YS Sharmila : దత్తపుత్రుడు జగన్ తెర తొలగిందని, బీజేపీతో పెట్టుకున్న అక్రమ పొత్తు తేటతెల్లమైందని ఆయన సోదరి, ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. విపక్షం ముసుగులో ఉన్న వైఎస్సార్సీపీ సైతం ఆర్ఎస్ఎస్ పక్షమేనని నిజ నిర్ధారణ జరిగిందని అన్నారు. బిల్లులను అడ్డుకున్న ప్రతిపక్ష పార్టీలు ఏం సాధించాయి..? అని వైసీపీ అధినేత జగన్ ప్రశ్నించడంపై ఆమె స్పందించారు. టీడీపీ, జనసేనలను మించి మోదీని ఇంతలా మోయాలా..? మన దేశ రాజ్యాంగ పరిరక్షణ కంటే బీజేపీ భజనే ముఖ్యమా..? అని ప్రశ్నించారు.
అక్రమ డీ లిమిటేషన్ బిల్లుపై ఎన్డీఏ పక్షాన నిలబడ్డందుకు జగన్ సిగ్గుపడాలని షర్మిల అన్నారు. ఐదేళ్ల పాలనలో చేసిన అవినీతి కోసం ఇంతలా బీజేపీతో అంటకాగాలా..? కేసుల నుంచి రక్షణ కోసం బానిసగా బ్రతకాలా..? బీజేపీ బిల్లులకు గొర్రెలా, గుడ్డిగా తలాడించాలా..? మోదీ మెప్పు కోసం సొంత కాకిలెక్కలు అల్లాలా..? అని నిలదీశారు. ఇదేనా తమరు చెప్పే వైఎస్ఆర్ ఆశయాలు, వారసత్వం..? అని ప్రశ్నించారు. మహానేత సిద్ధాంతాలను మంటగలిపినందుకు, విలువలకు తూట్లు పొడిచినందుకు ఆత్మవిమర్శ చేసుకోవాలి అన్నారు.
రాజ్యాంగానికి విఘాతం కలిగించే అక్రమ బిల్లులకు విపక్షాలు అడ్డుపడి విజయం సాధిస్తే… ఏం సాధించారని ప్రశ్నించడం హాస్యాస్పదమని, కోట్లాది మంది రాష్ట్ర ప్రజల గుండెలు గాయపరచడమే మీ గొప్పతనమా అని నిలదీశారు. దక్షిణాది రాష్ట్రాల భావోద్వేగాన్ని అర్థం చేసుకోకపోవడమా మీ రాజకీయం..? అన్నారు. ప్రతిపక్షంగా విపక్షానికి మద్దతు ఇవ్వాల్సిందిపోయి అధికార పక్షానికి జై కొట్టడం ప్రపంచంలో ఎక్కడైనా ఉందా..? అని ప్రశ్నించారు. జగన్.. మీరు చేసిన నీచపు పనికి వైఎస్ ఆత్మ నిజంగా ఘోషిస్తోంది అన్నారు.