చలికాలంతోపాటే చర్మ సమస్యలూ మొదలవుతాయి. శీతలగాలులకు ఒంట్లో తేమ తగ్గిపోయి.. దురద, చర్మం పగిలిపోవడం లాంటి ఇబ్బందులు ఎదురవుతాయి. వేడివేడి నీళ్లతో స్నానం చేయడం కూడా.. సమస్యను పెంచుతుంది. ముఖ్యంగా శీతకాలంలో పొడి చర్మం.. ప్రతిఒక్కరినీ ఇబ్బంది పెడుతుంది. జీవనశైలిలో కొన్ని మార్పులవల్ల చలికాలంలో పొడి చర్మం సమస్యనుంచి బయటపడొచ్చు.
చలికాలంలో చర్మ సంరక్షణకు అందరూ ఆశ్రయించేది.. మాయిశ్చరైజర్లు, క్రీమ్స్నే! అయితే, వీటి రక్షణంతా బయటి నుంచే! అదికూడా తాత్కాలికంగానే! పొడిచర్మం సమస్య పూర్తిగా పరిష్కారం కావాలంటే.. చర్మం లోపలి నుంచీ ఆరోగ్యంగా ఉండాలి. ఇందుకోసం ఆహారపు అలవాట్లలో కొన్ని మార్పులు – చేర్పులూ చేసుకోవాలి.
చర్మం రోజంతా తేమగా ఉండాలంటే.. శరీరానికి తగినంత నీరు అందించాలి. అందుకే, దాహమైనా.. కాకున్నా రోజుకు కనీసం 8 గ్లాసుల మంచినీళ్లు తాగాలి.
చలికాలం తీసుకునే ఆహారంలో నెయ్యి, నువ్వుల నూనె ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఇవి చర్మాన్ని లోపలి నుంచి హైడ్రేటెడ్‌గా ఉంచుతాయి.
స్నానానికి ముందు గోరువెచ్చని నూనెతో శరీరాన్ని మర్దనా చేసుకోవడం వల్ల చర్మానికి కావాల్సిన పోషణ అందుతుంది. రక్త ప్రసరణ పెరిగి.. చర్మం తేమగా ఉంటుంది. ఇందుకోసం బాదం, నువ్వులు, కొబ్బరి నూనెలు ఎంచుకోవడం మంచిది.
రెగ్యులర్‌గా ఉపయోగించే సబ్బులను పక్కన పెట్టండి. ఇవి చర్మంలోని సహజ నూనెలను తొలగిస్తాయి. దాంతో చర్మం పొడిబారుతుంది. కలబంద, పసుపు, వేప లాంటి సహజ పదార్థాలున్న సబ్బులను వాడండి. ముఖ్యంగా సున్నిపిండితో స్నానం చేయడం అనేక ప్రయోజనాలను అందిస్తుంది.
చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే.. నాణ్యమైన నిద్ర చాలా అవసరం. అందుకే, రోజూ కనీసం 8 గంటలు నిద్రపోండి.
శీతకాలంలో మామూలు ‘టీ’కి బదులుగా.. అల్లం, దాల్చిన చెక్క లాంటి సుగంధ ద్రవ్యాలతో చేసిన ‘హెర్బల్ టీ’ని ఎక్కువగా తీసుకోవాలి. ఇవి శరీరంలో రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి. శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంతోపాటు, బాడీకి కావాల్సిన వేడిని అందిస్తాయి.