రాయపోల్, మార్చి 3 : రాయపోల్ జడ్పీ ఉన్నత పాఠశాలలో 15ఏండ్ల నుంచి ఇంగ్లిష్ మీడియం బోధన సాగుతున్నది. పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యానందిస్తున్నది. ఏటా ఉత్తమ ఫలితాలు వస్తుండగా, ఇక్కడి విద్యార్థులు ట్రిపుల్ ఐటీకి ఎంపికవుతుండడంతో తల్లిదండ్రుల్లో హర్షం వ్యక్తమవుతున్నది. విద్యావంతులకు నిలయంగా మారిన ఈ పాఠశాలకు పూర్వ విద్యార్థులు సహాయం అందిస్తున్నారు. సర్కారు ‘మన ఊరు-మన బడి’ చేపట్టగా, పాఠశాల మరింత బలోపేతమయ్యేందుకు ఉతమిస్తుందని తల్లిదండ్రు లు, పూర్వ విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
రాయపోల్‌లో 1952లో ఉన్నత పాఠశాల ఏర్పాటు కాగా, 2008లో ఇంగ్లిష్ మీడియం ప్రారంభమైంది. ప్రస్తుతం పాఠశాలలో 6 నుంచి 10వ తరగతి వరకు మొత్తం 500మంది విద్యార్థులు చదువుతున్నారు. అందులో 6వ తరగతి నుంచి 10 వరకు 300 మంది విద్యార్థులు ఇంగ్లిష్ బోధన చేస్తున్నారు. మరో 130 మంది విద్యార్థులు తెలుగు మీడియం చదువుతున్నారు. ఏటా ఈ పాఠశాల నుంచి ట్రిపుల్ ఐటీకి ముగ్గురు చొప్పున ఇప్పటి వరకు 25మంది ఎంపికయ్యారు. ఉపాధ్యాయులతో విద్యార్థులు క్రమశిక్షణగా ఉండి చదువులు కొనసాగిస్తుండంతో రాయపోల్ ఉన్నత పాఠశాల కార్పొరేట్ స్థాయిలో గుర్తింపు వచ్చింది. గతం లో చాలా మంది ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లేవారు. కానీ, ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లిష్ మీడియం ఏర్పాటు చేయడంతో సర్కారు బడికి క్యూ కడుతున్నారు.
పూర్వ విద్యార్థుల సహాయం
రాయపోల్ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు అనేక మంది డాక్ట ర్లు, ఇంజినీర్లు, పోలీస్ ఇన్స్పెక్టర్లు, కానిస్టేబుళ్లు, ఉపాధ్యాయులు, సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా పని చేస్తున్నారు. రాష్ట్రస్థాయిలో రాజకీయంగా ఎదిగిన విద్యార్థులూ ఉన్నారు. అయితే, తమకు ఓనమాలు నేర్పిన పాఠశాలకు సాయం చేయాలనే లక్ష్యంతో చాలా మంది పూర్వ విద్యార్థులు ముందుకొచ్చి, పాఠశాల అభివృద్ధికి తోడ్పా టు అందిస్తున్నారు. 1993 బ్యాచ్ విద్యార్థులు రూ. లక్షతో విద్యార్థులకు ఉపయోపడే గ్రీన్ బోర్డులను అందించారు.
1990-91 బ్యాచ్ విద్యార్థులు ఆర్వో వాటర్ ప్లాంట్, సీసీ కెమెరాలు ఇచ్చా రు. ఎం. మోహన్‌రెడ్డి అనే పూర్వ విద్యార్థి పాఠశాలకు అవసరమైన సదుపాయాలతో పాటు డయాస్‌ను ఏర్పాటు చేయించారు. పూర్వ విద్యార్థులు చాలామంది చదువుకున్న పాఠశాలకు సాయం అందించారు. శ్రీనివాస్ బీరువా అందించారు. గజ్వేల్ లైన్స్ క్లబ్ మే ధ, స్నేహ సంయుక్తంగా ఎల్ఈడీ టీవీ, క్రీడాసామగ్రి, 300మందికి డిక్షనరీలు, లైబ్రరీ పుస్తకాలు ఇచ్చారు. సర్పంచ్ మౌనిక రాజిరెడ్డి బెంచీలు, రవీందర్ రెడ్డి హ్యాండ్ వాష్ ఏరియా ప్లాట్‌ఫామ్‌ను ఏర్పాటు చేయించారు. అలాగే, ఇక్కడ చదువుకొని విదేశాల్లో స్థిరపడిన ఎన్నారైలు పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తున్నారు.
విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది..
దాతలు, పూర్వ విద్యార్థుల సహకారంతో పాఠశాలలకు కావాల్సిన పరికరాలు, స్టడీ మెటీరియల్‌తో పాటు మౌలిక వసతులు అందుతున్నాయి. కరోనా నేపథ్యంలో ఇప్పటి వరకు చాలా మంది విద్యార్థులు పాఠశాలలో చేరారు. పదేండ్లుగా మెరుగైన ఫలితాలు రావడంతో పా టు ట్రిపుల్ ఐటీకి ఎంపికై, నేడు ఉద్యోగాలు సాధించారు. ‘మన ఊరు-మన బడి’తో ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం కానున్నాయి.
– కరుణాకర్, హెచ్ఎం, రాయపోల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల
ఇంగ్లిష్ బోధన ఎంతో అవసరం
మారుతున్న సమాజంలో ఇంగ్లిష్‌కు ఎంతో ప్రాధాన్యం ఉంది. విద్య, ఉద్యోగ రీత్యా ఇతర ప్రాంతాలకు వెళ్లే వారికి ఇంగ్లిష్ వచ్చి తీరాల్సిందే. ఈ ప్రాధాన్యాన్ని గుర్తించిన ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెడుతామని ప్రకటించడం సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉండాలి. నేను రాయపోల్ పాఠశాలలో పదో తరగతి చదివాను. నేడు ఇంజినీర్ చదివి బిల్డర్‌గా ఎదిగాను. నేడు ఇంతటి స్థాయిలో ఉన్నానంటే, గ్రామ బడి నాకు కన్న తల్లిలాంటిది. అప్పుడు తెలుగు మీడియం ఉన్నప్పటికీ పట్టుదలతో చదవడంతో పైచదువులకు మార్గం వచ్చింది. నేను ఏటా నా బడికి ఏదో రకంగా అభివృద్ధి, విద్యార్థులకు సహాయం అందిస్తా..
– మామడి మోహన్‌రెడ్డి, ఇంజినీర్, పూర్వ విద్యార్థి
పోటీ ప్రపంచంలో ఆంగ్లం అవసరం
నేను రాయపోల్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి వరకు చదివా. ఇంగ్లిష్ నేర్చుకొని, ఇంతటి స్థాయిలో ఉన్న. ప్రతి విద్యార్థి ఇంగ్లిష్ విద్యపై దృష్టి సారించాలి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హర్షించదగ్గ విషయం. ప్రస్తుత పోటీ ప్రపంచంలో రాణించాలంటే ఆంగ్లమాధ్యమం తప్పనిసరి.
– ముత్యంరెడ్డి, పూర్వ విద్యార్థి, పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు
ప్రపంచంతో పోటీ పడొచ్చు. .
ఆరు నుంచి 10వ తరగతి వరకు రాయపోల్ బడిలో చదివా. ఉపాధ్యాయుల కృషితో డాక్టర్ అయ్యా. అప్పుడు తెలుగు మీడియం ఉన్నా, ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చా. ప్రభుత్వ పాఠశాలల విషయంలో సీఎం కేసీఆర్ విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే కార్పొరేట్‌కు దీటుగా ఫలితాలు వస్తున్నాయి. రానున్న కాలంలో సర్కారు విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడతారు.
– డాక్టర్ దుర్గాప్రసాద్, పూర్వవిద్యార్థి
చదువుకున్న పాఠశాలకు చేయూతనిద్దాం..
నేను రాయపోల్ పాఠశాలలో చదువుకున్నా. చదువుకున్న బడికి ప్రతి పూర్వ విద్యార్థులు సాయం చేయాలి. సీఎం కేసీఆర్ మూలంగా నేడు కార్పొరేట్ స్థాయి విద్య అందుతున్నది. సర్కారు బడులకు అధునాతన హంగులు వచ్చాయి.
– పడకంటి శ్రీనివాస్‌గుప్తా, పూర్వ విద్యార్థి, మార్కెట్ కమిటీ చైర్మన్