జయశంకర్ భూపాలపల్లి : చిరుత పులిని చంపడంతో పాటు దాని చర్మాన్ని విక్రయించేందుకు యత్నించిన
ఆరుగురిని మహాదేవపూర్ పోలీసులు ఇవాళ అరెస్టు చేశారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ ఎస్ సురేందర్‌రెడ్డి వివరాలను వెల్లడించారు. జిల్లాలో అటవి, పోలీస్ శాఖ సమన్వయంతో వన్యప్రాణుల రక్షణ కొనసాగుతుందని ఆయన వెల్లడించారు.
దీంట్లో భాగంగా పోలీసులకు అందిన సమాచారం మేరకు చిరుతపులి చర్మాన్ని మహారాష్ట్రలో విక్రయించేందుకు మహాదేవపూర్ ప్రాంతానికి వస్తున్న ముఠాను పట్టుకోవడానికి డీఎస్పీ రాంమోహన్‌రెడ్డి పర్యవేక్షణలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని అన్నారు. ఆరుగురు సభ్యులు గల ముఠా మహాదేవపూర్ ప్రాంతానికి రాగానే వారిని అదుపులోకి తీసుకుని వారి వద్ద ఉన్న బ్యాగ్‌ను తనిఖీ చేయగా అందులో ఉన్న చిరుతపులి చర్మాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
కొత్తగూడెం, ములుగు, ఈస్ట్‌గోదావరి జిల్లాలకు చెందిన ఇరుప నాగేంద్రబాబు అలియస్ చంటి, పొలం వెంకటేశ్, పరిసబోయిన రాజేశ్, ఎర్రగట్ల శ్రీకాంత్, బుర్రి సాయికిరణ్, బొమ్మకంటి కిశోర్ అనే ఆరుగురిని అరెస్టు చేసినట్లు తెలిపారు. పొలం వెంకటేశ్, ఇరుప నాగేంద్రబాబు అనే ప్రధాన నిందితులు చత్తీస్ గఢ్ రాష్ట్రంలోని పామేరు అటవీ ప్రాంతంలో చిరుత పులిని చంపి ఎండబెట్టి విక్రయానికి పూనుకున్నారని ఎస్పీ వెల్లడించారు. మరో నలుగురు సహాయంతో విక్రయానికి బయలు దేరగా అరెస్టు చేసినట్లు వివరించారు. వారి వద్ద నుంచి పులిచర్మం, మోటార్ సైకిళ్లు, సెల్ ఫోన్ లు, మూడువేల నగదును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.