స్వయం సహాయక సంఘాల మహిళలు ఆర్థికంగా ఎదగడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నారు. స్త్రీనిధి, బ్యాంకు లింకేజీ రుణాలతో స్వయం ఉపాధిలో రాణిస్తూ కుటుంబాలను పోషించుకుంటూ, ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. స్త్రీనిధి రుణాల పంపిణీ, రికవరీలో జిల్లాలోని అక్కన్నపేట మండలం రాష్ట్రంలో రెండో, జిల్లాలో మొదటి స్థానంలో నిలిచి సత్తాచాటింది. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి చేతులు మీదుగా అవార్డు సైతం అందుకున్నారు.
అక్కన్నపేట, మార్చి 31: రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాలకు ఆర్థిక భరోసా కల్పిస్తుండడంతో స్వావలంబన దిశగా మహిళలు అడుగులు వేస్తున్నారు. స్త్రీనిధి రుణాలతో స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులు స్వయం ఉపాధి పొందుతూ కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు. 2020-2021 గానూ తెలంగాణ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (టీ సెర్ప్) ఆధ్వర్యంలో స్త్రీనిధి ద్వారా మండలంలోని మహిళా సంఘాల సభ్యులకు రూ.3.10 కోట్లు రుణాలు పంపిణీ చేసేందుకు టార్గెట్ పెట్టుకున్నారు. కాగా, టార్గెట్‌కు మించి 355 మహిళా సంఘాల్లోని 1020 మంది సభ్యులకు రూ. 4.30 కోట్ల రుణాలు పంపిణీ చేశారు. అదే స్థాయిలో వందశాతం రికవరీ చేయడంతో పాటు లక్ష్యానికి మించి రుణాలు ఇప్పించడంతో జిల్లాలోనే అక్కన్నపేట మండలం మొదటి స్థానంలో నిలిచింది. రాష్ట్రస్థాయిలో రెండో స్థానంలో నిలిచింది. టీసెర్ప్, మండల సమాఖ్య సంయుక్తంగా చేసిన ఈ సేవలకు గుర్తింపుగా హైదరాబాద్‌లో బుధవారం జరిగిన స్త్రీనిధి సహకార పరపతి సమాఖ్య సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్‌కుమార్ సుల్తానియా, ఇతర రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారుల చేతుల మీదుగా శ్రీస్వయం భూ రాజరాజేశ్వర మండల సమాఖ్య ప్రతినిధులు అవార్డు, ప్రశంసా పత్రం అందుకున్నారు.
1017 మహిళా సంఘాలు
మండలంలో 1017 స్వయం సహాయక మహిళా సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాల్లో 9985 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. స్వయంభు రాజరాజేశ్వర మండల సమాఖ్య పరిధిలో 36 గ్రామైక్య సంఘాలు ఉన్నాయి. 10 నుంచి 15 మంది మహిళలతో కలిసి ఒక మహిళా సంఘం ఏర్పాటు చేసుకుంటున్నారు. కొన్ని మహిళా సంఘాలను కలుపుతూ ఒక గ్రామైక్య సంఘం అవిర్భవిస్తుంది. ఈ గ్రామైక్య సంఘం అధ్యక్షురాలు, వీవోఏలు క్షేత్రస్థాయిలోని మహిళా సంఘాల పనులను చేస్తారు. వీరికి అనుసంధానంగా టీ సెర్ప్ ఆధ్వర్యంలో పని చేస్తున్న సీసీలు, ఏపీఎం మొత్తంగా మహిళా సంఘాల కార్యకలాపాలు ఎప్పటికప్పుడు నిర్వహిస్తూ, పర్యవేక్షిస్తారు. అలాగే స్త్రీనిధికి సంబంధించి మండల స్థాయిలో స్త్రీ నిధి అసిస్టెంట్ మేనేజర్, మేనేజర్లు రుణాలను మంజూరు చేస్తారు.
రుణాలతో జీవనోపాధి పొందుతున్న మహిళలు
ప్రభుత్వం అందించే స్త్రీనిధి, బ్యాంకు లింకేజీ రుణాలను మహిళలు సద్వినియోగం చేసుకుంటున్నారు. రుణాలు పొందిన మహిళలు జీవనోపాధి పొందుతున్నారు. స్థానికంగా స్వయం ఉపాధిని ఏర్పాటు చేసుకుని కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నారు. ఆర్థికంగా చేయూతనందిస్తున్నారు. ప్రధానంగా కిరాణా, పాడిగేదెలు, పిండిగిర్నీలు, గొర్రెలు, మేకలు, హోటల్, కూరగాయల అమ్మకం, ఫొటోస్టూడియో, సెట్రింగ్, బట్టల షాపులు, గాజుల అమ్మకం, ఎద్దులు, వ్యవసాయానికి బోర్లు, బ్యూటీపార్లర్, సెల్‌ఫోన్ రిపేర్, జిరాక్స్, కుట్టు మిషన్ మొదలుగు జీవనోపాధులు ఏర్పాటు చేసుకుని కుటుంబాలను పోషించుకుంటున్నారు.
