మంగపేట/ములుగు రూరల్, మార్చి 5 : ములుగు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మొక్కు తీర్చుకొని ఇంటికి బయలుదేరిన వారి ఆటో ను డీసీఎం వాహనం ఢీకొట్టడంతో ఆరుగురు దుర్మరణం చెందారు. శనివారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా.. ములుగు జిల్లా మం గపేట మండలం కోమటిపల్లిలోని కేసీఆర్ కాలనీకి చెందిన బొల్లెబోయిన రసూల్ మొక్కు తీర్చుకొనేందుకు ఈ నెల 3న కుటుంబ సమేతంగా వరంగల్ జిల్లా అన్నారం షరీఫ్ దర్గాకు వెళ్లారు. ఆటోలో రసూల్‌తోపాటు అతని భార్య పద్మ, తల్లి వసంత, కొడుకు అజయ్, కూతురు వెన్నెల, అదే కాలనీకి చెందిన చలమల్ల కిరణ్, డ్రైవర్ జానీ, రామన్నగూడేనికి చెందిన చిన్నమ్మ గాదం కౌసల్య మొత్తం 8 మంది ఉన్నారు. మొక్కు చెల్లించుకొని, రాత్రి భోజనాలు చేసి అన్నా రం నుంచి స్వగ్రామానికి అదే ఆటోలో బయలుదేరారు. శనివారం తెల్లవారుజామున ములుగు జిల్లాకేంద్రానికి సమీపంలోని ఇంచెర్ల శివారులో గల ఎర్రి గట్టమ్మ ఆలయ సమీపానికి రాగానే ఛత్తీస్‌గఢ్ నుంచి పశువుల లోడ్‌తో హైదరాబాద్ వైపు వెళ్తున్న డీసీఎం వాహనం ఆటోను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోడ్రైవర్ తునికి జానీ (23), చలమల్ల కిరణ్ (16), బొల్లెబోయిన అజయ్ (12), గాదం కౌసల్య (55) అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన బొల్లెబోయిన రసూల్, అతడి భార్య పద్మ, తల్లి వసంత, కూతురు వెన్నెలను 108లో వరంగల్ ఎంజీఎంకు తరలించగా.. చికిత్స పొందుతూ వెన్నెల (9), బొల్లెబోయిన వసంత (60) మరణించారు. ఈ ఘటనతో కోమటిపల్లి గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.