(స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ): హల్దీవాగులో దొంగలు పడ్డారు.. అధికార పార్టీ ఎమ్మెల్యే అండతో అడ్డూ అదుపు లేకుండా ఇసుకను సరిహద్దులు దాటిస్తున్నారు. నడివాగులో ఏకంగా ప్రైవేట్ రోడ్డు వేసి అక్రమార్కులు తమ దందా కానిచ్చేస్తున్నారు. అభివృద్ధి పనుల మాటున ఇసుక దోపిడీ చేస్తూ కోట్లాది రూపాయలు దండుకుంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో 50 వేల ఎకరాలకు నీళ్లందించేందుకు నిర్మించిన 32 చెక్‌డ్యామ్‌లను ఇందుకోసం ఎండబెట్టారు. ఇంత చేస్తున్నా రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్ శాఖల అధికారులు చోద్యం చూస్తున్నారు.
ఇదంతా చూసి మండిన రైతన్నలు ప్రశ్నిస్తే ఉల్టా వారిపైనే కేసులు పెడుతామంటూ బెదిరింపులకు దిగడం కొసమెరుపు. తెలంగాణ రాక ముందు హల్దీవాగు అంటే ఉమ్మడి మెదక్ జిల్లా దుఖఃదాయిని. వానకాలంలో అడ్డూ అదుపు లేకుండాపొంగి ప్రవహించి పంటచేలను ముంచెత్తే వాగు. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం తున్కి ఖల్సా గ్రామ సమీపంలోని తపాస్ఖాన్ చెరువులో పుట్టి దాదాపు 65 కిలోమీటర్లు ప్రవహించి పాపన్నపేట మండలం ఏడుపాయల వద్ద మంజీరా నదిలో కలుస్తున్నది. వాగు పోటెత్తినప్పుడు ప్రాణనష్టం ఎక్కువే.
అటువంటి హల్దీవాగుకు అప్పటి సీఎంగా కేసీఆర్ ముకుతాడు వేశారు. వాగు మీద 32 చెక్ డ్యామ్‌లను కట్టారు. అన్ని చెక్ డ్యామ్‌లలో కలిపి 0.62 టీఎంసీల నీళ్లు నిల్వ ఉండేటట్టు ఇంజినీరింగ్ డిజైన్ చేశారు. కొండపోచమ్మ సాగర్ నుంచి గోదావరి నీళ్లు తెచ్చి అవుసలోనిపల్లి వద్ద హల్దీవాగులోకి వదిలితే.. దాదాపు 1,600 క్యూసెక్కుల నీళ్లు పారి నిండు వేసవిలో 14,268 ఎకరాలకు నీళ్లు పారింది. వాగు చుట్టూ పరిధిలోని 5 కిలోమీటర్ల మేరకు భూగర్భ జలాలు పెరిగి బావులు, బోర్లలోకి ఊటదిగి 50 వేల ఎకరాలు సాగులోకి వచ్చాయి. ముక్కారు పంటలతో పరీవాహక పల్లెలు పచ్చబడ్డాయి.

కానీ ఇప్పుడిది గతం
హల్దీవాగులో దొంగల ముఠా చొరబడ్డది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే కనుసన్నల్లో రూ. కోట్ల విలువైన ఇసుక దోపిడీ చేస్తున్నారు. పారే నీళ్లను పట్టపగలే ఓ పక్కకు మలిపి, వాగు నడిమధ్యలో కిలోమీటర్ మేర ప్రైవేటు రోడ్డు వేశారు. అధునాతన యంత్రాలతో ఇసుకతోడి ఇటు హైదరాబాద్, అటు కర్ణాటక రాష్ట్రం బీదర్‌కు తరలిస్తున్నారు. రోజుకు 5 వేల టన్ను చొప్పున 100 కంటెయినర్ల ఇసుక తోడేస్తున్నారు. ఇంత జరుగుతున్నా..
