
ఇంటర్మీడియెట్ ఫస్టియర్ పరీక్షలకు ఉమ్మడి మెదక్ జిల్లా అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. సోమవారం నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పరీక్షలు జరగనుండగా, నిమిషం ఆలస్యమైనా అనుమతించమని ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో 131 పరీక్షా కేంద్రాల్లో 35,706 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. కొవిడ్ నిబంధనల మేరకు పరీక్షా కేంద్రాల్లో థర్మల్ స్క్రీనింగ్‌తో పాటు శానిటైజర్‌ను అందుబాటులో ఉంచనున్నారు.
సిద్దిపేట అర్బన్, అక్టోబర్ 24: ఇంటర్ మొదటి సంవత్సర పరీక్షల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కరోనా నేపథ్యంలో మార్చిలో జరగాల్సిన పరీక్షలను రద్దు చేసి రెండో సంవత్సరానికి విద్యార్థులను ప్రమోట్ చేశారు. కరోనా ఉధృతి తగ్గడంతో విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా సోమవారం నుంచి ఇంటర్ రెండో సంవత్సర విద్యార్థులకు ఫస్టియర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఇంటర్మీడియెట్ విద్యాశాఖ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నది. సిద్దిపేట జిల్లాలో మొత్తం 43 పరీక్షా కేంద్రాల్లో 12,240 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఉదయం 9 నుంచి12 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా లోనికి అనుమతించమని అధికారులు చెప్పారు.
43 కేంద్రాలు, 12,240 మంది విద్యార్థులు
సిద్దిపేట జిల్లాలోని 43 పరీక్షా కేంద్రాల్లో మొత్తం 12, 240 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఇందులో 8,285 మంది జనరల్ విద్యార్థులు ఉండగా 3,597 మంది ఒకేషనల్ విద్యార్థులు ఉన్నారు. పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు ప్రశ్నాపత్రాల స్టోరేజీ కోసం అన్ని కేంద్రాలకు 16 స్టోరేజీ పాయింట్స్‌ను ఏర్పాటు చేశారు. 612 మంది ఇన్విజిలేటర్లు, 43 మంది డిపార్ట్మెంటల్ అధికారులు, 43 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, ఇద్దరు ఫ్లయింగ్ స్కాడ్లు, ముగ్గురు సిట్టింగ్ స్కాడ్స్‌ను నియమించారు. వీరితో పాటు పరీక్షల నిర్వహణకు హైపవర్ కమిటీ ఉంటుంది. వీరందరూ ఎప్పటికప్పుడు పరీక్షల నిర్వహణ తీరును పరిశీలిస్తారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉండడంతో పాటు పరీక్షా కేంద్రాల పరిసరాల్లో జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని ఆదేశించారు.
కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పరీక్షలు..
కరోనా కొంత వరకు తగ్గుముఖం పట్టినా విద్యార్థులందరూ ఒక దగ్గర ఉండి పరీక్ష రాయాల్సి ఉంటుంది కాబట్టి కొవిడ్ నిబంధనలు పాటిస్తూనే పరీక్షలు నిర్వహిస్తామని ఇంటర్ విద్యాశాఖ అధికారులు తెలిపారు. ప్రతి విద్యార్థి తప్పకుండా మాస్కు ధరించి పరీక్షకు హాజరుకావాలని సూచించారు. ప్రతి పరీక్షా కేంద్రంలో థర్మల్ స్క్రీనింగ్ చేయడంతో పాటు ఎవరైనా అనారోగ్యంతో ఉన్న విద్యార్థులకు ఐసొలేషన్ గదిని సైతం ఏర్పాటు చేశారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద పోలీస్, ఆరోగ్య సిబ్బందిని అందుబాటులో ఉంచుతామని అధికారులు వెల్లడించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా శానిటైజర్లు, తాగునీటిని అందుబాటులో ఉంచుతామని తెలిపారు. పరీక్ష జరిగే సమయంలో విద్యార్థులకు ఆర్టీసీ బస్సులు సకాలంలో నడపాలని ఆదేశించినట్లు అధికారులు తెలిపారు.
జిల్లాలో మొత్తం 54 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 16,255 మంది విద్యార్థులు పరీక్ష రాయనుండగా, అందులో బాలురు 8,307 మంది, బాలికలు 7,948 మంది ఉన్నారు. జిల్లాలో నిర్వహించనున్న ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం పరీక్షలకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. జిల్లాలో మొత్తం 54 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 26 పరీక్షా కేంద్రాలు, ప్రైవేట్ కళాశాలల్లో 20, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఒకటి, ప్రైవేట్ పాఠశాలల్లో ఏడు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. కేంద్రాల నుంచి తరలించే పరీక్షా పత్రాలను నిల్వ చేసేందుకు 18 స్టోరేజీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కలెక్టర్ ఎం.హనుమంతరావు సంబంధిత అధికారులకు పరీక్ష నిర్వహణపై పలు సూచనలు జారీ చేశారు.
ఆందోళన అవసరం లేదు
జిల్లాలో ఇంటర్మీడియెట్ పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. విద్యార్థుల తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సోమవారం నుంచి నిర్వహించనున్న ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలకు 54 పరీక్షా కేంద్రాలతో పాటు, స్కాడ్ బృందాలు, ఇన్విజిలేటర్లను సిద్ధం చేశాం. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు సకాలంలో చేరుకోవాలి.
మెదక్ జిల్లాలో 34 పరీక్షా కేంద్రాలు
మెదక్ మున్సిపాలిటీ, అక్టోబర్ 24: ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ప్రథమ సంవత్సరం పరీక్షలు సోమవారంనుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలు 62 ఉండగా 34 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు మొత్తం 7,211 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇందులో 6,626మంది జనరల్ విద్యార్థులు కాగా.. 585 మంది ఒకేషనల్ విద్యార్థులు ఉన్నారు. ప్రతి పరీక్షాకేంద్రానికిఒక చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ అధికారిని నియమించారు. 12 ప్రైవేట్ కళాశాలలపరీక్షా కేంద్రాల్లో 12 మందిని అదనపు చీఫ్ సూపరింటెండెంట్లను నియమించారు. పరీక్షల పర్యవేక్షణకోసం 2 ఫ్లయింగ్ స్కాడ్స్ టీమ్‌లు, 3 సిట్టింగ్ స్కాడ్స్ టీమ్‌లను నియమించారు. ఫ్లయింగ్ స్కాడ్ టీమ్‌లో ఒక జూనియర్ లెక్చరర్, డిప్యూటీతహసీల్దార్, ఏఎస్సై ఉండనున్నారు.