తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ దేశ చరిత్రలోనే మునుపెన్నడూ లేని, అత్యంత హేయమైన, ప్రజాస్వామ్య కంటకమైన ఘట్టాన్ని ఆవిష్కరించారు. తమ నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్‌లో చేరుతున్నామనిపార్టీ ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే స్వయంగా ఎన్నో సందర్భాల్లో ప్రకటించారు. అయినా ‘వాళ్లు పార్టీ మారారు… కాంగ్రెస్‌లో చేరారని చెప్పేందుకు స్పష్టమైన ఆధారాల్లేవు. న్యూస్ పేపర్ క్లిప్పింగ్‌లు, వాళ్లు మాట్లాడిన వీడియోలు, సోషల్ మీడియా పోస్టులను ఆధారాలుగా పరిగణించలేం’ అంటూ ఆ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను కొట్టేశారు. తద్వారా ఆయన ఓ దుష్ట వాదనను ముందుకు తీసుకువచ్చారు.
స్పీకర్ నిర్ణయం ప్రజాస్వామ్యంపై చెరగని ఓ మచ్చ, రాజ్యాంగ విలువలపై జరిగిన దాడి. బహుశా ఆయన ఇది గమనించారో.. లేదో. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన 10 మంది ఎమ్మెల్యేల్లో ఐదుగురు బీఆర్ఎస్ వాళ్లేనని ఈ నెల 17న స్పీకర్ తీర్పునిచ్చారు. ఈ వ్యాసం రాసే సమయానికి మిగిలిన ఐదుగురి అంశం పెండింగ్‌లో ఉంది.
అధికార పార్టీకి స్పీకర్లు అనుకూలంగా ఉంటారన్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ, పార్టీ ఫిరాయింపులు, ఎమ్మెల్యేల
అనర్హత అంశం స్పీకర్ల ముందుకు వచ్చినప్పుడు వారు అసెంబ్లీ కాలపరిమితి పూర్తయ్యేవరకు కాలయాపన చేసేవారు. స్పీకర్ నిర్ణయంపై రాజ్యాంగంలో ఎలాంటి కాలపరిమితి లేనందున వారికి ఆ వెసులుబాటు ఉండేది.
అయితే, ఇలా చేయడం వల్ల పార్టీ ఫిరాయింపుల చట్టం స్ఫూర్తి ప్రమాదంలో పడుతున్నదని ఆందోళన వ్యక్తంచేసిన సుప్రీంకోర్టు .. స్పీకర్లు సాధ్యమైనంత త్వరగా ఫిరాయింపుదారులపై చర్యలు తీసుకోవాలని ఒత్తిడి తెస్తున్నది. అయినప్పటికీ ఏ రాష్ట్రంలోనూ స్పీకర్లు ఇంత దారుణంగా వ్యవహరించలేదు. పార్టీ మారిన నేతలే స్వయంగా తాము పార్టీ మారామని చెప్పుకున్నా ఆధారాల్లేవంటూ రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే ప్రయత్నం ఏ స్పీకరూ చేయలేదు. స్పీకర్ గడ్డం ప్రసాద్ ముందుకు తీసుకువచ్చిన ఈ వాదనను మిగతా రాష్ర్టాల స్పీకర్లు కూడా కొనసాగించే ప్రమాదం ఉంది. అదే జరిగితే ప్రజాస్వామ్యానికి అది పెను విఘాతమవుతుంది.