ఒక్క రెవెన్యూ అధికారి కూడా అడ్డుపడలేదు. వాగు మధ్య రోడ్డు ఏంటని ఒక్క ఇరిగేషన్ అధికారి కూడా నోరు మెదపలేదు. పోలీసులైతే అటు వైపు కన్నెత్తి చూడలేదు. స్థానిక రైతులే పూనుకొని ఇసుక మాఫియాకు అడ్డం తిరిగితే.. ఇందిరమ్మ ఇండ్ల కోసం తరలిస్తున్న ఇసుకను అడ్డుకుంటే కేసులు పెట్టి జైళ్లో పెట్టాల్సి ఉంటుందని ఎమ్మెల్యే ఉసిగొల్పిన అనుచరుడు బెదిరింపులకు దిగాడు. స్థానిక పోలీసులు ఆయనకే వత్తాసు పలికారు. ఇంకేముందు సరిగ్గా నెల రోజుల్లో 1.5 లక్షల టన్నుల ఇసుకను వాగు దాటించారు.. ఇంకా దాటిస్తూనే ఉన్నారు.
నోటి మాటతోనే అనుమతులు
మెదక్ చర్చి శత జయంతి వేడుకల సందర్భంగా 2024 డిసెంబర్ మాసంలో సీఎం రేవంత్‌రెడ్డి చర్చిని సందర్శించారు.ఆ నేపథ్యంలో చర్చి అభివృద్ధి పనుల కోసం రూ 29 కోట్లు మంజూరు చేశారు. మెదక్ పట్టణంలో సీసీ రోడ్ల నిర్మాణానికి అనుమతించారు. వీటితో పాటు మెదక్, పాపన్నపేట మండలాలకు ఇందిరమ్మ ఇండ్లు హామీ ఇచ్చారు. వీటి నిర్మాణం కోసం ఇసుక అవసరం అయ్యింది. ఇగో…ఈ అవకాశాన్ని వినియోగించుకొనే కాంగ్రెస్ ముఠా నాయకులు రూ కోట్ల విలువైన అక్రమ ఇసుక దందాకు స్కెచ్ వేశారు. చర్చి అభివృద్ధి పనులు, ఇందిరమ్మ ఇండ్లు, సీసీరోడ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుక సమీపంలో ఉన్న హల్దీవాగు నుంచి తీసుకోవాలనే పథకం వేశారు. స్థానిక మున్సిపల్ కమిషనర్ ముందు ప్రపోజల్ పెట్టినట్టు తెలుస్తున్నది.
ఆయన మెదక్ రూరల్ తహసీల్దార్‌కు చెప్పి వాగు నుంచి ఇసుక తీసుకునేందుకు అనుమతించాలని కోరినట్టు సమాచారం. అయితే అధికారికంగా ఎటువంటి అనుమతి పత్రాలు లేవు.‘నమస్తే తెలంగాణ’ ప్రతినిధులు స్థానిక అధికారులను వివరాలు అడిగితే పొంతన లేని సమాధానాలు చెప్పారు. ఇసుక రవాణాకు తాము ఎవ్వరికీ అనుమతి ఇవ్వలేదని చెప్పారు. అనుమతి ఇవ్వనప్పుడు నదికి అడ్డంగా అంతపెద్ద రోడ్డు వేసి మెదక్ పట్టణం గుండా ఇసుక కంటెయినర్లు వస్తూ పోతూ ఉంటే మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదన్న ప్రశ్నలకు అధికారులు నీళ్లు నమిలారు. అధికారులు ఇచ్చిన అనధికారిక సమాచారం ప్రకారం.. చర్చి అభివృద్ధి, సీసీ రోడ్లు, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పేరుతో కేవలం నోటి మాట అనుమతుల ద్వారానే ఇప్పటి వరకు ఇసుక దందా కొనసాగినట్టు తెలిసింది.

