రైతు సంక్షేమానికి కృషిచేస్తున్న టీఆర్ఎస్ సర్కారు అన్నదాతకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోదు. ధాన్యం సేకరణలో కేంద్ర ప్రభుత్వ తీరుతో తెలంగాణ రైతులకు అన్యాయం జరుగుతున్నది. దీనిని నిరసస్తూ ఇప్పటికే అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఈనెల 12న రైతులతో కలిసి మహాధర్నా చేపట్టి నిరసన తెలిపిన సంగతి తెలిసిందే. తాజాగా గురువారం (నేడు) హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద మహాధర్నాను నిర్వహించేందుకు సిద్ధమైంది. దీనికి ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి మంత్రి హరీశ్‌రావు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ, కార్పొరేషన్ల చైర్మన్లు, రైతుబంధు సమితి ప్రతినిధులు హాజరు కానున్నారు.టీఆర్ఎస్ ప్రభుత్వం మొదటి నుంచి రైతులు, వ్యవసాయానికి అండగా ఉంటున్నది. కరోనా కష్ట కాలంలోనూ గ్రామాల్లో కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధరతో ధాన్యం సేకరించింది. నేరుగా రైతు బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమచేసి భరోసా కల్పించింది. సమైక్య రాష్ట్రంలో ఒకప్పుడు ఎరువులు, విత్తనాల కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పంట పెట్టుబడులకు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించేవారు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఈ సమస్యలన్నీ తీరాయి. దీంతో రైతులు రికార్డు స్థాయిలో పంటలు పండిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కేంద్రం వివక్షతో మన రైతులకు అన్యాయం జరుగుతుండడంతో ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ మరోసారి పోరాటానికి సిద్ధమైంది.
సిద్దిపేట, నవంబర్ 17(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ధాన్యం సేకరణలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద గురువారం మహాధర్నా నిర్వహించనున్నది. టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ఉమ్మడి మెదక్ జిల్లాలోని ప్రజాప్రతినిధులు ధర్నాకు తరలివెళ్లనున్నారు. రాష్ట్ర వైద్య, ఆర్థ్ధికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావుతోపాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లు, డీసీసీబీ చైర్మన్లు, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షులు, కార్పొరేషన్ల చైర్మన్లు తదితరులు పాల్గొననున్నారు. యాసంగి ధాన్యం సేకరణపై కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని వెల్లడించే వరకు టీఆర్ఎస్ పార్టీ వివిధ రూపాల్లో తన నిరసనలు, ధర్నా కార్యక్రమాలు చేపడుతుందని అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఇప్పటికే అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఈనెల 12న రైతులతో కలిసి టీఆర్ఎస్ మహాధర్నా చేపట్టిన విషయం తెలిసిందే. నేడు ఇందిరాపార్కు వద్ద మహాధర్నాను నిర్వహిస్తున్నది. అప్పటికీ కేంద్ర ప్రభుత్వ వైఖరిలో మార్పు రాకపోతే తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని టీఆర్ఎస్ అధిష్టానం ప్రకటించింది. రాష్ట్ర రైతాంగ సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తున్నది. ఢిల్లీలో ఒక మాట.. గల్లీలో ఒకమాట బీజేపీ మాట్లాడుతున్నదనే విమర్శలు ఉన్నాయి. దేశాన్ని ఏలుతున్న బీజేపీ ఒకమాట మీద కట్టుబడి లేకుండా ఇష్టారీతిగా మాట్లాడుతూ తన పబ్బం గడుపుకుంటున్నదని రాజకీయ విశ్లేషకులు విమర్శిస్తున్నారు. రైతులకు మేలు చేద్దామనే ఆలోచనతో పనిచేయడం లేదని అన్నివర్గాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ నాయకులు ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దకు వెళ్లి రైతులపై దాడులు చేస్తూ విధ్వంసాలకు పాల్పడుతున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వరి విషయంలో ద్వంద్వ వైఖరిని అవలంబిస్తున్నది. పంజాబ్ రాష్ట్రంలో మొత్తం ధాన్యం కొనుగోలు చేస్తున్నది. తెలంగాణలో మొత్తం ధాన్యం కొనుగోలు చేయకుండా ఇక్కడి రైతులపై వివక్ష చూపుతున్నది. ఇది ఎక్కడి న్యాయం అంటూ బీజేపీ నాయకులను రైతులు ప్రశ్నిస్తున్నారు. కేంద్రం ఒకటి చెప్పి.. స్థానిక బీజేపీ నాయకులు మరోటి చెప్పి రైతులను అయోమయానికి గురిచేస్తున్నారు. దీంతో రాష్ట్ర బీజేపీ నాయకులను ఎక్కడికక్కడ రైతులు నిలదీస్తున్నారు. సీఎం కేసీఆర్ సూటిగా ప్రశ్నిస్తే ఇంత వరకు బీజేపీ నాయకులు యాసంగిలో ధాన్యం సేకరణపై స్పష్టమైన ప్రకటనను ఇప్పించలేక పోయారని రైతులు విమర్శిస్తున్నారు.
యాసంగి ధాన్యం కొనుగోలుపై కేంద్రం వివక్ష..