‘తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, ప్రకాశ్ గౌడ్, గూడెం మహిపాల్‌రెడ్డి, అరికెపూడి గాంధీ.. ఈ ఐదుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే. కాంగ్రెస్‌లో చేరినట్లు ఆధారాల్లేవు’ అని స్పీకర్ తీర్పు ఇచ్చారు. వీరిలో తెల్లం వెంకట్రావు 2024 మార్చి 3న టీపీసీసీ అధ్యక్షుడిని కలిశారు. కాంగ్రెస్ తన మ్యానిఫెస్టోలో ప్రకటించిన తెలంగాణ జన జాతరలో 2024 ఏప్రిల్ 6న పాల్గొన్నారు. 2024 ఏప్రిల్ 7న కాంగ్రెస్ పార్టీ కండువా కప్పకొన్నారు. తాను నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారినట్లు పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు. బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి 2024 జూలై 6న సీఎం రేవంత్‌ను ఆయన సొంత నివాసంలో కలుసుకున్నారు. అక్కడ కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారు. 2024 జూలై 12న సీఎం రేవంత్ కాంగ్రెస్ కండువా కప్పి ప్రకాశ్ గౌడ్‌ను పార్టీలో చేర్చుకున్నారు. తాను కాంగ్రెస్ నాయకత్వం కింద పనిచేస్తానని ప్రకాశ్ గౌడ్ మీడియా సమావేశంలోనూ ప్రకటించారు.
2024 జూలై 15న గూడెం మహిపాల్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. రేవంత్ ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 2024 జూలై 13న అరికెపూడి గాంధీ కాంగ్రెస్‌లో చేరారు. ఆయనకు కూడా రేవంత్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ ఐదుగురు ఎప్పుడు కాంగ్రెస్ కండువా కప్పుకొన్నది, ఏయే సందర్భాల్లో తాము కాంగ్రెస్‌కు అనుకూలంగా మాట్లాడింది, సోషల్ మీడియాల్లో పోస్టులు చేసింది, కాంగ్రెస్ కార్యక్రమాల్లో పాల్గొన్నది.. అన్నీ ఇప్పటికీ ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి. సెర్చ్ చేస్తే ఈజీగానే దొరుకుతాయి. ఈ ఐదుగురు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలంటూ పిటిషన్లను దాఖలు చేసిన పిటిషనర్లు ఈ ఆధారాలను స్పీకర్ ముందుపెట్టారు. ఆశ్చర్యకరంగా స్పీకర్ తన తీర్పు కాపీల్లో కూడా వీటన్నింటినీ ప్రస్తావించారు. అయినప్పటికీ.. వాటిని నమ్మలేమని, వారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే అని తీర్పునిచ్చారు. ఇంతకంటే ఘోరం ఇంకేమైనా ఉంటుందా?
పార్టీ మారడం లేదా ‘ఫిరాయింపు’ అనే అంశం గురించి భారత రాజ్యాంగంలోని పదో షెడ్యూల్లో వివరంగా పేర్కొన్నారు. సెక్షన్ 2(1)(ఏ) ప్రకారం.. ఒక ఎమ్మెల్యే స్వచ్ఛందంగా తన పార్టీ సభ్యత్వాన్ని వదులుకున్నప్పుడు అతడు ఎమ్మెల్యేగా కూడా అనర్హుడవుతాడు. సెక్షన్ 2(1)(బీ) కింద పార్టీ విప్‌ను ధిక్కరిస్తే అనర్హుడవుతాడు. అంటే సభలో ఓటింగ్ సమయంలో తన పార్టీ ఆదేశాలకు విరుద్ధంగా ఓటు వేసినా లేదా ఓటింగ్‌కు దూరంగా ఉన్నా అనర్హత వేటు పడుతుంది. ప్రస్తుత వ్యవహారంలో ఈ ఐదుగురు ఎమ్మెల్యేలు స్వచ్ఛందంగా బీఆర్ఎస్ను వదులుకున్నట్లేనని పిటిషనర్లు వాదించారు. బీఆర్ఎస్తో అంటీముట్టనట్టు ఉంటున్న వారి వ్యవహారశైలి, కాంగ్రెస్ కండువా కప్పుకోవడం, ఆ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడమే ఇందుకు సాక్ష్యాలని పిటిషనర్లు పేర్కొన్నారు.
