అలంపూర్ : విద్యుత్ షాక్ తో గొర్రెల కాపరి(Shepherd dies) మృతి చెందిన సంఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో అలంపూర్ మండలం భీమవరం గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని ఉండవెల్లి మండలం తక్కశిల గ్రామానికి చెందిన ఈశ్వర్ (33) మూడు రోజుల క్రితమే అలంపూర్ మండలం ఊట్కూరు గ్రామంలో మద్దిలేటి రైతు దగ్గర గొర్రెల కాపరిగా పనిలో చేరాడు. గొర్రెలను మేపడానికి సమీపంలో ఉన్న భీమవరం పొలాల్లోకి వెళ్లాడు.
అక్కడ ఓ పొలంలో విద్యుత్ వైర్ తగిలి కరెంట్ షాక్ కు గురై అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతుడికి భార్య సంద్తో పాటు ముగ్గురు పిల్లలు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని అలంపూర్ దవాఖానలో భద్రపరిచారు. అలంపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.