న్యూఢిల్లీ, ఏప్రిల్ 6: కేంద్రాన్ని ప్రశ్నిస్తే, వ్యతిరేకంగా మాట్లాడితే ఈడీ దాడులు చేయిస్తారా.. ఆస్తులను జప్తు చేస్తారా.. అని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ విధానాలను ఎండగట్టడం వల్లే శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ ఆస్తులను ఈడీ జప్తు చేసిందని ఆరోపించారు. ‘ఇది అన్యాయం’ అని వ్యాఖ్యానించారు. ‘ఏం ఆధారాలున్నాయని సంజయ్ రౌత్ ఆస్తులను ఈడీ జప్తు చేసింది’ అని పవార్ ప్రశ్నించారు. ఇదే విషయమై బుధవారం ఆయన ప్రధాని మోదీతో ముఖాముఖి సమావేశం అయ్యారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ‘సంజయ్ రౌత్‌కు అన్యాయం జరిగింది. అన్యాయాన్ని ప్రధాని దృష్టికి తీసుకురావడం మా విధి’ అన్నారు. రౌత్‌కు జరిగిన అన్యాయాన్ని గురించి చెప్పినప్పుడు మోదీ మౌనంగా ఉన్నారని తెలిపారు. 12 మంది ఎమ్మెల్సీల నియామకంలో గవర్నర్ చేస్తున్న జాప్యాన్ని మోదీ దృష్టికి తీసుకెళ్లినట్టు పవార్ చెప్పారు.