చేర్యాల, మార్చి 24 : కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఈ నెల 27న మల్లన్న క్షేత్రంలో కల్యాణ వేదిక వద్ద అగ్నిగుండాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల్లో మొత్తం 11 ఆదివారాలు ఉత్సవాలను అర్చకులు నిర్ణయించారు. చివరి ఆదివారం నిర్వహించే అగ్నిగుండాలకు పెద్దసంఖ్యలో వచ్చే అవకాశం ఉండడంతో ఆలయ వర్గాలు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. కల్యాణ వేదిక ప్రాంగణంలో పెద్ద అగ్నిగుండం తయారు చేయడంతో పాటు బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత నిర్వహించే అగ్నిగుండాల కార్యక్రమంతో ముగియనున్నాయి.
చివరి వారం కావడంతో స్వస్తిశ్రీ ప్లవ నామ సంవత్సరం ఫాల్గుణ ఏకాదశి ఆదివారం రాత్రి 7 గంటలకు వీరభద్ర ప్రస్తాయం, భద్రకాళి పూజ, రాత్రి 11 గంటలకు అగ్నిగుండముల ప్రజ్వలణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 28న ఉద యం 5 గంటలకు గురుపూజ, బలిహరణం, అగ్నిగుండాల ప్రవేశం, విజయోత్సవం, ఉదయం 11 గంటలకు మల్లికార్జునస్వామి, అమ్మవార్లకు ఏకాదశ రుద్రాభిషేకం, మహామంగళహారతి, మంత్రపుష్పం, జంగమర్చాన, అనంతరం తీర్థప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
విస్తృత ఏర్పాట్లు
మల్లన్న ఆలయ వర్గాల ఆధ్వర్యంలో అగ్నిగుండాల కార్యక్రమానికి అన్ని చర్యలు చేపట్టారు. అగ్నిగుండం తయారు చేసేందుకు ఐదు రకాల పళ్లవాలను (కర్రలు) మల్లన్న ఆలయంలో సమకూర్చారు. మామిడి, జువ్వి, రాగి, మేడి, మర్రి కర్రలను ఒక్కచోట పేర్చి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వాటిని అంటించి అగ్నిగుండంగా తయారు చేస్తారు. అర్చకులు స్వామివారి ఉత్సవ విగ్రహాలను అగ్నిగుండం వద్దకు తీసు కొచ్చి దాటుతారు. అనంతరం భక్తులు అగ్నిగుం డం దాటి మల్లికార్జున స్వామి వారిని దర్శనం చేసుకుంటారు. ఆలయ ఈవో బాలాజీ, పాలక మండలి చైర్మన్ గీస భిక్షపతి, కమిటీ సభ్యులు, అర్చకులు, ఒగ్గు పూజారుల ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. కల్యాణ వేదిక ప్రాంతంలో పెద్ద అగ్నిగుండం తయారు చేయడంతో పాటు భక్తులు వీక్షించేందుకు వీలుగా బారికేడ్లు ఏర్పా టు చేస్తున్నారు.
భక్తులు తరలిరావాలి
అగ్నిగుండాల కార్యక్రమాన్ని వీక్షించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలిరానున్నారు. భక్తులకు అన్ని వసతులు కల్పిస్తున్నాం. ఆలయ అధికారులు, ధర్మకర్తల మండలి సభ్యులు, సిబ్బంది, అర్చకులు, ఒగ్గు పూజారులతో పాటు పోలీస్ శాఖ వారితో అగ్నిగుండాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు చర్యలు ప్రారంభించారు.
-గీస భిక్షపతి, ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్