Allu Arjun | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – ఉపాసన కొణిదెల దంపతులకు కవల పిల్లలు జన్మించిన నేపథ్యంలో సినీ పరిశ్రమతో పాటు అభిమానుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. శనివారం (జనవరి 31) ఉపాసన ఒక పాప, ఒక బాబుకు జన్మనివ్వగా ఈ శుభవార్తను మొదట మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ సంతోషకరమైన సందర్భంలో కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు శుభాకాంక్షల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సోమవారం (ఫిబ్రవరి 2) తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతా ద్వారా రామ్ చరణ్ – ఉపాసన దంపతులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. తన ట్వీట్లో చరణ్ పెద్ద కుమార్తె క్లీంకారను ప్రేమగా “చిట్టిక” అని సంబోధించడం అభిమానుల దృష్టిని ఆకర్షించింది.
అల్లు అర్జున్ తన సందేశంలో “మరోసారి తల్లిదండ్రులైన రామ్ చరణ్, ఉపాసన గారికి హృదయపూర్వక అభినందనలు. ఈ కుటుంబంలో ఆనందం రెట్టింపు అయింది. చిరంజీవి గారు, చిట్టికల ముఖాల్లో ఆ గర్వం, ఆనందం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ చిన్నారుల రాకతో లోకంలో వెలుగు నిండింది. ఈ అందమైన ఆరంభానికి రెట్టింపు ప్రేమ, రెట్టింపు సంతోషం కలగాలి” అని పేర్కొన్నారు. బన్నీ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ మెగా అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది. ఇక కవల పిల్లల తండ్రిగా మారిన రామ్ చరణ్ కూడా తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఇన్స్టాగ్రామ్లో ఉపాసన గర్భధారణ సమయంలో తీసుకున్న ఓ ఫొటోను షేర్ చేస్తూ హృదయానికి హత్తుకునే సందేశం పోస్ట్ చేశారు.
మాకు బేబీ బాయ్, గర్ల్ పుట్టినందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకుతో మా కుటుంబం పూర్తయింది. మా జీవితంలో మహిళలే మా గొప్ప బలం. ఈ ప్రయాణంలో మాకు అండగా నిలిచిన కుటుంబ సభ్యులు, అభిమానులు, శ్రేయోభిలాషులందరికీ ధన్యవాదాలు” అంటూ చరణ్ తన కృతజ్ఞతాభావాన్ని వ్యక్తం చేశారు.కవలల రాకతో కొణిదెల కుటుంబంలో సంబరాలు తారాస్థాయికి చేరాయి. ఇప్పటికే క్లీంకారతో కుటుంబంలో ఆనందం నిండిపోయిన వేళ, ఇప్పుడు బాబు–పాపల జననంతో ఆ సంతోషం రెట్టింపు అయింది. మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఈ శుభవార్త సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ అభిమానుల్లో పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చింది.