ఢాకా: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు పదేళ్ల జైలు శిక్ష ఖరారు చేశారు. ఆమె మేనల్లుడు రద్వాన్ ముజిబ్ సిద్దిక్, మేనకోడళ్లు తులిప్ రిజ్వానా సిద్దిక్, అజ్మినా సిద్దిక్లకు కూడా రెండు వేర్వేరు అవినీతి కేసుల్లో శిక్ష పడింది. రాజుక్ న్యూ టౌన్ ప్రాజెక్టుకు సంబంధం ఉన్న ప్లాట్ల కేటాయింపులో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ కేసులో అవినీతి జరిగినట్లు షేక్ హసీనాతో పాటు ఆమె బంధువులపై ఎఫ్ఐఆర్ బుక్ చేశారు. ఢాకాలోని కోర్టు-4కు చెందిన ప్రత్యేక జడ్జీ రాబిల్ ఆలమ్ ఇవాళ ఆ కేసులో తీర్పును వెలువరించారు.
ఒక్కొక్క కేసులో అయిదేళ్ల చొప్పున, మొత్తంగా హసీనాకు పదేళ్ల జైలుశిక్షను ఖరారు చేశారు. తులిప్ సిద్ధిక్‌కు నాలుగేళ్లు, ఇక హసీనా మేనకోడళ్లకు ఒక్కొక్కరికి ఏడేళ్ల శిక్షను వేశారు. ఈ కేసులో సరెండర్ అయిన రాజుక్ సభ్యుడు ఖుర్షీద్ ఆలమ్‌కు ఏడాది జైలుశిక్ష విధించారు. నిందితులు అందరికీ లక్ష జరిమానా విధించారు. ఒకవేళ కట్టలేని పక్షంలో అదనంగా ఆర్నెళ్లు జైలు జీవితాన్ని అనుభవించాలి.
హసీనాకు శిక్ష పడిన విషయాన్ని ఏసీసీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ తారిక్ ఇస్లామ్ ఖాన్ మనిముల్ హసన్ లిపన్ కన్ఫర్మ్ చేశారు.