చర్చి పనుల కోసం తట్టెడు ఇసుకు దిక్కులేదు
పోనీ హల్దీవాగు నుంచి తీసిన ఇసుక చర్చి అభివృద్ధి పనులు, సీసీ రోడ్లు, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం వినియోగించారా అంటే అదీ లేదు. చర్చి అభివృద్ధి పనుల పేరిట నోటిమాట అనుమతి తీసుకున్న కాంగ్రెస్ నేతలు ఒక్క ట్రాక్టర్ ఇసుక కూడా చర్చికి ఇవ్వలేదని స్థానికులు చెప్తున్నారు. చర్చి ప్రహరీ, అంతర్గత రోడ్ల నిర్మాణం కోసం చర్చి పెద్దలు ఇసుక కోసం ఎదురు చూసి ఆఖరికి ఇసుక స్థానంలో స్టోన్ డస్టు ఉపయోగించి నిర్మాణం పూర్తి చేసుకున్నారు. చర్చిలో జరుగుతున్న అభివృద్ధి పనులు దాదాపు పూర్తి అయ్యాయి కానీ, హల్దీవాగు నుంచి ఇసుక దందా మాత్రం ఆగటం లేదు. స్థానికంగా సీసీ రోడ్ల నిర్మాణం కూడా 70 శాతం స్టోన్ డస్ట్‌తోనే పూర్తి చేశారు.
ఇందిరమ్మ ఇండ్లకు ఇప్పటి వరకు టాక్టర్ ఇసుక కూడా ఇచ్చిన వాళ్లు లేరు. ఇందిరమ్మ ఇండ్ల కోసం ప్రత్యేకంగా కాళేశ్వరం నుంచి ఇసుక తెప్పించి, తూప్రాన్ వద్ద డంప్ ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి ప్రతి ఇందిరమ్మ ఇంటికీ 10 ట్రాక్టర్ల ఇసుక ఇవ్వాలని సరారు ఉత్తర్వులు ఇచ్చింది. వాహనాల రవాణా ఖర్చులను మాత్రం లబ్ధిదారులే భరించుకోవాలని సూచించింది. అంత దూరం నుంచి ఇసుక తెచ్చుకోలేక లబ్ధిదారులు ఇంటి నిర్మాణాలను మధ్యలోనే ఆపేశారు. కానీ ఇందిరమ్మ ఇండ్ల పేరుతో హల్దీవాగులోకి దిగిన పొక్లెయిన్లు మాత్రం నెల రోజులుగా 24 గంటలు ఆగకుండా పని చేస్తూనే ఉన్నాయి.
కోట్లాది రూపాయల వ్యాపారం..
వాగు మధ్యలో రెండు చోట్ల నాలుగు పొక్లెయిన్లు పొద్దంతా ఇసుక తోడి మేట వేస్తున్నాయి. సాయంత్రం 6 గంటల నుంచి తెల్లవారుజాము వరకు నిర్విరామంగా కంటైనర్లు వచ్చి ఇసుక తీసుకుపోతున్నాయి. రోజుకు 100కు పైగా కంటెయినర్ల ఇసుక తోడి ఇటు హైదరాబాద్, అటు కర్ణాటక రాష్ట్రం బీదర్‌కు తరలిస్తున్నట్టు స్థానికులు చెప్తున్నారు. ఒక్క కంటెయినర్లో 50 టన్నుల ఇసుక నింపుతున్నారని, ఈ లెక్కన రోజుకు 5 వేల టన్నుల ఇసుక వాగు నుంచి తోడుతున్నారు. రూ 25 వేలకు ఒక కంటెయినర్ చొప్పున నింపుతున్నట్టు చెప్తున్నారు.
రోజుకు ఎన్ని కంటెయినర్లు వస్తున్నాయి? వెళ్తున్నాయి? కాంగ్రెస్ ఎమ్మెల్యేకు ప్రధాన అనుచరుడిగా గుర్తింపు ఉన్న ఒక వ్యక్తి నోట్స్ రాసుకుంటున్నారు. జిల్లా సరిహద్దు వరకు ఇసుక కంటైనర్లు దాటించే బాధ్యత కూడ ఆయనదేనట. ఇందుకోసం ఆయన ప్రత్యేక ఇన్నోవా వాహనంలో తిరుగుతూ కనిపించారు. సదరు ప్రధాన అనుచరుడు ఒక్క ఫోన్ చేస్తే.. పోలీసులు, పలు శాఖల అధికారులు పక్కకు తప్పుకొని కంటెయినర్‌కు దారి ఇవ్వాల్సిందేనని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు.

