పత్తి రైతు పంట పండుతున్నది. ఈసారి పత్తికి మార్కెట్లో మంచి ధర లభిస్తుండడంతో వానకాలంలో సాగుచేసిన రైతులకు కాసులు కురుస్తున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో పదిరోజులుగా పత్తిని తెంపి రైతులు మార్కెట్లు, జిన్నింగ్ మిల్లులకు విక్రయానికి తెస్తున్నారు. ఆయా మార్కెట్లలో క్వింటాలుకు ధర రూ.8 వేలకు పైనే పలుకుతున్నది. మంగళవారం గజ్వేల్ మార్కెట్లో క్వింటాలుకు రూ.8759 ధర పలికింది. బహిరంగ మార్కెట్లో ప్రభుత్వ మద్దతు ధర కంటే ఎక్కువగా ఉండడంతో ప్రభుత్వరంగ సంస్థ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) కొనుగోలు చేయడం లేదు. మన వద్ద పండిన పత్తి మంచి నాణ్యతతో ఉండడంతో ఇతర రాష్ర్టాల్లో గిరాకీ ఉంది. దీంతో వ్యాపారులు పోటీపడి కొంటున్నారు. కాగా, ఉమ్మడి మెదక్ జిల్లాలో పత్తి తీసేందుకు కూలీల కొరత వేధిస్తున్నది. దీంతో రాయలసీమలోని కర్నూలు తదితర ప్రాంతాల నుంచి వలస కూలీలు సంగారెడ్డి జిల్లాకు వచ్చి పత్తి తీస్తూ ఉపాధి పొందుతున్నారు.
సిద్దిపేట, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ సంగారెడ్డి: అన్నదాతకు పత్తి సాగు కలిసొచ్చింది. ఈసారి పత్తికి మంచి ధర పలుకుతున్నది. ఆయా మార్కెట్లో క్వింటాలుకు ధర రూ.8 వేలకు పైగానే పలుకుతున్నది. ఉమ్మడి మెదక్ జిల్లాలో పదిరోజులుగా పత్తిని రైతులు మార్కెట్లు, జిన్నింగ్ మిల్లులకు తీసుకువస్తున్నారు. దీంతో ఆయా పత్తి మార్కెట్లు, జిన్నింగ్ మిల్లులు పత్తితో కళకళలాడుతున్నాయి. క్వింటాల్‌కు ధర రూ.8,699 పైనే పలుకుతున్నది. బహిరంగ మార్కెట్లో ప్రభుత్వ మద్దతు ధర కంటే ఎక్కువగా ఉండడంతో ప్రభుత్వరంగ సంస్థ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) కొనుగోలు చేయడం లేదు. దీంతో ఆయా జిన్నింగ్ మిల్లుల్లోనే వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. రెండు మూడేండ్ల నుంచి చూస్తే బహిరంగ మార్కెట్లో పత్తికి మంచి ధర పలుకుతున్నది. మన వద్ద పండిన పత్తి మంచి నాణ్యతతో ఉండడం, ఇక్కడి పత్తికి ఇతర రాష్ర్టాల్లో మంచి గిరాకీ ఉంది. మంచి పంట పండితే ఎకరాకు సరాసరిగా 7 నుంచి 10 క్వింటాళ్ల దిగుబడి రైతుకు వస్తుంది. కాగా, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ మద్దతు ధరకు తగ్గకుండా అమ్మకాలు జరిగేలా చూసుకుంటున్నారు. బహిరంగ మార్కెట్లో ప్రభుత్వ మద్దతు ధరకు తక్కువ అమ్మకాలు జరిగితేనే సీసీఐ రంగంలోకి దిగుతుంది. సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్, దుబ్బాక, చేర్యాల ప్రాంతాలతో పాటు సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేట్, రాయికోడ్, వట్పల్లి, నారాయణఖేడ్, జోగిపేట తదితర ప్రాంతాల్లో జిన్నింగ్ మిల్లులున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా సుమారుగా 50 వరకు జిన్నింగ్ మిల్లులున్నాయి. వీటన్నింటిలో వ్యాపారులు పత్తి కొనుగోళ్లు ప్రారంభించారు.
ఉమ్మడి జిల్లాలో 5,40,966 ఎకరాల్లో పత్తి సాగు…
ఉమ్మడి మెదక్ జిల్లాలో 5,40,966 ఎకరాల్లో రైతులు పత్తి పంట సాగుచేశారు. అత్యధికంగా సంగారెడ్డి జిల్లాలో 3,61,099 ఎకరాల్లో సాగు చేశారు. సిద్దిపేట జిల్లాలో 1,26,625 ఎకరాలు, మెదక్ జిల్లాలో 53,242 ఎకరాల్లో సాగైంది. ఉమ్మడి జిల్లాలో వరి తర్వాత అత్యధికంగా పత్తి పంటను సాగు చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్లుగా ఈసారి వానకాలంలో రైతులు పత్తి సాగుకు మొగ్గు చూపారు. పత్తికి డిమాండ్ కూడా ఎక్కువగానే ఉన్నది. మార్కెట్లో క్వింటాల్‌కు రూ.8వేల నుంచి రూ.9వేల వరకు ధర పలుకుతున్నది. సీసీఐ మద్దతు ధర రూ.6,800 ఉంది. దీనికన్నా అధిక ధర బయట మార్కెట్లోనే పలకడంతో రైతులు జిన్నింగ్ మిల్లుల్లో అమ్ముకుంటున్నారు. సిద్దిపేట జిల్లాలో 25 జిన్నింగ్ మిల్లులుండగా, సంగారెడ్డి జిల్లాలో 19 జిన్నింగ్ మిల్లులున్నాయి. ప్రతి 5.5 క్వింటాల్‌ను కలిపి ఒక బెల్గా నిర్ణయిస్తారు. గజ్వేల్‌లో రూ.రూ.8,759 వేల వరకు పలికింది. దీంతో రైతులు సంతోషంగా ఉన్నారు.
పత్తి ధర పైపైకి..
గజ్వేల్ మార్కెట్లో క్వింటాలుకు రూ.8,759 ధర పలికిన పత్తి
గజ్వేల్, నవంబర్ 2: పత్తి ధర మరింత పెరిగింది. మంగళవారం గజ్వేల్ వ్యవసాయ మార్కెట్లో క్వింటాలు పత్తికి రూ.8,759 ధర పలికింది. సోమవారం గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీకి 34మంది రైతులు 87క్వింటాళ్ల పత్తిని విక్రయించడానికి తీసుకువచ్చినట్లు మార్కెట్ కార్యదర్శి జాన్‌వెస్లీ తెలిపారు. దౌల్తాబాద్ మండలం మాసాన్‌పల్లికి చెందిన ఓ రైతు 5.65 క్వింటాళ్ల పత్తిని విక్రయించగా, అతడికి క్వింటాలుకు రూ.8,759ధర చొప్పున కమీషన్ వ్యాపారులు చెల్లించారు. సోమవారం రాత్రి వరకు గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ పరిధిలోని పత్తి మిల్లుల్లో మిల్లర్లు 248 మంది రైతుల నుంచి 1,250 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేయగా, ఇప్పటివరకు 3,981 రైతుల నుంచి 24,097 క్వింటాళ్ల పత్తిని మిల్లర్లు కొనుగోలు చేశారు. గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీలో మంగళవారానికి 413 మంది రైతుల నుంచి 1,093 క్వింటాళ్ల పత్తిని వ్యాపారులు కొనుగోలు చేశారు. మంగళవారం క్వింటాలు పత్తికి రూ.8,500లు కనిష్టంగా ధర పలుకగా, గరిష్టంగా రూ.8,759 పలికింది.
పనిలేకే వలస వచ్చాం…
ఉన్న ఊర్లో చేతినిండా పనిలేకనే ఇక్కడికి పత్తి తీసేందుకు వలస వచ్చాం. ఉదయాన్నే పంట పొలానికి చేరుకుని పత్తి తీయడంలో చేరిపోతాం. సాయంత్రం 6 గంటల వరకు తీసిన పత్తిని పొలం యజమాని వాహనంలో ఇంటికి చేర్చి మేముండే చోటుకి వెళ్లిపోతాం. రోజుకు సుమారుగా క్వింటాలు పత్తి తీస్తేనే గిట్టుబాటు అవుతుంది. కుటుంబంతో సహా పంట పొలంలో వాలిపోయి పనులు చేపతాం.
సంపాదనకే పనిచేస్తున్నం…
కష్టపడితేనే నాలుగు రాళ్లు చేతికొస్తాయనే పత్తితీసి సంపాదన చేద్దామనే ఇక్కడికి వచ్చాం. ఉన్న ఊరును వదిలి పొట్టచేత పట్టుకుని పనిచేసి సంపాదిస్తాం. కోడి కూయగానే నిద్రలేచి వంటావార్పు చేసుకుని పొలానికి చేరుకుంటాం. పొలం యజమాని ఏర్పాటు చేసిన వాహనంలో చేనుకు చేరుకుని పత్తి తీసే పనిలో పడతాం. రోజు క్వింటాలు పత్తి తీస్తేనే కూలీ గిట్టుబాటవుతుంది. కుటుంబసభ్యుల వారీగా పొలాలను ఎంచుకుని పత్తి తీస్తాం.
నమ్మకంతో పనిచేస్తాం…
కూలి చేసుకుని బతికే మాలాంటి పేదలకు ఇక్కడ పనులు దొరకడం సంతోషంగా ఉంది. యజమాని చెప్పిన పనిని నమ్మకంతో పూర్తిచేస్తాం. కుటుంబంలోని అందరం ఒకే దగ్గర పనిచేస్తాం. ఏటా ఇక్కడికి పత్తి తీసేందుకు వస్తున్నాం. రెండు, మూడు నెలల పాటు పత్తి తీసే పనులు పూర్తికాగానే ఊరికి తిరుగు ప్రయాణమవుతాం.
రాయలసీమ నుంచి కూలీలు…
సంగారెడ్డి జిల్లాలో పత్తి పంటను తీసేందుకు రాయలసీమ నుంచి కూలీలు వస్తున్నారు. కర్నూలు జిల్లా నుంచి కోషికి మండలానికి చెందిన డి.బెలిగేళ్లు, చింతకుంటా, జెబ్బపూర్, కొత్తలం మండలం నుంచి గొడుగాళ్లు, వెలిగేజ్ గ్రామాలకు చెందిన కూలీలు సంగారెడ్డి మండల పరిధిలోని ఇరిగిపల్లిలో గుడారాలు ఏర్పాటు చేసుకుని పత్తితీసే పనులు చేస్తున్నారు. జహీరాబాద్ ప్రాంతంలో పత్తి తీసేందుకు రైతులకు కూలీల కొరత వేధిస్తున్నది. వీరు కూడా రాయలసీమ వలస కూలీలతో పత్తి తీయిస్తున్నారు. రోజుకు క్వింటాలు పత్తి తీస్తేనే కూలీలకు గిట్టుబాటు అవుతుంది. అందుకోసం వారు ఉదయం 6 గంటలకే పత్తి చేలల్లో పని మొదలు పెడుతున్నారు. వీరితో పాటు జిల్లాలోని జహీరాబాద్ ప్రాంతానికి చెందిన గిరిజనులు అధిక సంఖ్యలో పత్తి తీసేందుకు వరుస కడుతున్నారు. కిలో పత్తి తీస్తే రూ.11 చొప్పున భూయజమాని చెల్లిస్తున్నారు. స్థానిక కూలీలకు కిలో పత్తి తీస్తే రూ.10 పొలం యజమానులు ఇస్తున్నారు. పత్తి పంటను తీసిన కూలీలే పొలం యజమాని ఇంటి వద్దకు వాహనాల్లో చేరవేస్తున్నారు. వలస కూలీలతో రైతులకు రందీలేకుండా పోయింది. కుటుంబాలతో వలస వచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు పత్తి తీస్తూ అనేక కుటుంబాలు పొట్టపోసుకుంటున్నాయి.