SIR | హైదరాబాద్, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ) : ఓటు చోరీ, గల్లంతు, తొలగింపు, వలసపోయినా మటాష్, స్థానికంగా లేకపోతే ఖతం, ఎన్యుమరేటెడ్ ఫారమ్‌తో ఏమేం జతచేయాలో, అధికారులు ఏ టైంలో వస్తారో, ఎప్పుడేం అడుగుతారో&., వంటి సవాలక్ష అనుమానాలు ఒకవైపు. అర్హులకు న్యాయం చేయడం తప్ప మరెలాంటి అపోహలు అక్కర్లేదు అనే వాదన మరోవైపు. వెరసి సర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ఇప్పుడు దేశమంతా హాట్ టాపిక్. ఇప్పటికే బీహార్‌లో బంగ్లాదేశ్ వలసవాదుల ఏరివేత చేశాం., అలాంటి వారు, అనర్హులు దేశమొత్తంగా ఎందరున్నారో తొలగిస్తామని ఈసీఐ ప్రకటించిన నేపథ్యంలో నెలకొన్న అనుమానాల్లోనే రెండో విడతలో సర్ కొనసాగుతూనే ఉన్నది. త్వరలోనే తెలంగాణ సహా మిగతా రాష్ర్టాలు, యూటీల్లో మూడో విడత ప్రక్రియ ప్రారంభానికి ఎన్నికల సంఘం కసరత్తు మొదలుపెట్టిన ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రమంతా ఓట్లెన్ని, పోయేవెన్ని, అసలెంత మంది, నకిలీల ముచ్చటేంటి? అనే ఆందోళనల్లో విస్తృత చర్చ సాగుతున్నది. ప్రధాన ఎన్నికల అధికారి రాష్ట్ర పర్యటనలో బీఎల్వోల శిక్షణ విషయమై ప్లాన్ చేస్తుండగా, ఓటు చోరీనా., ఓటుకు సెక్యూరిటీనా.. అనేది అర్థంగాక సామాన్య జనం ఆగమాగం అవుతున్నారు.
కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) రాష్ట్రంలో మూడో విడతలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్-సర్) నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నది. సర్‌లో భాగంగానే ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారితోపాటు జిల్లాల ఎన్నికల అధికారులు, బూత్‌స్థాయి అధికారులతో (బీఎల్వో) ఈసీఐ పలుమార్లు సమావేశాలు నిర్వహించింది. మూడురోజుల పర్యటన కోసం హైదరాబాద్‌కు వచ్చిన భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్‌కుమార్ ఆదివారం రవీంద్రభారతిలో వెయ్యిమందికిపైగా బీఎల్వోలతో కీలక సమావేశం నిర్వహించబోతున్నారు. సర్ నిర్వహణపై వారికి సూచనలు, సలహాలతోపాటు దిశానిర్దేశం చేయనున్నట్టు ఈసీఐ వర్గాలు వెల్లడించాయి. సమావేశంలో జీహెచ్ఎంసీ కమిషనర్, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్మల్కాజిగిరి జిల్లాల కలెక్టర్లతోపాటు ఆయా జిల్లాల ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో విడతలవారీగా సర్‌ను ఈసీఐ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
తొలుత బీహార్ రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా సర్ నిర్వహించారు. ఈ ప్రక్రియ ఇప్పటికే అక్కడ పూర్తయింది. రెండోవిడతలో 9 రాష్ర్టాలు, 3 కేంద్రపాలిత (ఉత్తరప్రదేశ్, తమిళనాడు, పశ్చిమబెంగాల్, రాజస్థాన్, కేరళ, మధ్యప్రదేశ్, గుజరాత్, ఛత్తీస్‌గఢ్, గోవా, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్, లక్షద్వీప్) ప్రాంతాల్లో నిర్వహిస్తామని అక్టోబర్ 27న ఈసీఐ ప్రకటించింది, ఈ మేరకు ప్రక్రియ కొనసాగుతున్నది కూడా. ఇక మూడో విడత తెలంగాణతోపాటు మరికొన్ని రాష్ర్టాల్లో ప్రారంభం కానున్నట్టు ఈసీఐ వర్గాల ఏర్పాట్లను చూస్తే తెలిసిపోతున్నది.
