నిర్మల్ టౌన్, మార్చి 28 : జిల్లాలో దళిత బంధు పథకం ద్వారా ప్రతి నియోజకవర్గంలో వందమంది లబ్ధిదారులను ఎంపిక చేశామని, వారికి త్వరలో రూ.10 లక్షలతో కొత్త యూనిట్లను ప్రారంభించనున్నట్లు నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అన్నారు. పట్టణంలోని తిరుమల గార్డెన్లో నిర్మల్, ఖానాపూర్, ముథోల్ నియోజకవర్గాల లబ్ధిదారులకు సోమవారం దళితబంధు పథకంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్మల్ జిల్లాలో దళితబంధు పథకం కింద ఎంపికైన వారు స్వయం ఉపాధి పొందేందుకు అవసరమైన యూనిట్లు మంజూరు చేస్తామన్నారు. గ్రామాల్లో డిమాండ్ ఉన్న యూనిట్లను ఎంపిక చేసుకోవాలని సూచించారు. దళితబంధు ద్వారా కుటుంబాలు ప్రయోజనం పొందాలని కోరారు. దశల వారీగా ఈ పథకాన్ని మరింత విస్తరిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, జడ్పీసీఈవో సుధీర్‌కుమార్, డీఆర్డీవో విజయలక్ష్మి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ హన్మండ్లు, డీఎస్డీవో రాజేశ్వర్ గౌడ్. తదితరులు పాల్గొన్నారు.