
వెల్దుర్తి, నవంబర్ 17: మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో కాకతీయ కట్టడాలు, చారిత్రక సంపద శిథిలావస్థకు చేరాయి. క్రీ.శ. 1162లో కాకతీయరాజు రుద్రదేవుడు హన్మకొండలోని వెయ్యి స్తంభాల గుడిని నిర్మించే సమయంలో వెల్దుర్తిలోని కట్టడాలను నిర్మించినట్లు చరిత్ర ఆధారాలు చెబుతున్నాయి. 12వ శతాబ్దంలో తన తండ్రి ప్రోలరాజును హత్యచేసిన రుద్రదేవుడు సింహాసనాన్ని అధిష్టించాడు. పాపం పోవడానికి రాజ గురువుల మాట ప్రకారం తన రాజ్యమంతటా ఆలయాలను నిర్మించినట్లు చరిత్ర చెబుతున్నది. ఇందులో భాగంగా వెల్దుర్తి పట్టణంలోని తూప్రాన్‌కు వెళ్లే దారిలో నిర్మించిన కాకతీయ కట్టడాలు శిథిలావస్థకు చేరాయి. ఆలయ ప్రాంగణాల్లో శివాలయం, అనంతపద్మనాభస్వామి ఆలయం, విఠలేశ్వర ఆలయాలతో పాటు ఓరుగల్లులోని కాకతీయ తోరణం మాదిరిగా దాదాపు 30 అడుగుల ఎత్తుగల సింహద్వారం కాకతీయ కట్టడాలకు నిలువెత్తు నిదర్శనం. అనంతపద్మనాభస్వామి ఆలయం పూర్తిగా శిథిలావస్థకు చేరింది. శివాలయం ప్రాంగణంలో 25 అడుగుల ఎత్తుగల ధ్వజస్తంభంపై గరత్మంతుడి విగ్రహం ఏర్పాటు చేయగా, ఆలయం ముందు రెండు అంతస్తుల్లో దీప స్తంభాన్ని నిర్మించారు. ఆలయం చుట్టూ నిర్మించిన ప్రహరీ వెనకవైపు కూలిపోయింది. దాతలు ప్రహరీని నిర్మించారు. తవ్వకాల్లో బయటపడిన ఆరు అడుగుల కాళీమాత విగ్రహం, గణపతి, నంది విగ్రహాలు, నాగ దేవతా విగ్రహాలు ముళ్లపొదల్లో దర్శనమిస్తున్నాయి. ఆలయం ప్రాంగణంలో కాకుండా పరిసర ప్రాం తాల్లో అనేక విగ్రహాలు మట్టిలో కూరుకుపోయాయి. ఇక్కడి కాకతీయ తోరణంపై ద్రావిడ భాషలో రాసిన శిలాశాసనం ఉంది. గతంలో పర్యటించిన పురావస్తుశాఖ అధికారులు శిలాశాసనాన్ని పరిశీలించి సుమారు 800 ఏండ్ల చరిత్ర కలిగినట్లు గుర్తించారు. కాకతీయ తోరణం పైభాగంలో ఆరు రంధ్రాలు ఉన్నాయి. ఈ రంధ్రాల్లో నుంచి ఒక్కో రుతువులో సూర్యకిరణాలు ఎదురుగా ఉన్న మహావిష్ణువు ఆలయంలోని మహావిష్ణువు నాభిపై పడి లోకానికి వెలుగునిస్తున్నదని పట్టణ ప్రజల నమ్మకం. తెలంగాణ ప్రభుత్వం చారిత్రక సంపదపై ప్రత్యేక దృష్టి పెట్టి అభివృద్ధికి కృషిచేస్తున్నది. ఆలయ పరిసర ప్రాం తాల్లో తవ్వకాలు చేపడితే మరిన్ని చారిత్రక విగ్రహాలు లభ్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. చారిత్రక సంపదను కాపాడాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.