స్వచ్ఛందంగా పార్టీ సభ్యత్వాన్ని వదులుకోవడమంటే ఏంటి.. కచ్చితంగా పార్టీకి రాజీనామా చేసి మరో పార్టీలోకి వెళ్లాలా?.. అన్న ప్రశ్న వచ్చినప్పుడు సుప్రీంకోర్టు అనేక వివరణలు ఇచ్చింది. ఒక సభ్యుడు అధికారికంగా రాజీనామా చేయకపోయినా, అతని పనులు లేదా ప్రవర్తన ఆధారంగా అతను పార్టీని వదులుకున్నాడని నిర్ధారించవచ్చు. ఉదాహరణకు వేరే పార్టీ కండువా కప్పుకోవడం, ఇతర పార్టీ వేదికలపై ప్రసంగించడం, తన పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేయడం వంటివి ఇందులో భాగమేనని ‘రామచంద్ర ప్రసాద్ సింగ్ వర్సెస్ శరద్ యాదవ్’ కేసులో సుప్రీంకోర్టు పేర్కొన్నది.
‘స్వచ్ఛందంగా పార్టీ సభ్యత్వాన్ని వదులుకోవడం’ అంటే పార్టీకి రాజీనామా చేయడం మాత్రమే కాదని, ఒక సభ్యుడి ప్రవర్తన, పనుల ద్వారా కూడా దానిని నిర్ధారించవచ్చని ‘రవి ఎస్.నాయక్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా’ కేసు తీర్పు స్పష్టం చేసింది.
సుప్రీంకోర్టు తీర్పులను బట్టి ఈ ఐదుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారినట్టు స్పష్టంగా నిరూపితమవుతున్నది. ఈ ఐదుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరినట్టు పిటిషనర్లు టీవీ9, ఎన్టీవీ వంటి ఛానళ్లలో వచ్చిన దృశ్యాలను; ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి పత్రికా కథనాలను సాక్ష్యాలుగా సమర్పించారు. మరి వారు పార్టీ మారలేదని స్పీకర్ గడ్డం ప్రసాద్ ఎలా తీర్పునిచ్చారు? దీనిపైన సమగ్ర చర్చ జరగాల్సిన అవసరం ఉంది. స్పీకర్ నిర్ణయంపై సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం పిటిషనర్లకు ఉంది.
పార్టీ ఫిరాయింపుల చట్టం (పదో షెడ్యూల్) కింద స్పీకర్ ఒక ట్రిబ్యునల్‌తో సమానమని, ఆయన నిర్ణయం న్యాయ సమీక్ష పరిధిలోకి వస్తుందని సుప్రీంకోర్టు కిహోటో హొల్లోహన్ వర్సెస్ జాచిల్హు కేసులో స్పష్టం చేసింది. దీన్ని బట్టి స్పీకర్ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేయవచ్చు. ఈ సందర్భంలోనైనా స్పీకర్లు ఇలా అప్రజాస్వామిక, రాజ్యాంగ విరుద్ధమైన నిర్ణయాలు తీసుకోకుండా సుప్రీంకోర్టు మరింత స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలి.
(వ్యాసకర్త: సీనియర్ రాజకీయ విశ్లేషకులు)
స్వచ్ఛందంగా పార్టీ సభ్యత్వాన్ని వదులుకోవడమంటే ఏంటి?.. కచ్చితంగా పార్టీకి రాజీనామా చేసి మరో పార్టీలోకి వెళ్లాలా?.. అన్న ప్రశ్న వచ్చినప్పుడు సుప్రీంకోర్టు అనేక వివరణలు ఇచ్చింది. ఒక సభ్యుడు అధికారికంగా రాజీనామా చేయకపోయినా, అతని పనులు లేదా ప్రవర్తన ఆధారంగా అతను పార్టీని వదులుకున్నాడని నిర్ధారించవచ్చు. ఉదాహరణకు వేరే పార్టీ కండువా కప్పుకోవడం, ఇతర పార్టీ వేదికలపై ప్రసంగించడం, తన పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేయడం వంటివి ఇందులో భాగమేనని ‘రామచంద్ర ప్రసాద్ సింగ్ వర్సెస్ శరద్ యాదవ్’ కేసులో సుప్రీంకోర్టు పేర్కొన్నది.
-ఓ.నరసింహారెడ్డి