Sleepmakers | బీజింగ్: ‘నిదానమే ప్రధానం’ అనుకునే రోజులు కావివి. ఏ రంగంలో చూసినా విపరీతమైన పోటీ. దానిని అందుకోవాలంటే పరుగులు పెడుతూనే ఉండాలి. అయితే, ఇలా నిత్యం పరుగులు పెట్టే జీవనం ఎన్నో అనారోగ్య సమస్యలకు దారి తీస్తున్నది. సరిగ్గా ఇదే జరుగుతున్నది చైనాలో. అక్కడ పుట్టుకొచ్చిన ‘996 వర్క్ కల్చర్’ (వారంలో ఆరు రోజులు ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు పనిచేయడం) యువతను నిద్రకు దూరం చేస్తున్నది. వెంటాడే మానసిక సమస్యలు.. వైవాహిక ఒత్తిడి, నిత్య జీవితంలో ఒత్తిళ్లు.. ఎవరికి చెప్పుకోవాలో తెలియక వేదన అనుభవిస్తూ నిద్రకు దూరమవుతున్నారు. అయితే, ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్న వారిలో మానసిక ఒత్తిడిని పోగొట్టి జోలపాడి హాయిగా నిద్రపుచ్చేందుకు ఓ కొత్తరకం వృత్తి ఇప్పుడక్కడ పుట్టుకొచ్చింది. అదే ‘స్లీప్ మేకర్స్’.
గంటకు రూ.3 వేలు
ఒత్తిడి ఎదుర్కొంటూ నిద్రకు దూరమవుతున్న వారికి స్లీప్ మేకర్స్ ఎమోషనల్‌గా సపోర్ట్ అందిస్తారు. వారి బాధలు వింటారు. ముచ్చట్లాడుతూ వారిలోని ఆందోళనను దూరం చేస్తారు. ఫలితంగా వారు హాయిగా నిద్రలోకి జారుకుంటారు. ఇప్పుడీ సేవలు ఆఫ్‌లైన్‌తోపాటు ఆన్‌లైన్‌లోనూ అందుబాటులో ఉన్నాయి. స్లీప్‌మేకర్స్ గంటకు 260 యువాన్లు (దాదాపు రూ.3 వేలు) వసూలు చేస్తున్నారు. 996 వర్క్ కల్చర్ కారణంగా ఇబ్బందులు పడుతున్న వారిలో ఎక్కువమంది యువతే కావడం గమనార్హం. వీరు తమ బాధలను స్లీప్మేకర్స్తో చెప్పుకుంటూ సేద దీరుతుంటారు.
ఇలాంటి సేవలు అందించే వాటిలో ‘సెవెన్ సెవెన్7’ అనే సంస్థ పాపులర్ అయింది. ఇది ఊహాత్మక బెడ్‌టైం స్టోరీలు చెప్తూ క్లయింట్స్‌ను ఆకర్షిస్తున్నది. ఇప్పుడీ వృత్తిని చాలామంది పార్ట్టైంగానూ ఎంచుకుంటూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. సాధారణంగా వ్యక్తిగత సమస్యలను స్నేహితులు, కుటుంబ సభ్యులతో పంచుకోవడానికి చాలామంది ఇష్టపడరు. వాటిని తమలో తామే దాచుకుని మథనపడుతూ నిద్రకు దూరమవుతుంటారు. ఇలాంటి వారికి ఈ స్లీప్‌మేకర్స్ చక్కని ఔషధంలా పనికొస్తున్నారు. తమ సమస్యలను వారి ముందు వెళ్లబోసుకుని గుండెలోని భారాన్ని అమాంతం దింపేసుకుంటూ హాయిగా నిద్రపోతున్నారు.