ముంబై : రాబోయే ఉత్తరప్రదేశ్, గోవా అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన పోటీ చేస్తుందని ఆ పార్టీ నేత, ఎంపీ సంజయ్ రౌత్ ప్రకటించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పశ్చిమ యూపీలో శివసేనకు మద్దతు ఇచ్చేందుకు రైతు సంఘాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. యూపీలో మొత్తం 403 మంది నియోజకవర్గాలుండగా.. సేన 80-100 సీట్లలో అభ్యర్థులను నిలబెడుతుందని, 40 అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలున్న గోవాలో 20 చోట్ల పోటీ చేయనున్నట్లు పేర్కొన్నారు.
పశ్చిమ యూపీలోని రైతు సంస్థలు శివసేనకు మద్దతు ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేశాయని, అలాగే చిన్న పార్టీలతో పొత్తు పెట్టుకోవచ్చన్నారు. గోవాలోనూ ‘మహావికాస్ అఘాడి’ ఫార్ములా కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. రెండు రాష్ట్రాల్లోనూ శివసేనకు క్యాడర్ ఉందని, విజయం.. ఓటమితో సంబంధం లేకుండా ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. 2019లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత సీఎం పదవి పంచుకునే విషయంలో శివసేన మిత్రపక్షం బీజేపీతో తెగతెంపులు చేసుకున్న విషయం తెలిసిందే.
ఆ తర్వాత ఎన్సీపీ, కాంగ్రెస్తో కలిసి కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ‘గుజరాత్ ముఖ్యమంతి విజయ్ రూపానీ రాజీనామా’పై ప్రశ్నించగా.. ‘ఇది బీజేపీ అంతర్గత వ్యవహారం. బయటి వ్యక్తులు వ్యాఖ్యానించాల్సిన అవసరం లేదు. ఆయన నాతో రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పటి నుంచి నాకు రూపానీ తెలుసు’ అన్నారు. ‘జాతీయస్థాయిలో మహారాష్ట్ర సీఎం, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే పాత్ర’పై ఓ ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. ‘ఠాక్రేకు ఆ సామర్థ్యం ఉందని.. మహారాష్ట్ర సీఎం జాతీయ నాయకుడు’ అని అన్నారు.