సంగారెడ్డి అర్బన్, జనవరి 18 : దారి దోపిడీకి పాల్పడుతున్న రంగారెడ్డి జిల్లాకు చెందిన దొంగల ముఠాను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు సంగారెడ్డి ఎస్పీ రమణ కుమార్ తెలిపారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ వివరాలు వెల్లడించారు. డిసెంబర్ 8, 2021న మహారాష్ట్ర నుంచి మహాదేవ్బీర్ అనే వ్యక్తి గొర్రెల లోడ్‌లో వస్తున్న బొలెరో వాహనాన్ని అర్ధరాత్రి ఇస్నాపూర్ వద్ద దొంగల ముఠా సభ్యులు ఆపారు. పోలీసులమని బెదిరించి విచారణ జరపాలని వారిని ఇన్నోవా వాహనంలో తీసుకెళ్లారు.
మరికొందరు గొర్రెలతో ఉన్న బొలెరో వాహనాన్ని తీసుకెళ్లారు. ఈ కేసు విచారణ కొనసాగుతుండగానే.. జనవరి 13న రుద్రారం వద్ద గొర్రెలతో వస్తున్న వాహనాన్ని అడ్డగించి, ఇందులో గంజాయి రవాణా అవుతుందంటూ హల్చల్ చేసి బెదిరించి వాహనంలో ఉన్న షేక్ తస్లీమ్ దేశ్‌ముఖ్, డ్రైవర్ కిషన్‌ను వారి వాహనంలో తీసుకెళ్లి దూరంలో వదిలిపెట్టి గొర్రెలను ఎత్తుకెళ్లారు. బాధితులు వెంటనే వెళ్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ కేసును సీరియస్‌గా తీసుకొని హైదరాబాద్‌లోని మాంసం మార్కెట్లపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు.
గొర్రెలను విక్రయించేందుకు ఈనెల 17న జియాగూడ మార్కెట్‌కు వచ్చిన దొంగల ముఠాలోని నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించడంతో అసలు విషయం బయటపడింది. నిందితుల నుంచి 60 గొర్రెలు, లక్షా 51 వేల నగదు, ఒక పిస్తల్, బొలెరో వాహనాన్ని స్వాధీ నం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముఠా సభ్యులు ఖాజా వహిదుద్దీన్, మహ్మద్ తాజోద్దీన్, మహ్మద్ ఇషాఖ్, మహ్మద్ హనీఫ్‌ను అరెస్టు చేయగా, షేక్ ఇమ్రాన్, తైమూర్, అమీర్ పరారీలో ఉన్నట్టు ఎస్పీ తెలిపారు.
అనంతరం చాకచక్యంగా కేసును చేధించిన పటాన్చెరు పోలీస్ అధికారులు, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. సమావేశంలో పటాన్చెరు డీఎస్పీ భీంరాజు, సీఐలు వేణుగోపాల్‌రెడ్డి, శ్రీనివాసులు, భూపతి పాల్గొన్నారు.