Singireddy Niranjan Reddy | యూరియా పంపిణీ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన యాప్ విధానంపై మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఈ స్కీమ్ అసలు రైతులకు శిక్ష.. కౌలు రైతులపై కక్ష అన్నట్లుగా ఉందని మండిపడ్డారు. ఆడలేక మద్దెలోడు అన్నట్లు .. ప్రభుత్వ యూరియా పంపిణీ వ్యవహారం ఉందని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలోనే యూరియా కొరత ఎందుకు వస్తోందని ఆయన ప్రశ్నించారు.
ఈ యూరియా యాప్ టెనెన్సీ యాక్ట్ ప్రకారం.. అసలు రైతులు, కౌలు రైతుల మధ్య చిచ్చుపెట్టేలా ఉందని సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. అసలు రైతులు ధైర్యంగా కౌలు ఇచ్చేందుకు ముందుకు వచ్చే సాహసం చేయకపోవచ్చని.. ఈ చర్య సాగును తగ్గించే కుట్రలా కనిపిస్తుందని అన్నారు. ఇంటి నుంచే యూరియా బుకింగ్ అనే నిర్ణయం కూడా అనుమానాస్పదంగా ఉందన్నారు. దళారులు రైతుల పేర్ల మీద యూరియా బుక్ చేసే అవకాశం ఉందని సందేహం వ్యక్తం చేశారు. నిరక్షరాస్యులైన రైతులు, స్మార్ట్ ఫోన్ వాడటం రాని రైతులకు ఈ నిర్ణయంతో ఇబ్బంది కలుగుతుందని తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాల్లో నెట్ వర్క్ లేని చోట సమస్యను ఎలా పరిష్కరిస్తారని ప్రశ్నించారు. యూరియా వాడకంపై రైతులకు అవగాహన కల్పించకుండా సర్కారు పిల్లిమొగ్గలు వేస్తుందని ఎద్దేవాచేశారు. మొదట కొన్ని జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలుచేయకుండా మొత్తం రాష్ట్రంలో అమలు చేయాలనుకోవడం అనాలోచిత చర్య అని విమర్శించారు.యూరియా ధర కన్నా రైతులకు రవాణా కిరాయి అధిక భారం పడేలా సర్కారు చర్యలు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆధార్, పట్టాదార్ పాసుబుక్కు, ఓటీపీ, ఇదంతా ఓ ప్రహసనంగా ఉందన్నారు.
కేసీఆర్ పాలనలో రాజులా బతికిన రైతు, కాంగ్రెస్ పాలనలో సాగు నుంచి పంట అమ్మకాల వరకు అవస్థలు ఎదుర్కొంటున్నాడని సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. అధికారంలోకి వస్తే ఎకరాకు రూ.15 వేల రైతు భరోసా అన్నారు. దానిని రూ.12 వేలకు కుదించి నాలుగు సార్లు ఎగ్గొట్టారని విమర్శించారు. కౌలు రైతులకూ రైతు భరోసా అని చెప్పి వారికి మొండి చేయి చూపించారన్నారు. ధాన్యం క్వింటాలుకు రూ.500 బోనస్ అన్నారని.. దాని జాడనే లేకుండా పోయిందని విమర్శించారు. పాత బకాయిలు ప్రభుత్వం ఎప్పుడు ఇస్తుందో అని రైతులు ఎదురుచూస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులపై కక్ష కట్టిందని.. అందుకే అడుగడుగునా అవాంతరాలు సృష్టిస్తున్నారని అన్నారు.