను రిజర్వు బ్యాంక్ ప్రకటించిన తొలి సమీక్షలో వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతూ నిర్ణయం తీసుకున్నప్పటికీ బీవోబీ వడ్డీరేట్లను పెంచడం గమనార్హం.