సిద్దిపేట అర్బన్, మార్చి 3 : గజ్వేల్ నియోజకవర్గంలోని డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారుల జాబితాను ఈ నెల 10తేదీలోగా ఫైనల్ చేయాలని అదనపు కలెక్టర్ ముజామ్మిల్‌ఖాన్, గజ్వేల్ ఆర్డీవో విజేందర్‌రెడ్డిని కలెక్టర్ హనుమంతరావు ఆదేశించారు. గురువారం సమీకృత కలెక్టరేట్లో గజ్వేల్ నియోజకవర్గంలోని ప్రగతి, పెండింగ్ పనుల పురోగతి, డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారుల ఎంపికపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. దీనికి ఎమ్మెల్సే యాదవరెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, వైస్ చైర్మన్ ఎండీ జకీరొద్దీన్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. నియోజకవర్గంలో డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక అర్హత ప్రాతిపదికన పారదర్శకంగా డ్రా తీయాలన్నారు. మండల కేంద్రాల్లో సమీకృత కార్యాలయాల భవన సముదాయాలు, పంచాయతీ భవనాలు, రాజీవ్ రహదారిని అనుకొని ఉన్న గ్రామాల్లో పంచాయతీ భవనాలు ఐకానిక్ మోడల్లో నిర్మించాలన్నారు. ప్రతీ మండల కేంద్రంలో సీసీ లేని రోడ్డు ఉండొద్దన్నారు. అన్ని గ్రామాల్లో రోడ్లు, అవసరమైన సదుపాయాల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. సాధ్యమైనంత త్వరగా ఇంజినీరింగ్ అధికారులు పనులు ప్రారంభించాలన్నారు. పనుల్లో నాణ్యతా లోపించొద్దన్నారు. నియోజకవర్గంలోని 82 ఫంక్షన్‌హాళ్లు దసరా కల్లా పూర్తి కావాలని ఆదేశించారు.
అనంతరం తునికిబొల్లారం, ములుగు, ఆర్అండ్ఆర్ కాలనీల్లో పెండింగ్ పనులపై సమీక్షించారు. సాధ్యమైనంత త్వరగా కాలనీల్లో పనులు పూర్తి చేయాలని అధికారులు, కాంట్రాక్టర్లకు సూచించారు. నిర్వాసితుల వ్యక్తిగత అర్జీలను రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి పరిశీలిస్తున్నారని, అర్హులందరికీ న్యాయం జరిగేలా చూస్తామన్నారు. సమావేశంలో శిక్షణ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, గడా ప్రత్యేక అధికారి ముత్యంరెడ్డి, సిద్దిపేట ఆర్డీవో అనంతరెడ్డి, గజ్వేల్ మున్సిపల్ కమిషనర్ కృష్ణారెడ్డి, పంచాయతీరాజ్ ఎస్ఈ కనకరత్నం, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి అశోక్, మిషన్ భగీరథ ఎస్ఈ చారి, ఈఈ రాజయ్య తదితరులు పాల్గొన్నారు.