వాగు మధ్యలో రోడ్డు
వాగు మధ్యలో రోడ్డు వేయటం అనేది తెలంగాణ చరిత్రలో ఇదే తొలిసారి కావ చ్చు. ఇప్పటి వరకు ఇసుక దందా చేసిన చోట వాగు నుంచి ఇసుక తోడి ఒడ్డుకు పోయటమో..లేదంటే ఒక చోట డంపు చే యటమో చూశాము. కానీ మెదక్ రూరల్ మండలం సంగాయిగూడ తండా శివారు లో హల్దీవాగులో దొంగలు ఏకంగా ప్రైవేట్ రోడ్డు వేశారు. తండా శివారు నుంచి వాగు మధ్య వరకు కొత్త రోడ్డు వేశారు. ఒడ్డుకు 500 మీటర్లు, వాగు నీళ్ల మధ్యన 500 మీటర్లు కలిపి మొత్తం కిలోమీటర్ వరకు కచ్చా రోడ్డు వేశారు.
నదులు, వాగులు తదితర ప్రకృతి వనరులు రెవెన్యూ, పంచాయతీరాజ్, భూగర్భ జలాలు, ఫారెస్టు, మైన్స్ అండ్ జియాలజీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, పోలీసు శాఖల ఉమ్మడి పరిధిలోకి వస్తాయి. నడివాగులో ఇంత పెద్ద రోడ్డు వే స్తుంటే ఒక్క అధికారి కూడా అటు వైపు చూ డక పోవడం ఆశ్చర్యం కలిగిస్తున్నది. వాస్తవ పరిస్థితిపై ఆరా తీస్తే.. ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే దాదాపు 10 రోజులపాటు నిక్కచ్చిగా అక్కడే నిలబడి రోడ్డు నిర్మాణం చేయించినట్టు రైతులు చెప్తున్నారు. అడ్డుకున్న రైతులను బెదిరించారని, కొందరిని లొంగదీసుకున్నారని, పంట నష్టపోయిన కొందరు రైతులకు కొద్దిమొత్తం నష్టపరిహారం కట్టించినట్టు స్థానిక రైతులు చెప్తున్నారు.
కౌన్సిలర్లకో క్వారీ..
స్థానిక కౌన్సిలర్లది మరో దారి. వీళ్లు ప్రత్యేకంగా మక్తభూపతిపూర్ వద్ద అక్రమ క్వారీ ఒకటి ఏర్పాటు చేశారు. ఈ క్వారీ కౌన్సిలర్లకు ఎవరు కేటాయించారంటే ఏ ఒక్క అధికారి వద్ద సమాచారం లేదు. సీసీ రోడ్లు, ఇందిర మ్మ ఇండ్ల పేరు మీద ఇసుక తరలిస్తున్నారు. ఇందులో కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేకు వాటా ఉన్నట్టు సమాచారం. ఇందిరమ్మ ఇండ్లకు ఎద్దుల బండ్లు, లేదా ట్రాక్టర్లు మాత్రమే వాడాలనే కచ్చితమైన నిబంధన ఉన్నది. ఒక్కో ఇంటికి పునాది నుంచి అస్త్రకారు వరకు మూడు దశల్లో 10 ట్రాక్టర్ల వరకు ఇసుక వాడుకోవచ్చు. గ్రామానికి కేటాయించిన ఇందిరమ్మ ఇండ్లను బట్టి రోజుకు కనిష్ఠం గా 4, గరిష్ఠంగా 20 ట్రాక్టర్ల మేరకు వాగుల నుంచి మాత్రమే ఇసుక తీసుకోవాలి. అంతకు మించితే నేరమే. కానీ మక్తభూపతిపూర్ నుంచి రోజుకూ 200కు పైగా ట్రిప్పులు తరలిస్తున్నట్టు స్థానికులు చెప్తున్నారు. ఇందిరమ్మ లబ్ధిదారులకు ఒక ట్రిప్పు ఇసుక పంపిణీ చేస్తే, బయట వ్యక్తులకు 10 ట్రిప్పులు అమ్ముకుంటున్నారు. ఇక్కడి నుంచి రోజుకూ 1,000 టన్నులకు పైగా ఇసుక తరలిస్తున్నారని స్థానికులు చెప్తున్నారు.