దొడ్డు వడ్లు కొనమని కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయడంపై ఉమ్మడి మెదక్ జిల్లా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎక్కువ శాతం మంది రైతులు దొడ్డు రకం వడ్లు మాత్రమే పండిస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్నిరకాల పంటలు కలిపి 15,75,904 ఎకరాల్లో సాగు చేశారు. ఇందులో వరి పంటనే అత్యధికంగా సాగైంది. సిద్దిపేట జిల్లాలో 5,32,827 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు కాగా, ఇందులో వరి అత్యధికంగా 3,12,927 ఎకరాల్లో పండించారు. మెదక్ జిల్లాలో 3,30,694 ఎకరాల్లో వివిధ రకాల పంటలను సాగు చేశారు. ఇందులో 2,56,207 ఎకరాల్లో వరి పండించారు. సంగారెడ్డి జిల్లాలో 7,12,383 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేయగా, ఇక్కడ 1,12,138 ఎకరాల్లో మాత్రమే వరి సాగు చేశారు. సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లాల్లో ఎక్కువగా వరి సాగుచేయడం, కేంద్రం వడ్ల కొనుగోలు విషయంలో మొండి వైఖరి ప్రదర్శిస్తుండడంతో మన రైతాంగానికి అన్యాయం జరుగుతున్నది.
రైతు సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి..
సమైక్య రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వాలు ఒక్క ప్రాజెక్టు నిర్మాణం చేపట్టలేదు. నాణ్యమైన కరెంట్ ఇవ్వక రైతులను అరిగోస పెట్టాయి. తెలంగాణ రాష్ట్రం వచ్చాక సీఎం కేసీఆర్ నేతృత్వంలో రైతు సంక్షేమ పాలన సాగుతుండడంతో అన్నదాతలకు భరోసా ఏర్పడింది. ఒకప్పడు ఎరువులు, విత్తనాల కోసం రైతులు ఇబ్బందులు పడేవారు. పంట పెట్టుబడి సాయానికి ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించేవారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ సమస్యలన్నీ తీరాయి. రైతులకు సకాలంలో ఎరువులు, విత్తనాలు, రైతాంగానికి నాణ్యమైన 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా జరుగుతున్నది. సాగునీటి కష్టాలు తీరాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా సిద్దిపేట జిల్లా మల్లన్నసాగర్, రంగనాయకసాగర్, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్లను ప్రభుత్వం రికార్డు స్థాయిలో నిర్మించి రైతులకు సాగునీరు అందించింది. మెదక్ జిల్లాలోని వనదుర్గా ప్రాజెక్టును అభివృద్ధి చేసింది. సింగూరు ప్రాజెక్టుకు మరమ్మతులు చేపట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి గోదావరి జలాల తెచ్చి చెరువులను నింపింది. దీంతో గత వేసవిలో చెరువులు, చెక్‌డ్యామ్‌లు మత్తళ్లు దుంకాయి. మిషన్ కాకతీయ పథకంతో ప్రభుత్వం చెరువులను బాగుచేసింది. దీంతో బీడు భూములు పచ్చని పంట పొలాలతో కళకళలాడుతున్నాయి. ఇదంతా టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కృషితోనే సాధ్యమైంది. ప్రతి గుంట సాగులోకి వచ్చింది. రికార్డు స్థాయిలో పంటలు పండుతున్నాయి. రైతులకు మంచి రోజులు వచ్చాయి.. అనుకున్న సమయంలోనే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రైతులపై వివక్ష చూపుతున్నది. కేంద్ర ప్రభుత్వం రాష్ర్టానికో విధానం అవలంబిస్తూ తెలంగాణకు తీరని అన్యాయం చేస్తున్నది.
కరోనా క్లిష్ట పరిస్థితుల్లో ధాన్యం కొన్న రాష్ట్ర ప్రభుత్వం…
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏటా మద్దతు ధరతో రాష్ట్ర ప్రభుత్వం ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నది. కరోనా లాంటి క్లిష్ట పరిస్థితుల్లో సైతం రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి చివరి గింజ వరకూ సేకరించింది. మొన్నటి యాసంగిలో సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో 2,22,779 మంది రైతుల నుంచి 11,67,924.560 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించింది. వీటికి సంబంధించి రూ.2,204.27 కోట్లను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. గతంలో ఎప్పుడూ ఇంత పంట రైతులు పండించలేదు. పండించిన పంటకు అప్పటి ప్రభుత్వాలు మద్దతు ధర కల్పించలేదు. సిద్దిపేట జిల్లాలో 405 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి 1,13,408 మంది రైతుల నుంచి 542806.120 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. నేరుగా రైతుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో రూ.1024.05 కోట్లను జమ చేసింది. మెదక్ జిల్లాలో 72,106 మంది రైతుల నుంచి 442193. 640 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రూ.834.86 కోట్లు, సంగారెడ్డి జిల్లాలో మొత్తం 37,265 మంది రైతుల నుంచి 182924.800 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించి, రైతుల బ్యాంకు ఖాతాలో రూ.345.36 కోట్లు జమ చేసింది.