సిద్దిపేట, నవంబర్ 2: మారుతున్న ఆహారపు అలవాట్లతో చిన్నవయసులోనే చాలామంది ఉబకాయం, బీపీ, షుగర్, అల్సర్ లాంటి వ్యాధుల బారిన పడుతున్నారు. దీంతో సాధారణ జ్వరానికి సైతం శరీరం తట్టులేకపోతున్నది. రోగ నిరోదక శక్తి లోపించడమే ఇందుకు కారణం. కొద్దికాలంగా చాలామంది ఆరోగ్య పరిరక్షణపై అవగాహన పెంచుకుంటున్నారు. ఎటువంటి ఆహారం, ఎప్పుడు, ఏ పద్ధతిలో తీసుకోవాలి అనే అంశాలను తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో తాతల కాలం నుంచి పౌష్టికాహారంగా పేరొందిన జొన్న, మొక్కజొన్న, రాగులు, కొర్రలు, సామలు వంటి సంప్రదాయ పంటలతో వండిన ఆహారాన్ని తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ ఆహారంతో రోగ నిరోధక శక్తి పెరగటం బీపీ, షుగర్ లాంటి వ్యాధులు అదుపులో ఉంటాయని వైద్యులు చెబుతుండటంతో వీటికి గిరికీ పెరిగింది. దీంతో పట్టణాలు, మండల కేంద్రాల్లోని అనేక కూడళ్లలో రాగి జావను ప్రత్యేకంగా విక్రయిస్తున్నారు.
సిద్దిపేట మినీస్టేడియం ఎదుట చిన్నపాటి టెంట్ వేసుకుని రాగి జావ (అంబలి) విక్రయిస్తూ కొంతమంది యువకులు ఉపాధి పొందుతున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో ఇక్కడికి వాకింగ్, వ్యాయామం చేసేందుకు వచ్చిన వారు జావాను ఇష్టంగా తాగుతున్నారు. ఉదయం పూట జావను అమ్ముతూ రోజుకు రూ.800 నుంచి రూ.1,200 వరకు సంపాదిస్తూ ప్రజలకు ఆరోగ్యాన్ని పంచుతున్నారు అన్నదమ్ములు అస్లాం, అల్తబ్లు. పట్టణంలోని ఎల్లమ్మ గుడి ప్రాంతానికి చెందిన వీరు రోజూ ఉదయం నాలుగున్నర గంటలకు నిద్రలేచి జావ తయారు చేసుకువచ్చి ఉదయం 6గంటలకు మినీస్టేడియం వద్ద రోజుకు సుమారు 200 నుంచి 250 గ్లాస్లు, జొన్న గట్కా మరో 50గ్లాస్లు అమ్ముతారు. ఇక్కడ రాగి జావా చాలా ఫేమస్. ఒక్క గ్లాస్ రూ.10చొప్పున విక్రయిస్తారు. వీరు తయారు చేసే రాగి జావలో నిమ్మరసం, సల్ల, జీలకర్ర పొడి, దాల్చిన చెక్క పొడి, స్వీట్‌కార్న్, మొలకెత్తిన పెసర్లు, బీట్రూట్, క్యారెట్ తరుగు కలిపి మిక్స్ చేసి ఇస్తారు. దీంతో రుచితో పాటు పోషక విలువలు ఎక్కువగా ఉండటంతో గిరాకీ బాగుంటుంది. దీనిని తయారు చేయడానికి వీరికి రోజువారీగా రూ.1,000 నుంచి రూ.1,200 ఖర్చు అవుతున్నది. అన్ని ఖర్చులు పోనూ రోజుకు రూ.800నుంచి రూ.1,200 ఆదాయం వస్తుంది.
రాగి జావతో ఉపయోగాలు…
రోజు రాగి జావ తీసుకోవడంతో శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఎంతో మేలు. రాగులు గుండె సంబంధమైన వ్యాధులు రాకుండా కాపాడుతాయి. ఎంతో చలువ చేస్తుంది. రాగులలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఎముకలు బలంగా తయారవుతాయి. ప్రోటీన్లు, విటమిన్లు అధికంగా ఉంటాయి. మధుమేహం ఉన్న వారిలో గాయాలు త్వరగా తగ్గడానికి ఉపయోగపడుతాయి.
ఆరోగ్యకరమైన ఆహారం ..
రోజు ఉదయం మినీస్టేడియంలో వాకింగ్ చేసిన తర్వాత రాగి జావ తీసుకుంటా. 2 నెలలుగా జావ తీసుకుంటున్నా. ఉదయం పూట మంచి ఆరోగ్యకరమైన ఫుడ్. మంచి ప్రొటీన్లు కలిగిన ఎంతో బలవర్థకమైన ఆహారం. ఆలసట ఉండదు. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
ఆయిల్ఫుడ్కు దూరం..
రోజు ఉదయం రాగి జావను తీసుకోవటం వల్ల హోటల్ కెళ్లి టిఫిన్ చేయడం తప్పింది. దీంతో ఆయిల్ ఫుడ్ తీసుకోవడం మెల్లగా తగ్గించేశాం. నిత్యం సేవించడంతో మంచి ఎనర్జీగా ఉంటుంది. రోగ నిరోధక శక్తి పెరిగింది.
ఉపాధి పొందుతున్నాం..
8 నెలలుగా జావ అమ్ముతున్న. డిగ్రీ పూర్తి చేశా. నిత్యం 200గ్లాస్లు వరకు విక్రయిస్తున్నా. దీంతో నెలకు రూ.15,000 నుంచి రూ.18,000 వరకు సంపాదిస్తున్నం. ఇద్దరం అన్నదమ్ములం ఈ సెంటర్ నడుపుతున్నాం. జావ తాగేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. మంచి గిరాకీ వస్తుంది.