సర్ ప్రక్రియ మూడో విడతలో భాగంగా తెలంగాణలో ప్రారంభం కానున్నది. ప్రస్తుతం తెలంగాణ ఎన్నికల అధికారులు సర్వేకోసం క్షేత్రస్థాయిలో సన్నద్ధమవుతున్నారు. తాజా సమాచారం ప్రకారం ఆదివారం భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్ హైదరాబాద్ రవీంద్రభారతిలో బూత్‌స్థాయి అధికారులతో (బీఎల్వోల) కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1,000 మందికిపైగా బీఎల్వోలు సమావేశానికి హాజరుకానున్నారు. సర్ ప్రక్రియలు అనుసరించాల్సిన విధివిధానాలు, నిబంధనలు, సూచనలు, సలహాలు సహా పలు అంశాలపై దిశానిర్దేశం చేయనున్నట్టు ఈసీఐ వర్గాలు చెబుతున్నాయి. సమావేశం అనంతరం తెలంగాణలో ఇంటింటి సర్వే, దరఖాస్తుల స్వీకరణకు సంబంధించిన కచ్చితమైన షెడ్యూల్ వెలువడే అవకాశాలున్నట్టు పేర్కొంటున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా బీఎల్వోలు ఇంటింటి సర్వే నిర్వహిస్తారు. గతంలో ఉన్న ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేయడానికి ప్రతి ఇంటికీ వస్తారు. ఎన్యుమరేషన్ ఫారమ్ (ఈఎఫ్)ను ప్రతి ఓటరుకూ అందిస్తారు. అందులో వివరాలను సరిచూసుకుని సంతకం చేయాల్సి ఉంటుంది. 2003 ఓటర్ల జాబితాలో పేరు ఉన్నవారు లేదా వారి వారసులైతే అదనపు పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదని ఈసీ తెలిపింది. కొత్తగా నమోదు చేసుకునే వారు నివాస, వయస్సు ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాల్సి ఉంటుంది. మరణించిన వారు, శాశ్వతంగా ఆ గ్రామం నుంచి వలస వెళ్లిన వారి ఓట్లను తొలగిస్తారు. డూప్లికేట్ ఓట్లను తొలగించడం ఈ సర్వే ప్రధాన ఉద్దేశమని ఈసీఐ వర్గాలు తెలిపాయి.
తెలంగాణలో సర్ నిర్వహణ ప్రక్రియలో భాగంగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (ఎస్ఈసీ) సుదర్శన్‌రెడ్డితో ఈసీఐ ఇప్పటికే రెండుసార్లు ఢిల్లీలో సమావేశాలు నిర్వహించింది. ఆ తర్వాత ఎస్ఈసీ జిల్లాల ఎన్నికల అధికారులు, అసిస్టెంట్ ఎన్నికల అధికారులతో మూడుసార్లు వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించి ‘సర్’పై వారికి బ్రీఫింగ్ ఇచ్చినట్టు తెలిసింది. అందులో భాగంగా ఎస్ఈసీ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఫీల్డ్ విజిట్ కూడా చేశారు, అక్కడి బీఎల్వోలకు ప్రాథమిక శిక్షణ కూడా ఇచ్చారు. ఇంటింటి సర్వే, ఎన్యుమరేషన్ ఫారమ్, ఓట్ల తొలగింపు,
కొత్త ఓటర్లను నమోదు చేయడంపై అవగాహన కల్పించారు. మరోవైపు పలుజిల్లాల నుంచి ఎంపిక చేసిన బీఎల్వోలకు ఢిల్లీలో ఇప్పటికే విడతలవారీగా శిక్షణ ఇచ్చారు. ప్రతిజిల్లా నుంచి కనీసం 50 మంది శిక్షణ పొందారని, ఢిల్లీలో శిక్షణ పొందిన వారు ఆయా జిల్లాల్లో బీఎల్వోలకు శిక్షణ ఇస్తారని ఈసీఐ వర్గాలు వెల్లడించాయి.
తొలి విడత: బీహార్ రాష్ట్రంలో పూర్తి అయింది.
రెండోవిడత : 9 రాష్ర్టాలు, 3 యూటీలు కొనసాగుతున్నది.
మూడో విడత: తెలంగాణ, పలు రాష్ర్టాల్లో షురూ కాబోతున్నది.