ఇంద్రవెల్లి : విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఇంద్రవెల్లి (Indravelli) ప్రభుత్వ దవాఖాన వైద్యుడితో పాటు నలుగురు వైద్య సిబ్బందికి జిల్లా కలెక్టర్ రాజర్షి షా ( Rajarshi Shah ) షోకాజ్ నోటీసులు(Show cause notices) జారీ చేశారు. గురువారం ఇంద్రవెల్లి పీహెచ్ సీని కలెక్టర్ , ఉట్నూర్ సబ్ కలెక్టర్ యువరాజ్ మర్మాట్ తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా పీహెచ్ సీ వైద్యుడు శ్రీకాంత్ తోపాటు సీహెచ్ వో సందీప్, పీహెచ్ఎన్ జ్యోతి, హెల్త్ సూపర్ వైజర్ సురేష్, ఎంఎల్ హెచ్ పీ పూజ ఎలాంటి అనుమతులు లేకుండా విధులకు గైర్హాజర్ కావడంతో ఐదుగురికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ విషయంపై జిల్లా వైద్యాధికారి నరేందర్ రాథోడ్ తోపాటు ఏజెన్సీ అదనపు వైద్యాధికారి కుడిమేత మనోహర్‌కు ఫోన్ ద్వారా వివరించారు. వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ దేశించారు.
వైద్యం కోసం వచ్చిన గర్భిణులు, రోగులతో వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. గర్భిణుల వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాలని సిబ్బందికి సూచించారు. అన్ని రకాల మందులు అందుబాటులో ఉండే విధంగా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. పీహెచ్ సీలో పరిశుభ్రత లోపించి ఉండడంతో కలెక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలకు అందుబాటులో ఉండని వైద్యులతోపాటు వైద్య సిబ్బందిలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన వెంట వైద్యురాలు పూజిత, సిబ్బంది రజనీకాంత్, అన్సారీ తదితరులు పాల్గొన్నారు.