సిద్దిపేట అర్బన్, మార్చి 3 : దళితుల జీవితాల్లో వెలుగులు నింపి, ఆర్థికంగా, సామాజికంగా ఆ వర్గాలను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళితబంధును జిల్లాలో ప్రభావవంతంగా అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని కలెక్టర్ హనుమంతరావు స్పష్టం చేశారు. జిల్లాలో ఈ నెల 5వ తేదీ నుంచి దళితబంధు పథకం కింద యూనిట్ల గ్రౌండింగ్‌కు సన్నద్ధంగా ఉండాలని ఆదేశించారు. గురువారం సిద్దిపేట కలెక్టరేట్ కార్యాలయంలో దళితబంధు గ్రౌండింగ్‌పై నియోజకవర్గ ప్రత్యేక అధికారులు ఆర్డీవోలు, జిల్లా అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
దళితబంధు ద్వారా అర్హులైన ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షలను ఎటువంటి హామీ, బ్యాంకు లింకేజీ లేకుండా ఉచితంగా ప్రభుత్వం అందిస్తున్నదన్నారు. మొదటి విడుతగా సిద్దిపేట జిల్లాలో 457మందిని ఎంపిక చేశామని కలెక్టర్ తెలిపారు. లాభదాయక యూని ట్లు మినీ డెయిరీ, పౌల్ట్రీ, మెడికల్ షాప్ తదితర యూనిట్లకు సంబంధించి గ్రౌం డింగ్ ప్రక్రియను రేపటి నుంచి ప్రారంభించాలని సూచించారు.
యూనిట్లకు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక లబ్ధిదారుల నుంచి తీసుకోవాలన్నారు. అలాగే, ప్రతి లబ్ధిదారుడికి సంబంధించి అతని పేరు, వివరాలు, సామాజిక ఆర్థిక సర్వేతో కూడిన ఫైల్‌ను సిద్ధం చేయాలన్నారు. యూనిట్ల గ్రౌండింగ్ త్వరగా, పారదర్శకంగా చేపట్టేందుకు కలెక్టర్ నేతృత్వంలో అదనపు కలెక్టర్లు, జిల్లా అధికారులు సభ్యులుగా జిల్లా కొనుగోలు కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. యూనిట్లను తాము ఇష్టపూర్వకంగా ఎంపిక చేస్తున్నట్లు లబ్ధిదారుల నుంచి ధ్రువీకరణ పత్రాలు తెలుగులో తీసుకోవాలన్నారు.
దళితబంధు పోర్టల్‌లో నియోజకవర్గ బాధ్యులు, ఎస్సీ కార్పొరేషన్ అధికారులు, ఎంపీడీవోలు, నమోదు చేసిన లబ్ధిదారుల వివరాల్లో తేడా ఉన్నాయని, వెంటనే సరి చేయాలన్నారు. కొందరు ఫోర్‌వీలర్స్, ట్యాక్సీ, ట్రాక్టర్ల ఎంపికకు ఆసక్తి చూపారని, వారితో అధికారులు మరోసారి సమావేశమై, యూనిట్ల కష్టనష్టాలు వివరించి, ఇతర లాభదాయక యూనిట్లు ఎంపిక చేసుకునేలా చూడాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ముజామ్మిల్‌ఖాన్, ట్రైనీ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, ఆర్డీవోలు విజేందర్‌రెడ్డి, అనంతరెడ్డి, జయచంద్రారెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ కార్యనిర్వాహక సంచాలకుడు రామాచారి, డీఆర్డీవో గోపాల్‌రావు, సెట్విన్ జిల్లా సమన్వయ అధికారి అమీనా బేగం, జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి సత్యప్రసాద్, సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.