చేర్యాల, మార్చి 3 : తెలంగాణ అభివృద్ధి చెందడం ప్రధాని మోదీ, అమిత్‌షాలకు ఇష్టం లేదని, తెలంగాణ ప్రజలను మోసపూరిత ప్రచారాలతో బీజేపీ నేతలు మభ్యపెడుతున్నారని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి విమర్శించారు. మండలంలోని దొమ్మాటలో గురువారం డీఎంఎఫ్టీ (డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్) నిధులు రూ.50 లక్షల వ్యయంతో నిర్మించే జీపీ, మహిళా భవనాలకు ఎమ్మెల్యే ఎంపీపీ వుల్లంపల్లి కరుణాకర్, జడ్పీటీసీ శెట్టె మల్లేశం, మార్కెట్ కమిటీ చైర్మన్ సుంకరి మల్లేశంగౌడ్తో కలిసి భూమి చేశారు. సర్పంచ్ గాలిపల్లి సుభాషిణిరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఏడేండ్లలో తెలంగాణ దేశంలో ఆదర్శంగా నిలిచిందన్నారు. దీంతో కేంద్రంలో ఉన్న బీజేపీ పెద్దలకు మింగుడుపడడం లేదన్నారు.
కేంద్రానికి తెలంగాణ నుంచి పన్నుల పేరిట అధిక నిధులు వెళ్తుతున్నాయని, కానీ రాజ్యాంగబద్ధంగా రావాల్సిన నిధులు మాత్రం రావ డం లేదన్నారు. అభివృద్ధి కోసం రాష్ర్టానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు ఒక్కరోజు పార్లమెంట్లో మాట్లాడలేదని, కానీ, ఇక్కడకొచ్చి ప్రెస్మీట్లు పెట్టి మరీ ఉపన్యాసాలు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ర్టానికి రావాల్సిన నిధులు వెంటనే కేంద్రం మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. జనగామ నియోజకవర్గంలో 102 పంచాయతీలు ఉండేవని, ప్రభుత్వం నూతనంగా 36 పంచాయతీలను ఏర్పాటు చేసిందన్నారు. దీంతో 67 పంచాయతీ భవనాలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో కొత్త భవనాలు నిర్మించామన్నారు.
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఈ నెల 7,8,9వ తేదీల్లో మహిళల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మం డల అధ్యక్షుడు అనంతుల మల్లేశం, ఎంపీటీసీ వినోద, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు చంద్రం, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు ఎల్లారెడ్డి, టీఆర్ఎస్వై నాలుగు మండలాల ఇన్చార్జి శివగారి అంజయ్య, బీసీ సెల్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు బాలరాజు, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు శ్రీధర్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి, సర్పంచ్ యేనుగుల దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు.