
సిద్దిపేట అర్బన్/ సంగారెడ్డి కలెక్టరేట్/మెదక్, అక్టోబర్ 29 : దేశంలోనే తొలిసారిగా భూ రికార్డుల నిర్వహణ కోసం ధరణి పోర్టల్‌ను అక్టోబర్ 29న సీఎం కేసీఆర్ ప్రారంభించారు. నేటితో విజయవంతంగా ఏడాదిపాటు ధరణి పోర్టల్ తన కార్యకలాపాలను పూర్తి చేసుకున్నది. దీం తో దేశంలోనే భూ పరిపాలనా రంగంలో విప్లవాత్మకమైన ధరణి కార్యక్రమం సిద్దిపేట జిల్లాలో సమర్థవంతంగా అమలవుతున్నది.
నిమిషాల్లో భూ రిజిస్ట్రేషన్లు
ఏడాది క్రితం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మాత్రమే రిజిస్ట్రేషన్లు జరిగేవి. అప్పుడు జిల్లాలో ఒకటి, రెండు కార్యాలయాలు మాత్రమే ఉండేవి. కానీ నేడు ప్రతీ తహసీల్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. సిద్దిపేట జిల్లాలో 24 తహసీల్ కార్యాలయాలతో పాటు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయా ల్లో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి.
ధరణి విప్లవాత్మక, సాహసోపేతమైన నిర్ణయం
భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి సాహసోపేతమైన, విప్లవాత్మకమైన నిర్ణయం ధరణి అని సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి పేర్కొన్నారు. ధరణి ప్రారంభమై ఏడాది పూర్తయిన సందర్భంగా శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయంలో ధరణిపై కలెక్టర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అనతి కాలంలోనే భూ రికార్డుల ప్రక్షాళన, సక్సెస్ఫుల్ కావడానికి ధరణి దోహదపడిందని, రిజిస్ట్రేషన్లు సులభతరం చేసిందని అన్నారు. ధరణిలో నిక్షిప్తమైన భూములకు భద్రత, భరోసా ఉన్నాయన్నారు. 30, 40 ఏండ్ల నుంచి ఎన్నో రకాల భూ సమస్యలు, అభద్రత తదితర ఇబ్బందులకు తెరపడిందని కలెక్టర్ చెప్పారు. భవిష్యత్తులో భూ వివాదాలు, అవినీతికి తావు లేకుండా అధికారులు ఇష్టం వచ్చినట్లు వ్యవహరించకుండా పకడ్బందీ వ్యూహంతో ధరణి రూపకల్పన చేసినట్లు కలెక్టర్ వివరించారు. గతంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తరువాత మ్యుటేషన్, పాస్‌బుక్ వచ్చేందుకు నెలలు, సంవత్సరాల సమయం పట్టేదని, ఇప్పుడు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన వెంటనే మ్యుటేషన్ జరగడంతో పాటు పాస్‌బుక్ కొనుగోలుదారుకు వస్తుందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వాలు సాహసం చేయని పరిస్థితుల్లో దేశానికే ఆదర్శంగా అతి తక్కువ సమయంలోనే సీఎం కేసీఆర్ పట్టుదలతో భూ సమస్యలకు పరిష్కారం, భూ రికార్డుల భద్రతకు తెలంగాణ రాష్ట్రంలోనే నాంది పలకడం జరిగిందని అన్నారు. రోజూ 100 నుంచి 150 దరఖాస్తులు వస్తే క్లియరెన్స్ చేస్తున్నామని, రానున్న 2,3 మాసాల్లో ధరణిలో అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని కలెక్టర్ తెలిపారు. దేశానికే ఆదర్శంగా నిలిచిన ధరణి పట్ల జిల్లా రైతులు, అధికార యంత్రాంగం తరపున సీఎం కేసీఆర్‌కు ప్రత్యే క అభినందనలు తెలిపారు. ధరణి పోర్టల్ విజయవంతంగా అమలు చేసేందుకు ఆర్డీవోలు, తాసీల్దార్లు, ఇతర రెవెన్యూ అధికారులు చేస్తున్న కృషిని కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి అభినందించారు. ధరణిని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని ప్రజలందరికీ కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.
సిద్దిపేట జిల్లాలో ధరణిలో పూర్తి లావాదేవీలు
భూ రిజిస్ట్రేషన్లు : 41,167
వారసత్వం : 5,134
పరిష్కరించబడిన ఫిర్యాదులు : 40,180
భూ సంబంధిత విషయాలపై ఫిర్యాదులు : 13,510విజయవంతంగా అమలవుతుంది : సంగారెడ్డి కలెక్టర్
సంగారెడ్డి జిల్లాలో ధరణి విజయవంతంగా అమలు జరుగుతుందని సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావు అన్నారు. ధరణి ప్రారంభమై ఏడాది పూర్తయిన సందర్భంగా శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ధరణి వినూత్నమైన, అత్యాధునిక ఆన్లైన్ పోర్టల్ అని, భూ సంబంధిత లావాదేవీలకు శాశ్వత పరిష్కారాన్ని అందిస్తున్నారు. జిల్లాలోని ప్రతీ తహసీల్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
31 లావాదేవీలు, 10 సమాచార మాడ్యూల్స్
ప్రస్తుతం ధరణిలో 31 లావాదేవీలు, 10 సమాచార మాడ్యూల్స్ ఉన్నాయని కలెక్టర్ వెల్లడించారు. రాష్ట్రంలో ధరణి పురోగతి వివరాలను కలెక్టర్ ఈ సందర్భంగా వెల్లడించారు. నిషేధిత భూముల విషయంలో ఉన్న ఫిర్యాదులను పరిష్కరించేందుకు గ్రామాల వారీగా ప్రత్యేక కార్యాచరణ ప్రాణాళిక రూపొందించి పరిష్కారానికి చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, డీఆర్వో రాధిక రమణి, ఏవో స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు.
పారదర్శకమైన రెవెన్యూ వ్యవస్థ : మెదక్ కలెక్టర్
పారదర్శకమైన రెవెన్యూ వ్యవస్థ, రికార్డులను తయారు చేయాలనే మంచి విజన్‌తో సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారని మెదక్ కలెక్టర్ ఎస్.హరీశ్ అన్నారు. ధరణి పోర్టల్ ప్రారంభమై ఏడా ది పూర్తయ్యిన సందర్భంగా శుక్రవారం మెదక్ కలెక్టరేట్లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లాలో గతంలో కేవలం మూడు సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలుండగా, ధరణి ప్రారంభమైన తర్వాత జిల్లాలోని 21 తహసీల్ కార్యాలయాల్లో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కలిగిందన్నారు.
ఏడాదిలో 26,640 క్రయ విక్రయాలు
జిల్లాలో గత ఏడాది 26,640 క్రయ విక్రయాలు జరుగగా, 6,442 గిఫ్ట్డిడ్లు, 3,798 వారసత్వానికి సంబంధించిన సమస్యలు పరిష్కరించబడ్డాయని వివరించారు. అలాగే 6,678 పెండింగ్ మ్యుటేషన్లు క్లియర్ చేశామని, 6,238 గ్రీవెన్స్, 2102 ప్రొహిబిషన్ లిఫ్ట్ సమస్యలు, 708 కోర్టు కేసులు పరిష్కరించామని తెలిపారు. ఇదిలావుండగా ధరణిలో 31 రకాల మాడ్యుల్లు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు వీటిని వినియోగించుకొని భూములకు సంబంధించిన సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా కరోనా వ్యాక్సిన్‌ను తప్పకుండా వేసుకోవాలని కలెక్టర్ హరీశ్ తెలిపారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లుప్రతిమసింగ్, రమేశ్, ఆర్డీవో సాయిరాం పాల్గొన్నారు.