స్త్రీనిధి ద్వారా రూ. 4.30 కోట్లు పంపిణీ..
అక్కన్నపేట మండలంలో ఈ ఆర్థిక సంవత్సరానికి స్త్రీనిధి ద్వారా రూ. 3.10 కోట్ల్లను మహిళా సంఘాల్లోని సభ్యులుకు రుణాలను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ, మండలంలోని 355 మహిళా సంఘాల్లోని 1020 మంది మహిళా సభ్యులకు ఇప్పటి వరకు రూ. 4.30 కోట్ల రుణాలు పంపిణీ చేశారు. దీంతో లక్ష్యానికి మించి స్త్రీనిధి రుణాలను మంజూరు చేయడంపై మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో మహిళా సంఘానికి రూ. 6లక్షల వరకు మంజూరు చేశారు. మహిళా సంఘాల్లోని సభ్యులకు సాధారణ రుణం కింద రూ. 40 వేలు, మైక్రో రుణం కింద రూ. 75 వేలు, ట్రైనీ రుణం రూ. లక్ష నుంచి రూ. 3లక్షల వరకు రుణాలు ఇవ్వనున్నారు. ఒక మహిళా గ్రూపులోని ఆరుగురు సభ్యులకు సాధారణ లోన్, ముగ్గురు సభ్యులకు మైక్రో లోన్ ఇచ్చేలా ప్రణాళికలు రూపొందించారు. స్త్రీనిధి రుణాలు తీసుకున్న మహిళలు జీవనోపాధిని ఏర్పాటు చేసుకుని స్వయం ఉపాధిని పొందుతున్నారు. వచ్చే ఆదాయంతో ప్రతినెలా తిరిగి రుణాలు చెల్లిస్తున్నారు.
మహిళా సంఘాలకు స్త్రీనిధి వరం..
మహిళా సంఘాలకు స్త్రీనిధి వరంలాంది. స్త్రీనిధిలో భాగంగా సువిధ కింద రూ. 40 వేలు, ప్రగతి కింద రూ. 50 నుంచి రూ. 75 వేలు, అక్షయ కింద రూ. లక్ష నుంచి రూ. 1.25 లక్షలు, సౌభ్యాగ కింద రూ. 1.25 లక్షల నుంచి రూ. 3లక్షల రుణాలు మంజూరు చేస్తున్నాం. జిల్లాలోనే మెట్టమొదటిసారిగా అక్కన్నపేట మండలంలో సౌభ్యాగ స్కీం అమలు చేశాం. నాటుకోళ్ల పెంపకం కోసం ఓ మహిళా సభ్యురాలికి రూ. 2.91లక్షలు స్త్రీనిధి సౌభాగ్య ద్వారా అందజేశాం. తీసుకున్న రుణాలను కూడా సకాలంలో చెల్లిస్తున్నారు. ఇప్పటి వరకు వందశాతం రికవరీ ఉంది.
– ఉల్లెంగుల స్వప్న, స్త్రీనిధి అసిస్టెంట్ మేనేజర్, ఉమ్మడి హుస్నాబాద్
రుణాలపై అవగాహన కల్పిస్తున్నాం..
ప్రతి వారంలో రెండుసార్లు ఎస్‌హెచ్‌జీ, వీవో సంఘాల సమావేశం నిర్వహిస్తున్నాం. సమావేశానికి వచ్చే వీవో అధ్యక్షురాలు, సీఏలకు స్త్రీనిధి, బ్యాంకు లింకేజీలపై అవగాహన కల్పిస్తున్నాం. అలాగే ప్రతీది మహిళా సంఘాల సభ్యులందరికీ వర్తించే విధంగా క్షేత్రస్థాయిలో స్వయం సహాయక మహిళా సంఘాలకు సమావేశం ఏర్పాటు చేసి చెబుతున్నాం. బ్యాంకు లింకేజీతో పాటు స్త్రీనిధి రుణాలు ఇప్పిస్తున్నాం. దరఖాస్తు చేసుకున్న ప్రతి మహిళా సభ్యురాలికి స్త్రీనిధిలో వ్యక్తిగతంగా, సంఘాల్లో సమష్టిగా అప్పు ఇస్తున్నాం.
– మమత, శ్రీస్వయంభూ రాజరాజేశ్వర మండల సమాఖ్య అధ్యక్షురాలు, అక్కన్నపేట