న్యూఢిల్లీ, నవంబర్ 18: ‘బాధితురాలి శరీరాన్ని నిందితుడు నేరుగా తాకనప్పుడు (స్కిన్-టు-స్కిన్ కాంటాక్ట్ లేనప్పుడు) ఆ చర్య ‘పోక్సో’ చట్టం ప్రకారం లైంగిక వేధింపుల కిందకు రాదు’ అంటూ బాంబే హైకోర్టు ఇచ్చిన వివాదాస్పద తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది. బాధిత బాలికను నిందితుడు కామవాంఛతో తాకితే పోక్సో చట్టం సెక్షన్ 7 ప్రకారం లైంగిక దాడి కిందకే వస్తుందని జస్టిస్ యూయూ లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. చట్టంలోని లొసుగుల నుంచి నేరస్థుడు తప్పించుకొనేందుకు అనుమతించకూడదని హితవు పలికింది. చట్టం ఉద్దేశం స్పష్టంగా ఉన్నప్పుడు కోర్టులు నిబంధనల్లో సందిగ్ధతను సృష్టించకూడదని పేర్కొంది. ‘లైంగిక వేధింపుల కేసులో ముఖ్యమైన అంశం బాధిత బాలికను నిందితుడు కామవాంఛతో తాకాడా లేదా అన్నదే తప్ప నేరుగా తాకాడా లేదా అన్నది కాదు. చట్టం లక్ష్యాన్ని దెబ్బతీసే సంకుచిత భాష్యాన్ని అనుమతించేది లేద’ని తేల్చిచెప్పింది. ఈ ధర్మాసనంలో జస్టిస్ ఎస్ రవీంద్ర భట్, జస్టిస్ బేలా ఎం త్రివేది కూడా ఉన్నారు. జస్టిస్ భట్ విడిగా తీర్పు రాశారు. బాంబే హైకోర్టు తీర్పు ఓ బాలికపై దుశ్చర్యను సమర్థించేలా ఉందన్నారు. బాంబే హైకోర్టు తీర్పుపై బాలల హక్కుల కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఆ తీర్పును నిలిపివేయాలంటూ అటార్నీ జనరల్‌తో పాటు మహిళా కమిషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. దాంతో ఆ తీర్పుపై జనవరి 27న కోర్టు స్టే విధించింది.
2016లో సతీశ్ అనే వ్యక్తి పండు ఇస్తానంటూ 12 ఏండ్ల బాలికకు ఆశ చూపి తన ఇంటికి తీసుకెళ్లాడు. ఆమె ఛాతీని తాకి ఆమె దుస్తులు విప్పేందుకు ప్రయత్నించాడు. ఈ కేసులో సెషన్స్ కోర్టు నిందితుడిని పోక్సో చట్టం కింద దోషిగా పేర్కొంటూ మూడేండ్ల జైలు శిక్ష విధించింది. దీనిపై అతను బాంబే హైకోర్టుకు వెళ్లగా నాగ్‌పూర్ బెంచ్ వివాదాస్పద తీర్పు ఇచ్చింది. బాలిక దుస్తులు తొలిగించకుండా తాకాడు కాబట్టి లైంగిక దాడి కిందకు రాదని మహిళా న్యాయమూర్తి జస్టిస్ పుష్ప గనేడివాలా తీర్పు చెప్పారు. పోక్సో కింద సెషన్స్ కోర్టు విధించిన శిక్షను రద్దు చేశారు.