Srisailam Temple | శ్రీశైలం : జ్యోతిర్లింగ క్షేత్రం, శక్తిపీఠమైన శ్రీశైలం భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయంలో గురువారం నుంచి శరన్నవరాత్రి వేడుకలు మొదలవనున్నాయి. వేడుకలకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రధాన ఆలయంతో పాటు ఉప ఆలయాలు వివిధ రకాల పూలు, విద్యుద్దీపాలతో అలంకరించగా.. శోభాయమానంగా వెలిగిపోతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం ఆలయ కార్యనిర్వాహణాధికారి పెద్దిరాజు దంపతులు అర్చక వేదపండితులతో కలిసి గురువారం ఉదయం యాగశాల ప్రవేశంతోపాటు మండపారాధన తదితర పూజాకార్యక్రమాలు జరుగనున్నాయి. దీంతో వేడుకలు మొదలవుతాయని ఆలయ స్థానాచార్యులు పూర్ణానంద ఆరాధ్యులు తెలిపారు. సాయంత్రం అలంకార మండపంలో ఉత్సవమూర్తులకు ప్రత్యేక అలంకార పూజలు జరిపించి గ్రామోత్సవనంతరం రాత్రి సువాసినీ పూజ, కాళరాత్రిపూజలతో తొలిరోజు నవరాత్రి మహోత్సవం జరుగుతుందని ఈవో పెద్దిరాజు చెప్పారు. గ్రామోత్సవంలో భ్రమరాంబ సమేత మల్లికార్జును భృంగి వాహనంపై విహరించనున్నారు. అమ్మవారు శైలపుత్రిగా దర్శనమివ్వనున్నారు. వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ అధికారులు తెలిపారు.
శరన్నవరాత్రి వేడుకల్లో తొలిరోజైన గురువారం భ్రమరాంబ అమ్మవారు శైలపుత్రిగా దర్శనం ఇవ్వనున్నారు. అదే రోజున సాయంత్రం భృంగి వాహనంపై విహరిస్తారు. 4న బ్రహ్మచారిణిగా కటాక్షించి.. మయూరవాహనంపై దర్శనమివ్వనున్నారు. 5న చంద్రఘంట అలంకరణ జరుగనుండగా.. రావణ వాహనసేవ జరుగనున్నది. కూష్మాండదుర్గగా శ్రీశైలం భ్రమరాంబ అమ్మవారు దర్శనమిస్తారు. కైలాస వాహన సేవపై ఆదిదంపతులు భక్తులను అనుగ్రహిస్తారు. 4న స్కందమాతగా దర్శనిమిచ్చి.. శేషవాహనంపై విహరిస్తారు. 8న క్యాతాయనిగా అమ్మవారు దర్శనిస్తారు. హంసవాహనం, పుష్పపల్లకీసేవలు నిర్వహిస్తారు. 9న కాళరాత్రి అలంకరణ.. గజవాహన సేవ ఉంటుంది. 10న మహాగౌరిగా అమ్మవారు కటాక్షిస్తారు. భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారలు నందివాహనంపై విహరిస్తారు. 11న సిద్దిదాయినిగా అమ్మవారు దర్శనం ఇవ్వనుండగా.. అశ్వవాహన సేవ జరుగనున్నది. 12న అమ్మవారు నిజరూప దర్శనం ఉంటుంది.
శ్రీశైల మహా క్షేత్రంలో అమావాస్య ప్రత్యేక పూజలను శాస్ర్తోక్తంగా అర్చక వేదపండితులచే నిర్వహించారు. అత్యంత శక్తివంతుడు మహిమాన్వితుడైన క్షేత్ర పాలకుడు బయలు వీరభద్రస్వామికి బుధవారం ప్రదోషకాల సమయంలో పంచామృతాలు, ఫలోదకాలు, పసుపు కుంకుమ విభూది గంధ జలాలు, బిల్వోదక సుగంధద్రవ్యాలు, శుద్దజలాలతో అభిషేకాలు విశేష పుష్పార్చన, మహా నైవేద్య కార్యక్రమాలు చేసినట్లు ఈవో పెద్దిరాజు తెలిపారు. లోక కల్యాణార్థం ప్రతి మంగళవారం, అమావాస్య రోజుల్లో స్వామివారికి అభిషేకార్చనలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆరుబయట ఆలయంలో దర్శనమిచ్చే స్వామిని పూజించడం కారణంగా భూతప్రేత పిశాచ దుష్ట గ్రహదోషాలు తొలిగి సర్వకార్యానుకూలతతోపాటు ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని అర్చకులు తెలిపారు. ప్రతి నెలా వచ్చే అమావాస్య రోజుల్లో సేవాకర్తలు తమ గోత్రనామాలను srisailadevasthanam.org వెబ్సైట్లో పరోక్షసేవలో పాల్గొనేందుకు పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. వివరాలకు దేవస్థానం వివరాలను తెలుసుకునేందుకు కాల్సెంటర్ 8333901351లో సంప్రదించాలని కోరారు.